
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ కల్చరల్: జాతీయ పతాకం రూపకల్పనకు బెజవాడ వేదిక కావడం గర్వకారణమని దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎక్స్‌రే సాహిత్యసేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జాతీయ పతాక రూపకల్పన శతజయంతి వేడుకలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు జాతీయ కీర్తిపతాక పురస్కారాల కార్యక్రమం జరిగింది. వెలంపల్లి మాట్లాడుతూ జాతీయ పతాకం రూపకల్పనకు తెలుగు జాతి రత్నం పింగళి వెంకయ్య పూనుకోవడం చరిత్ర చెప్పిన సాక్ష్యమన్నారు.
శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య సేవలను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సంస్థ అధ్యక్షుడు కొల్లూరి అధ్యక్షతన నిర్వహించిన సభలో పింగళి వెంకయ్య మనుమరాలు పింగళి రమాదేవి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.విద్యాధరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులకు జాతీయ కీర్తి పతాక పురస్కారాలను అందజేశారు.