రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించే ముఠాతో అనంతపురం ఎమ్మెల్యే రాయ‘బేరాలు’!
తమ ఆఫీసుకు వచ్చి రేటు మాట్లాడాలనిముఠాలోని ఓ మహిళకు ఎమ్మెల్యే దగ్గుపాటి మామ ఫోన్‌లో హెచ్చరిక
అనంతపురం టౌన్‌లోని ముఠా సభ్యులు అందరూ తమ వద్దకే రావాలని హుకుం
సునీత, శ్రీరామ్, సవిత అంటే ఇక్కడ కుదరదమ్మా.. అంటూ బెదిరింపులు
మమ్మల్ని కాదంటే కేసులు పెట్టించి లోపలేయిస్తాం
మా వద్దకు వస్తే ఐదేళ్లు అన్నీ మేమే చూసుకుంటామని హామీ
వైరల్ అవుతున్న ఎమ్మెల్యే మామ గంగారాం ఫోన్‌కాల్ రికార్డింగ్
పేదల కడుపు నింపే రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించే ముఠాకు అండగా నిలిచి కాలు కదపకుండా కోట్ల రూపాయలు కూడబెట్టుకోవాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పథకం రచించారు. ఈ మేరకు రేషన్ బియ్యం తరలించే ముఠా సభ్యులతో బేరం కుదిర్చే పనిని తన మామకు అప్పగించారు.
ఆయన రంగంలోకి దిగి అనంతపురం టౌన్‌లో బియ్యం కొనుగోలు చేసి వాటిని గోదాములకు చేర్చి, జిల్లా సరిహద్దులు దాటించి నల్లబజారులో అమ్ముకునేదాకా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ముఠా సభ్యులకు భరోసా ఇస్తున్నారు.
తమను కాదంటే కేసులు పెట్టించి లోపలేయిస్తామని బెదిరిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి స్వయాన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మామ గంగారాం చౌక బియ్యాన్ని కార్డుదారులు, డీలర్ల నుంచి సేకరించి నల్లబజారుకు తరలించే ముఠాకు సహకరిస్తున్న ఓ మహిళతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. – అనంతపురం క్రైం
ఈ ఆడియోలోని సంభాషణ ఇలా...
ఎమ్మెల్యే మామ: ఏమ్మా మీరు ఒకసారి ఎమ్మెల్యే ఆఫీసుకు వచ్చి రేటు మాట్లాడుకుని వెళ్లండి. మీరు మొత్తం నలుగురు ఉన్నారు కదా? రేపు ఆఫీసుకు నలుగురు కలిసి రావాల్సి ఉంటుంది.
మహిళ: అన్నా.. అప్పుడే(కౌంటింగ్ అయిన తర్వాత) పరిటాల సునీతమ్మక్క ఇంటి వద్దకు రమ్మంటే వెళ్లాము. సోమందేపల్లి వాళ్లు అక్కడే మాట్లాడుకున్నారు. సరుకు వాళ్లు కదా తీసుకెళ్లేది! మీరు వాళ్లతోనే మాట్లాడండి. మాతో ఎందుకు?
ఎమ్మెల్యే మామ: అలా కాదు... అనంతపురం అర్బన్‌లోని రేషన్ షాపులు వారందరికీ మేం అప్పుడే అలర్టు చేసినాం. మా ఆ«దీనంలోనే ఉన్నాయి. ఇక్కడ మీరు సరుకు నిల్వ ఉంచుకుని పంపుతున్నారు. కావున మీరు మాతో మాట్లాడాలి. అలాకాదని పరిటాల సునీత, శ్రీరాము, బాలాజీ... అంటే ఎలా? పైగా నేను కూడా బాలాజీకి బావే. బాలాజీతో నేను మాట్లాడతాను. సోమందేపల్లి, పెనుకొండ మంత్రి సవితమ్మ ఎవరైనా కానీ.. మీ సరుకు వెళ్లాలంటే అనంతపురం నగరంలో మా అనుమతి తప్పనిసరి. నువ్వు, సుబ్బు, రామకృష్ణ, జయపాల్‌రెడ్డి, జగదీష్ కలసి సాయంత్రం మూడు గంటలకు ఆఫీసుకు రండి. మీరు చాలా కరెక్టు మనిషి అని మా పిల్లలు చెప్పారు. అందుకే మీకు ఫోన్ చేస్తున్నా.
మహిళ: నేను ఒక్కదాన్నే రావాలా అన్నా?
ఎమ్మెల్యే మామ: వద్దు.. మీరు నలుగురు కలిసి రండి. అప్పుడే మాట్లాడతాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు చెప్పకుండా సరుకు పంపొద్దు. సోమందేపల్లి వాళ్లు, పెనుకొండ వాళ్లు వచ్చినా వారికి సరుకు ఇవ్వొద్దు. అలా ఇచ్చారంటే మీ ఇష్టం. చాలా సీరియస్ అవుతుంది. లేదు.. మేము చేసుకుంటామంటే మాత్రం అందరినీ లోపలేపిస్తాం.
మహిళ: లేదులే అన్న మాకేముంది? లోకల్‌లో ఎవరొచ్చినా సరుకు ఎత్తిచ్చేవాళ్లము కదా?
ఎమ్మెల్యే మామ: అలా కాదు... మీరు ఇంకా ఐదు సంవత్సరాలు ఈ వ్యాపారం బాగా చేసుకోవాలంటే నేను ఫుల్ ష్యూరిటీ ఇస్తున్నా. మీకెలాంటి ఇబ్బందీ రానివ్వను. చాలారోజులుగా మీ విషయం మాట్లాడుకుంటున్నాం. నిన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వచ్చి ‘మామ ఇంక అదేందో నువ్వే వాళ్లని పిలిపించుకుని మాట్లాడు’ అంటే నేను బాధ్యత తీసుకున్నా. మీ అందరి గురించి తెలుసుకుని నంబర్లు తీసుకునేలోపు లేటయ్యింది. సాయంత్రం 3 నుంచి 3.30 గంటల మధ్య రండి.
మహిళ: సరే సార్ వస్తాం.
ఎమ్మెల్యే మామ: ఇదే కాదు... భవిష్యత్‌లో కూడా పరిటాల, సవితమ్మ, ఇంకా పార్టీ లీడర్లు... ఇలా ఎవరి నుంచి ఏ ఇబ్బందీ రాకుండా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటున్నాం. రెండు రోజుల్లో మా కమ్మాస్ అతనే సీఐ సాయినాథ్ అని వస్తున్నాడు. కావాలనే మనం తీసుకుంటున్నాం. ఇంకా ఎస్‌ఐలు కూడా మా వాళ్లే వస్తారు. మీరు ఒకటి అర్థం చేసుకోండి. డీఎస్పీ నుంచి సీఐలు, ఎస్‌ఐలు అంతా మా వాళ్లే ఉండాలని తీసుకుంటున్నాం. రెండు రోజుల్లో వస్తారు. మీకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వము. అనంతపురం టోటల్ జిల్లాలో మిమ్మల్ని మాట్లాడించే వారుండరు. అలా ఎవరైనా మాట్లాడితే నాతో ఫోన్‌లో మాట్లాడించండి. నేను చూసుకుంటాను. ఎంతటి వారినైనా వదిలిపెట్టం.
మహిళ: ఇంతకుముందు మా నుంచి ఎవరూ తీసుకోలేదు అన్నా!
ఎమ్మెల్యే మామ: మీరు ఇంకొకరి గురించి చెప్పొద్దు. అలా ఊరికే ఇడిసిపెట్టేది ఉండదు. వాళ్లు వదిలి పెట్టారని మేము ఎలా విడిచి పెడతాము? మీరేమో తప్పుడు పని చేస్తూ ఇంకొకరికి సరుకు ఇస్తున్నారు. మీ నుంచి మేము తీసుకోకూడదంటే ఎలా? వదిలే ప్రసక్తే లేదు. బయట ఎక్కడో మీరు మాట్లాడుకుని మమ్మల్ని ఎవరూ అడగలేదంటే ఎట్లా? ఆఫీసుకు రండి.. ఇక్కడే కూర్చుని మాట్లాడుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment