సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండేలా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రతి ఒక్క ఉద్యోగికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది. దీంతో బయోమెట్రిక్ హాజరు విధానం రోజురోజుకు గాడినపడుతోంది. ప్రజారోగ్య విభాగం పరిధిలో 1,690, వైద్య విధాన పరిషత్ పరిధిలో 277, డీఎంఈ పరిధిలో 54 ఆస్పత్రులు, ఇతర సంస్థలున్నాయి. ఈ విభాగాల్లో 49,805 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రజారోగ్య విభాగంలో 65 శాతం, వైద్య విధాన పరిషత్‌లో 80%, డీఎంఈలో 60 శాతానికిపైగా ఉద్యోగులు రోజూ బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 100% ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేసేలా చర్యలు చేపట్టారు. బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులో లేని చోట వెంటనే వాటిని సరఫరా చేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఆస్పత్రులు, డీఎంహెచ్‌వో, ఆర్డీ కార్యాలయాలు, ఇతర సంస్థల వారీగా మొత్తం ఉద్యోగుల వివరాలు రాబడుతున్నారు. అనంతరం ఈ సమాచారాన్ని మాస్టర్ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించాలని యోచిస్తున్నారు.
విధులకు గైర్హాజరు కాకుండా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ సహా 12 మంది సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేస్తూ గతేడాది ఉత్తర్వులు ఇచ్చింది. పీహెచ్‌సీలవారీగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల వివరాలు సేకరించి సిబ్బంది కొరతకు తావివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అవసరం లేకున్నా ఏదో ఒక సాకుతో జిల్లా, ఆర్డీ కార్యాలయాలకు వెళ్తున్నట్టు చెప్పి విధులకు గైర్హాజరు అవుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా పెదకాకాని పీహెచ్‌సీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దీంతో ఇలాంటివి ఎక్కడా పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. నెలలో ఒక నిర్ణీత రోజు మాత్రమే ఆస్పత్రి పని మీద జిల్లా కార్యాలయానికి వెళ్లాలని పీహెచ్‌సీ సిబ్బందిని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ నివాస్ ఆదేశించారు.
వైద్య శాఖలో బయోమెట్రిక్ తప్పనిసరి
Published Tue, May 3 2022 4:03 AM | Last Updated on Tue, May 3 2022 4:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment