రైతుల ప్రయోజనాలకే నూతన డిస్కం | Balineni Srinivasa Reddy comments on YSR Free electricity | Sakshi
Sakshi News home page

రైతుల ప్రయోజనాలకే నూతన డిస్కం

Published Tue, Nov 2 2021 5:12 AM | Last Updated on Tue, Nov 2 2021 5:12 AM

Balineni Srinivasa Reddy comments on YSR Free electricity - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయానికి రానున్న 25 ఏళ్లపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు పగటిపూటే 9 గంటలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ అగ్రికల్చరల్‌ సప్లై కంపెనీ’ పేరుతో నూతన డిస్కంని ఏర్పాటు చేస్తోందని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తిగా ఉచితంగానే విద్యుత్తుని సరఫరా చేస్తుందని, రైతులపై ఎలాంటి భారం పడనీయదని తెలిపారు.

రైతుల్లో అనుమానాలు రేకెత్తించేందుకు, గందరగోళం సృష్టించేందుకు కొందరు చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం  విజయవంతంగా అమలు చేస్తోందని, ఇందుకోసం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8,559 కోట్లు కేటాయించిందని తెలిపారు.

వైఎస్సార్‌ ఉచిత విద్యుత్తు  పథకం వల్ల  ప్రతి రైతు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాచేసే సామర్థ్యంగల వ్యవసాయ ఫీడర్లను రూ.1,700 కోట్లతో అప్‌గ్రేడ్‌ చేయించామని, గత రబీ సీజన్‌ నుంచి నూరుశాతం వ్యవసాయ ఫీడర్లకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు.  వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను శాశ్వత పథకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకుంటున్నట్టు చెప్పారు. దీనివల్ల యూనిట్‌ రూ.2.49 చొప్పున ఏడాదికి 7 వేల మెగా వాట్ల విద్యుత్తును పాతికేళ్ల పాటు కొనుగోలు చేసేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement