స్వల్ప పెట్టుబడితో లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)ల్లో విద్యుత్ వృథా అరికట్టడంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) దృష్టి సారించింది. ఐఐటీలో చదివి హైదరాబాద్‌లో స్టార్టప్ కంపెనీ ప్రారంభించిన ఔత్సాహిక ఇంజనీర్లు రూపొందించిన ఆటోమేటిక్ పవర్ మానిటరింగ్ డివైజ్ ద్వారా విద్యుత్తు వృథాను సమర్థంగా అరికట్టవచ్చని గుర్తించారు. దీన్ని ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) అని వ్యవహరిస్తున్నారు.
ఏమిటీ ఐఓటీ?
ఆటోమేటిక్ పవర్ మానిటరింగ్ డివైజ్‌ను ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. విద్యుత్‌తో పనిచేసే ప్రతి పరికరాన్నీ ఈ డివైజ్‌కు అనుసంధానిస్తారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, యంత్రాల్లో సాంకేతిక లోపాలు, విద్యుత్ సరఫరాలో వృథా, ఏది ఎంత విద్యుత్ వినియోగిస్తోందనే వివరాలను ఈ డివైజ్ సమగ్రంగా విశ్లేషించి మొబైల్ ఫోన్‌కు సమాచారం అందిస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు విద్యుత్ వృథాను అరికట్టడంతో పాటు నాణ్యమైన కరెంట్ సరఫరాకు చర్యలు తీసుకుంటారు. ఫలితంగా అనవసర వినియోగం తగ్గిపోయి బిల్లులు కూడా తక్కువగా వస్తాయి. దీని ద్వారా దూరం నుంచే నియంత్రించే వీలుంది.
పిట్ట కొంచెం..కూత ఘనం
పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులకు స్ధిర, శక్తి చార్జీలు విధిస్తారు. స్థిర చార్జీలు కేవీఏకు రూ.470, శక్తి చార్జీలు యూనిట్‌కు రూ.6.7 పైసలు చొప్పున ఉంటాయి. అధిక బిల్లులను నివారించడానికి కెపాసిటర్ బ్యాంకులు, ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్స్‌ను ఉపయోగిస్తారు. పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) సరిచేయడంలో ఏదైనా లోపం తలెత్తితే వెంటనే గుర్తించలేం. ఒకవేళ గుర్తించాలన్నా దాదాపు రూ.1,50,000 నుంచి రూ.2,00,000 వరకూ ఖర్చు చేయాలి. కేవలం రూ.20 వేలు ఖర్చయ్యే పోర్టబుల్ పరికరం ద్వారా దీన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
(చదవండి: గత 7 ఏళ్లలో భారీగా పెరిగిన సౌరశక్తి సామర్థ్యం)
ప్రయోగం విజయవంతం
తూర్పు గోదావరి జిల్లా పద్మ సిరామిక్స్‌లో గతేడాది మార్చిలో తొలిసారి ప్రయోగాత్మకంగా అమర్చిన ఈ పరికరం విజయవంతంగా పనిచేసింది. పరిశ్రమలోని పవర్ ప్యానెల్ సరిగా పనిచేయడం లేదని, కొన్ని స్విచ్ కాంటాక్టులు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఐవోటీ పరికరం గుర్తించింది. అనుసంధానం చేసిన అన్ని పరికరాలకు ప్రతి 30 నిమిషాలకు క్రమం తప్పకుండా డేటాను అందించింది. సగటు శక్తి కారకం 0.87 కు పడిపోతున్నట్లు గమనించి మొబైల్‌ఫోన్ ద్వారా అప్రమత్తం చేసింది. మూడు కెపాసిటర్ బ్యాంకులు దెబ్బతిన్నట్లు గుర్తించి వెంటనే మార్చారు. ఫేజ్ 3లో ఒక కాంటాక్టర్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గమనించి సరి చేశారు.
ఐఓటీ పరికరం ఈ సమస్యను గుర్తించకుంటే సరిదిద్దేందుకు కనీసం నెల గడిచేది. ఐవోటీ ద్వారా మొత్తం క్లస్టర్‌లో సుమారు 11,000 యూనిట్ల వాడకం తగ్గడం ద్వారా ఏడాదిలో రూ.80,000 ఆదా అయింది. ప్లాంట్‌లో ఉత్పత్తి పెరిగి నష్టాలు తగ్గాయి. కర్చన ఉద్గారాల తగ్గింపుతో పర్యావరణహితంగా మారింది.
(చదవండి: ఈ సోలార్ కారును ఏడాదికి రెండు సార్లు ఛార్జ్ చేస్తే చాలు!)
రాష్ట్రమంతా విస్తరిస్తాం..
‘‘రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా 65 ఎంఎస్‌ఎంఈల్లో ఐఓటీ పరికరాలను అమర్చాలని బీఈఈ భావించింది. రూ.13 లక్షల నిధులతో ఉచితంగానే పరికరాలను అమర్చుతోంది. 65 ఎంఎస్‌ఎంఈల్లో ఇంధన ఆదాపై అధ్యయనం నిర్వహించి అనంతరం అన్ని ఎంఎస్‌ఎంఈలకు విస్తరించే కార్యక్రమాన్ని బీఈఈ చేపడుతుంది’’
-వినీత కన్వాల్, డైరెక్టర్, బీఈఈ.
బిల్లు తగ్గుతోంది..
‘‘ఐఓటీ పరికరం బిగించిన తర్వాత మూడు క్లిష్టమైన సమస్యలను గుర్తించడంలో నాకు సహాయపడింది. దీనివల్ల విద్యుత్తు బిల్లు తగ్గుతోంది. ఈ పరికరం నా మొబైల్‌కు హెచ్చరికలను పంపిస్తుంది. విద్యుత్ బిల్లు వచ్చాక బాధపడకుండా తక్షణ చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తోంది. ఊరికి దూరంగా ఉన్నప్పటికీ ఈ పరికరం తనపని తాను చేసుకుపోతోంది’’
-శంకర్, చైర్మన్, పద్మ సెరామిక్స్
Comments
Please login to add a commentAdd a comment