
సాక్షి, అమరావతి: తాను చెప్పినట్టుగా వినలేదని గతంలో పులివెందుల డీఎస్పీ ఆర్.వాసుదేవన్‌పై సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అవమానించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సీబీఐ అధికారి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపం చెందిన డీఎస్పీ వాసుదేవన్ ఈ విషయంపై కడప ఎస్పీకి గతేడాదే ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారి రామ్‌సింగ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలను నిగ్గుతేల్చడం మీద కాకుండా.. తాను ముందుగా అనుకున్నదే చెప్పించేందుకే యత్నిస్తున్నారన్నది ఈ ఘటనను బట్టి స్పష్టమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన ఏకంగా పోలీసు అధికారులనే బెదిరిస్తుండటం విస్మయపరుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. డీఎస్పీ వాసుదేవన్ కడప ఎస్పీకి 2021, అక్టోబర్ 10న ఇచ్చిన ఫిర్యాదులోని ప్రధాన అంశాలు ఇవీ...
ఎవరు ఒత్తిడి చేశారో చెప్పు..
2021, సెప్టెంబర్ 1న డీఎస్పీ వాసుదేవన్‌ను సీబీఐ అధికారులు కడపలోని గెస్ట్ హౌస్‌కు పిలిపించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సీఐ శంకరయ్యను బెదిరించిన విషయం తెలుసా అని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ అడిగారు. తనకు తెలియదని డీఎస్పీ వాసుదేవన్ చెప్పారు. శంకర్‌రెడ్డి తనను బెదిరించినట్టుగా సీఐ శంకరయ్య స్టేట్‌మెంట్ ఇచ్చారు కదా అని రామ్‌సింగ్ గదమాయించారు. ఆయన అటువంటి స్టేట్‌మెంట్ ఏమీ ఇవ్వలేదని డీఎస్పీ వాసుదేవన్ కచ్చితంగా చెప్పారు. దాంతో సీఐ శంకరయ్య స్టేట్‌మెంట్‌ను సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ మరోసారి సరిచూశారు.
అందులో అలాంటి విషయం ఏమీ లేకపోవడంతో ఆయన డీఎస్పీ వాసుదేవన్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ‘మీరంతా దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు. సరిగ్గా కేసులు విచారించరు. మీరంతా పిరికివాళ్లు’ అని విరుచుకుపడ్డారు. దీనిపై వాసుదేవన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తామంతా సమర్థులం కాబట్టే సిట్‌లో తమను నియమించారని, 30 ఏళ్ల తన సర్వీసులో ఎన్నో సంచలన కేసులను విజయవంతంగా ఛేదించినందునే ఆ అవకాశం కల్పించారని స్పష్టం చేశారు. తాను పులివెందులలో పోస్టింగ్ కావాలని ఏ రాజకీయ నేత వద్దకూ వెళ్లలేదని చెప్పారు.
తన సమర్థతను గుర్తించే పోస్టింగ్ ఇచ్చారన్నారు. దాంతో సీబీఐ అధికారి రామ్‌సింగ్ ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘రాజకీయ నేతల నుంచి ఒత్తిడి వచ్చినందునే ఉదయ్‌కుమార్‌రెడ్డిని విచారించకుండా పంపించావు. అలా ఫోన్ చేసి ఒత్తిడి చేసిన రాజకీయ నేతలు ఎవరో చెప్పు’ అని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. తమపై రాజకీయ నేతలెవరూ ఒత్తిడి చేయలేదని, ఎవరూ ఫోన్లు చేయలేదని డీఎస్పీ వాసుదేవన్ చెప్పారు. తాము సక్రమంగా దర్యాప్తు చేశామన్నారు. కాగా, సీబీఐ అదనపు ఎస్పీ తనను అవమానించడంతో డీఎస్పీ వాసుదేవన్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. 30 ఏళ్లుగా పోలీసు సర్వీసులో ఎలాంటి మచ్చ లేకుండా పనిచేస్తున్న తనను అవమానించడంపై ఆయన కడప ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.