
ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్. చిత్రంలో శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
సాక్షి, అమరావతి: వికేంద్రీకృత, సమ్మిళిత పరిపాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా నిరంతర కృషి చేస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రతికూలతను ఎదుర్కొని మరీ ఆర్థికాభివృద్ధి సాధించి జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని చెప్పారు. నేరుగా నగదు బదిలీ ద్వారా ఇప్పటివరకు రూ.1,32,126 కోట్లను పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు, నాడు–నేడు ద్వారా విప్లవాత్మక మార్పులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలివీ..
► వికేంద్రీకృత, సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్య్వవస్థీకృతం చేస్తున్నాం. ఉగాది నుంచి కొత్త జిల్లాల పరిపాలన వ్యవస్థ పని చేయడం ప్రారంభిస్తుంది.
► ఉద్యోగులకు ఐదు విడతల కరువు భత్యాన్ని ఒకేసారి విడుదల చేయడంతోపాటు 23 శాతం ఫిట్‌మెంట్‌తో 11వ వేతన సవరణ అమలు చేశాం. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతోపాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నాం.
► కోవిడ్‌తో రాబడులు తగ్గిపోయినా అభివృద్ధి ఆగకుండా చూశాం. 2020–21లో రాష్ట్రం 0.22 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి సాధించింది. ఇదే సమయంలో దేశ వాస్తవ జీడీపీ వృద్ధి 7.3 శాతం తగ్గింది. 2021–22లో రాష్ట్ర జీడీపీ స్థిర ధరలలో 9.91 శాతం వృద్ధి సాధించింది. 2021–22లో ఆర్థిక వ్యవస్థ ముందస్తు అంచనాలు ప్రస్తుత ధరలతో 16.82 శాతం సమగ్ర అభివృద్ధిని చూపిస్తున్నాయి. తలసరి ఆదాయం గత ఏడాది రూ.1,76,707 ఉండగా 15.87 శాతం అధిక ఉత్తేజకర వృద్ధిరేటుతో ఇప్పుడు రూ.2,04,758కు పెరిగింది.
► నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించి కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మూడు దశల్లో రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యార్థుల చేరికలు పెంచేందుకు జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నాం.
► సార్వత్రిక వైద్య బీమా పథకం కింద 2020–21లో ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి ర్యాంక్ సాధించింది. వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.16,255 కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడంతోపాటు 11 వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, డయాలసిస్ యూనిట్‌తో సహా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన ఉప ప్రణాళిక కింద ఐదు ఐటీడీఏ ప్రాంతాల పరిధిలో సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పనున్నాం.
► గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో రక్త హీనత, పోషకాహార లేమి సమస్యలను అధిగమించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కోసం ఏటా రూ.1,956.34 కోట్లు వెచ్చిస్తున్నాం.
► వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాం. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకు 52.38 లక్షలమంది రైతులకు రూ.20,162 కోట్లు అందించాం. అటవీ హక్కుల రికార్డుల సాగుదారులు, కౌలు రైతులకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో 31 లక్షల మంది రైతులకు రూ.3,788 కోట్లు లబ్ధి చేకూర్చాం. ఈ పథకం ఇతర రాష్ట్రాలకు నమూనాగా నిలిచిందని నీతి ఆయోగ్ గుర్తించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా రూ.1,218 కోట్లు అందించాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సుపరిపాలన ఇండెక్స్ 2020–21లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
► 2019 నుంచి ఇప్పటివరకు 19.02 లక్షలమంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.1,541.80 కోట్లు చెల్లించాం. మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి లాంటి మరో ఆరు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. వైఎస్సార్ జలకళ కింద 3 లక్షలకుపైగా బోరుబావులు రైతులకు ఉచితంగా తవ్వేలా చర్యలు చేపట్టాం. 9 గంటల ఉచిత విద్యుత్తు పథకం కోసం ఇప్పటివరకు రూ.19,146 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న జీవ క్రాంతి పథకం కింద రూ.1,867.50 కోట్లు వెచ్చించి 2.49 లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా రైతులకు గొర్రెలు, మేక పిల్లలను పంపిణీ చేశాం. అమూల్ పాలవెల్లువ ద్వారా పాడి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. వైఎస్సార్ మత్య్సకార భరోసా ద్వారా రూ.331.58 కోట్లు అందచేశాం. డీజిల్ సబ్సిడీని లీటరుకు రూ.9కి పెంచాం. జగనన్న పచ్చ తోరణం కింద ప్రభుత్వం 2021–22లో 9.39 కోట్ల మొక్కలు నాటింది. 646.9 చ.కి.మీ. అదనపు అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది.
► పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. మొదటిదశలో 15.60 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టగా రెండో దశలో 15 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించాం.
► వైఎస్సార్ పింఛన్ కానుక కింద 61.74 లక్షల మందికి ఇప్పటివరకు రూ.48,957 కోట్లు అందచేశాం. పింఛన్ మొత్తాన్ని నెలకు రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచాం.
► వైఎస్సార్ నేతన్న పథకం కింద రూ.577.47 కోట్లు అందించాం.
► జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్లు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశాం. రూ.32.51 కోట్ల వడ్డీ మొత్తాన్ని రీయింబర్స్ చేశాం.
► వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా రూ.770.50 కోట్లు పంపిణీ చేశాం.
► వైఎస్సార్ న్యాయ నేస్తం కింద రూ.23.70 కోట్లు పంపిణీ చేశాం.
► వైఎస్సార్ ఆసరా పథకం కింద 78.75 లక్షలమంది పొదుపు మహిళలకు రూ.12,758 కోట్లు ఆర్థిక సహాయం చేశాం.
► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రెండేళ్లలో 98 లక్షల మంది పొదుపు మహిళలకు రూ.2,354.2 కోట్లను అందించాం.
► వైఎస్సార్ చేయూత ద్వారా 24.95 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.9,179 కోట్లు పంపిణీ చేశాం.
► వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,27,349 మంది లబ్ధిదారులకు రూ.981.88 కోట్లు అందించాం.
► ఈబీసీ నేస్తం ద్వారా మొదటి దశలో 3,92,674 మంది లబ్ధిదారులకు రూ.589 కోట్లు అందించాం.
► మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో అనుసంధానిస్తూ 3 వేల కి.మీ. మేర రూ.6,400 కోట్లతో రెండు లైన్ల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రూ.2,205 కోట్లతో 8,100 కి.మీ. మేర పునరుద్ధరణ పనులు చేపట్టాం. గ్రామీణ రోడ్లను మెరుగుపరిచేందుకు ఏపీఆర్‌ఆర్‌పీ కార్యక్రమం కింద రూ.6,319 కోట్లతో 8,715 కి.మీ. రోడ్ల నిర్మాణం చేపట్టాం. రూ.1,073 కోట్లతో 9,200 కి.మీ.మేర గ్రామీణ రోడ్లకు మరమ్మతులు చేస్తున్నాం.
► ఉపాధి హామీ ద్వారా రూ.7,395.54 కోట్లతో 22.34 కోట్ల పనిదినాలు కల్పించాం.
► పోలవరం నిర్మాణాన్ని 77.92 శాతం పూర్తి చేశాం. 2023 జూన్ నాటికి పూర్తి చేసేలా యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నాం. జలయజ్ఞం కింద 14 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. మరో రెండు పాక్షికంగా పూర్తికాగా మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి.
► శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం, వైఎస్సార్ జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా డోన్‌లలో రూ.1,477 కోట్లతో రక్షిత తాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేశాం.
► వ్యవసాయ అవసరాలకు సోలార్ ప్రాజెక్టుల ద్వారా 25 ఏళ్లలో దాదాపు రూ.3,750 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుంది.
► చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు, టెక్స్‌టైల్స్ రంగానికి ప్రభుత్వం రూ.2,363.2 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించింది. రూ.36,304 కోట్ల పెట్టుబడితో 56,611 మందికి ఉపాధి కల్పిస్తూ 91 భారీ, మెగా ప్రాజెక్టులను ప్రారంభించింది. రూ.1,61,155.85 కోట్లతో 70 భారీ, మెగా ప్రాజెక్టులు(పీఎస్‌యూ)లతో స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తద్వారా 1,80,754 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రూ.7,015.48 కోట్లతో 22,844 ఎంఎస్‌ఎంఈలను ప్రారంభించడం ద్వారా 1,56,296 మందికి ఉపాధి కల్పించాం.
► విశాఖ, తిరుపతిలలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాలు, మరో 26 నైపుణ్యాభివృద్ధి కళాశాలలు నెలకొల్పుతున్నాం.
► 2020–21లో 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల పెరుగుదలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానానికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 13.8 శాతం వృద్ధి సాధించింది.
► స్పందన ద్వారా 2.98 లక్షల ఫిర్యాదులకుగాను 2.87 లక్షల ఫిర్యాదుల పరిష్కారం.
► శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం. 92.27 శాతం లైంగిక దాడుల కేసుల విచారణను 60 రోజుల్లో పూర్తి చేయడం ద్వారా ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment