
సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసిన గొప్ప నాయకుడని, తుది శ్వాస వరకు పరిశ్రమలను రప్పించేందుకు కృషి చేశారని ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. వివాదరహితుడు, అజాత శత్రువు, మర్యాదస్తుడైన గౌతమ్‌రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు. ప్రతి సమస్యపై క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతే మాట్లాడేవారని, ఏ ఒక్కర్నీ ఆయన విమర్శించిన దాఖలాలు లేవన్నారు. గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా మంగళవారం శాసన మండలిలో మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైర్మన్‌తో సహా పలువురు సభ్యులు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. మేకపాటి కుటుంబం అభ్యర్థన మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలోని విద్యా సంస్థలను వ్యవసాయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్ది గౌతమ్‌రెడ్డి పేరుపెట్టాలని సభ్యులు కోరారు.
ఆయనకు కోపం తెలియదు: మండలి చైర్మన్
గౌతమ్‌రెడ్డితో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని, ఆయన ఉన్నత విలువలు కలిగిన గొప్ప వ్యక్తి అని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు చెప్పారు. గౌతమ్‌రెడ్డిలో ఏనాడూ చిరునవ్వు మినహా కోపం చూడలేదని, ఎవరినీ నొప్పించేవారు కాదని గుర్తు చేసుకున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదించేలా చొరవ చూపారన్నారు. పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి అని కొనియాడారు. గౌతమ్‌రెడ్డి ఉభయసభల్లో ఎంతో మర్యాదస్తుడని, ప్రతీ ఒక్కర్ని ఆప్యాయంగా పలకరించేవారని డిప్యూటీ చైర్‌పర్సన్ జకియాఖానం పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సీఎం జగన్ తపన దివంగత గౌతమ్‌రెడ్డిలో నిత్యం కనిపించేదని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి దేవుడు పరిపూర్ణమైన జీవితాన్నివ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నీటిపర్యంతమైన ఎమ్మెల్సీ చక్రవర్తి
తన ఎదుగుదలకు గౌతమ్‌రెడ్డి ఎంతో తోడ్పాటు అందించారని గుర్తు చేసుకుని ఎమ్మెల్సీ బల్లి చక్రవర్తి కన్నీటి పర్యంతమయ్యారు. స్నేహశీలి, వినయశీలి, మృదుస్వభావం లాంటి గొప్ప లక్షణాలున్న గౌతమ్‌రెడ్డి మరణం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి తీరని లోటని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం విషాదకరమని ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ చెప్పారు. మంత్రినన్న దర్పం ఆయనలో ఏనాడూ కానరాలేదని ఎమ్మెల్సీ వి.గోపాలరెడ్డి తెలిపారు. ప్రజలతో ఎలా మెలగాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు, రూ.లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించేలా గౌతమ్‌రెడ్డి కృషి చేశారని ఎమ్మెల్సీ మాధవరావు చెప్పారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి పట్ల కూడా గౌతమ్‌రెడ్డి ఎంతో హుందాగా ఉండేవారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తెలిపారు. హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం గౌతమ్‌రెడ్డి అని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కొనియాడారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న 2 స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీలు గౌతమ్‌రెడ్డి కృషి ఫలితమేనని ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లు, వాకాటి నారాయణరెడ్డి, నరసింహారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment