
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): దొంగే.. దొంగా.. దొంగా.. అన్న చందంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తీరు ఉందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిండికేట్ బ్యాంక్ కాలనీలోని కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్‌ను మంగళవారం మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌లతో కలిసి ప్రారంభించారు.
అనంతరం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ కులాల మీద నడుస్తుందా?.. అసలు ఓ భావజాలం మీద నడుస్తుందో లేదో పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. కుల నాయకుడు అయ్యాడు కాబట్టే పవన్ కులాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓ వైపు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల వేడుకలు జరుపుకొంటున్నామని, అయితే టీడీపీ నుంచి జనసేన పార్టీకి ఎప్పుడు స్వాతంత్య్రం వస్తుందో తెలియడం లేదన్నారు.
తన పార్టీని పవన్ ఎలా నడిపిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని చెప్పారు. ఆ పార్టీ ఎక్కడ అయితే మనుగడ సాగిస్తుందో.. అక్కడ ఎవరెవరు ఉన్నారనే దానిపై పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్‌కు రాజకీయంగా అవగాహన, ఓ ఆలోచనా విధానం లేదని విమర్శించారు. పండక్కి పిలిస్తే వచ్చినట్టుగా పార్ట్ టైమ్, పబ్లిసిటీ కోసం తాపత్రయమే తప్ప ప్రజలకు ఏదన్నా మంచి చేయాలనుకోవడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు.
ఇది కూడా చదవండి: మనబడి నాడు–నేడు పనుల్లో నాణ్యతకు ఏపీ సర్కార్ పెద్దపీట