సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై రాళ్లు విసరడమే లక్ష్యంగా విపక్షం వ్యవహరిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. రైతులు, ప్రజల అవసరాలను తీరుస్తుంటే టీడీపీ నేత యనమల తదితరులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. నిన్నటి దాకా శ్రీలంక అంటూ దుష్ప్రచారం చేసి ఇప్పుడు నెజీరియా, జింబాబ్వే అంటూ యాగీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవని యనమలకు సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై టీడీపీ ఆరోపణలను ఖండిస్తూ బుగ్గన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇబ్బందులున్నా వెనుకంజ వేయలేదు..
సానుకూల దృక్పథం చంద్రబాబు బృందం డిక్షనరీలోనే లేదు. కోవిడ్‌తో ప్రపంచమంతా అల్లాడిన 2020–21 ఆర్థిక పరిస్థితి గురించే యనమల పదేపదే మాట్లాడుతుంటారు. కోవిడ్‌తో జనజీవితం అతలాకుతలం అయింది. ఆదాయ వనరులకు గండి పడింది. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం సుమారు రూ.8 వేల కోట్లు తగ్గింది. మహమ్మారి కట్టడి, వైద్య సదుపాయాలు, టెస్టింగ్, కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ, ఉచిత బియ్యం సరఫరాకు ప్రభుత్వం అదనంగా రూ.7,130 కోట్లు వ్యయం చేసింది. ఇలాంటి పరిస్థితిలోనూ నవరత్నాల అమలులో ఎక్కడా వెనకడుగు వేయలేదు.
నాడు అసాధారణ అప్పులు..
ఐదేళ్ల టీడీపీ హయాంలో అప్పులు 19.6% పెరిగితే వైఎస్సార్‌సీపీ పాలనలో మూడేళ్లలో పబ్లిక్ సెక్టార్ యూనిట్లు తీసుకున్న అప్పులతో కలిపి (రెండేళ్లు కోవిడ్ కష్టాలున్నప్పటికీ) 15.5% మాత్రమే పెరిగాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకున్నా 19.6% వృద్ధితో అప్పులు చేశారు. గత సర్కారుతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉంది.
డీబీటీతో రూ.57,512 కోట్లు
రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు కరోనా వేళ ఉపాధి కోల్పోయి ఇళ్ల నుంచి కదలలేకపోయారు. వారి ప్రాణాలను కాపాడుకుంటూనే డీబీటీ ద్వారా నేరుగా రూ.57,512 కోట్లు పారదర్శకంగా జమ చేసి ఆదుకున్నాం. ప్రభుత్వం ఇంత మొత్తాన్ని ప్రజలకు అందించడం కోవిడ్ సమయంలో ఎక్కడా లేదు. అయినా ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ యనమల పదేపదే బురద చల్లుతున్నారు. కరోనా చెలరేగిన 2020–21 గురించి కాకుండా 2021–22 గురించి టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడరు?
ఆ నిర్వాకాలతోనే ఆంక్షలు
గత సర్కారు ఆర్థిక ఉల్లంఘనలు, అవకతవకలు కాగ్ నివేదికలో స్పష్టంగా ఉన్నాయి. టీడీపీ పాలనలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.17,000 కోట్లు అదనంగా అప్పు చేయటాన్ని కేంద్ర ఆర్థిక శాఖ గుర్తించి తీవ్రంగా తప్పుబట్టింది. గత సర్కారు నిర్వాకాలను కారణంగా చూపిస్తూ ఇప్పుడు రుణ పరిమితిపై ఆంక్షలు విధిస్తోంది.
యనమలవి పచ్చి అబద్ధాలు
రాష్ట్ర అప్పులు రూ.8,00,000 కోట్లు అనే లెక్కలు యనమలకు ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలియదు. అది పచ్చి అబద్ధం. గణాంకాలతో వాటిని రుజువు చేయగలరా? పబ్లిక్ సెక్టార్ యూనిట్లు తీసుకున్న వాటితో కలిపి రాష్ట్ర అప్పు రూ.1,71,176 కోట్లు మాత్రమే. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో వెల్లడించారు. 2019లో టీడీపీ సర్కారు దిగిపోతూ పెండింగ్‌లో పెట్టిన రూ.40,000 కోట్ల బిల్లులు పెనుభారంగా మారాయి. విద్యుత్తు కొనుగోలు, పంపిణీ సంస్థలకు సంబంధించిన అప్పు రూ.46,200 కోట్ల మేర అదనంగా పెంచేసి విద్యుత్తు రంగాన్ని కోలుకోలేని రీతిలో దెబ్బతీశారు. దురదృష్టకరమైన రాష్ట్ర విభజన, టీడీపీ అస్తవ్యస్త పాలన, కోవిడ్ వల్ల దెబ్బతిన్న రాష్ట్ర అర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నాం.
మెరుగ్గా మూలధన వ్యయం
2014–19లో మూలధన వ్యయం రూ.15,227 కోట్లు కాగా వైఎస్సార్‌సీపీ పాలనలో సగటున రూ.18,362 కోట్లు ఉంది. మూలధన వ్యయాన్ని ప్రధానంగా విద్య, ఆరోగ్యంపై వెచ్చిస్తున్నాం.
అప్పులపై వడ్డీలు – వడ్డీ రేట్లు
టీడీపీ హయాంలో సగటున 8.49% వడ్డీలతో అప్పులు తెస్తే మా ప్రభుత్వం 6.96 శాతానికే అప్పు తెచ్చింది. టీడీపీ సర్కారు ఎడాపెడా చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు కడుతున్నాం. గత సర్కారు రకరకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పుల రూపంలో ప్రజాధనాన్ని పక్క దోవ పట్టించలేదా? రైతు సాధికార సంస్థ, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, పవర్ సెక్టార్, డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ల పేరుతో టీడీపీ సర్కారు అప్పులను దారి మళ్లించడం నిజం కాదా? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికీ లెక్క ఉంది. నేరుగా రూ.1,70,000 కోట్లను ప్రజలకు పారదర్శకంగా అందచేసింది.
నిబంధనల ప్రకారమే..
ఆయా ప్రభుత్వాల ఆర్థిక అవసరాలను బట్టి ఎన్నిసార్లైనా వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లవచ్చు. ఆది ఆర్బీఐ కల్పించిన సదుపాయం. మేం నిబంధనలకు విరుద్ధంగా వెళ్తే ఎందుకు అనుమతిస్తుంది? ఓవర్ డ్రాఫ్ట్ అదనపు అప్పు కాదు. 2018 –19లో ఒకసారికి రూ.1,510 కోట్లు ప్రకారం 144 రోజులకు ఓడీకి అనుమతిస్తే రూ.19,654 కోట్లు తీసుకున్నారు. అంటే 107 రోజులు (74.30%) ఓడీ పొందారు. 2019 20లో ఒకసారికి రూ.1,510 కోట్లు ప్రకారం 144 రోజులు ఓడీకి అనుమతిస్తే రూ.17,631 కోట్లు తీసుకున్నాం. అంటే 57 రోజులు (39.58%) ఓడీ పొందాం 2020 –21లో ఒకసారికి రూ.2,416 కోట్లు ప్రకారం 200 రోజులు ఓడీకి అనుమతిస్తే రూ.31,812 కోట్లు తీసుకున్నాం. అంటే 103 రోజులు (51.50%) ఓడీ పొందాం. మరి యనమల చెబుతున్న కాకి లెక్కలు (330 రోజులు) ఎక్కడ నుంచి వచ్చాయి?.
Comments
Please login to add a commentAdd a comment