సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఎప్పటిలోపు పూర్తవుతుందో చెప్పడం కష్టమని సీబీఐ గురువారం హైకోర్టుకు నివేదించింది. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉందని, అందువల్ల దర్యాప్తును ముగింపునకు తీసుకు రాలేకపోతున్నామని వివరించింది. జూన్ 13కల్లా ఢిల్లీ, గాంధీనగర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నుంచి నివేదికలు తెప్పించుకోవాలని హైకోర్టు సీబీఐకి స్పష్టంచేసింది. లేని పక్షంలో వాస్తవాల ఆధారంగా నిర్ణయం వెలు వరిస్తామని తేల్చి చెప్పింది.
తదుపరి విచారణను జూన్ 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఉత్తర్వులు జారీ చేశారు. వివేకా హత్య కేసులో నిందితులు గజ్జెల ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వై.సునీల్ యాదవ్‌లు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ రవి గురువారం మరోసారి విచారణ జరిపారు. సీబీఐ తరఫు న్యాయవాది పి.చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో తగిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారని, అది మాత్రమే తమకు కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుంది అన్న సింపుల్ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పాలన్నారు. నిర్దిష్టంగా ఏ తేదీన పూర్తిచేస్తారో అడగడంలేదని, ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందని అడుగుతున్నామని అన్నారు. టైమ్‌లైన్ చెప్పలేమని చెన్నకేశవులు చెప్పారు. వివేకా రాసి నట్లు చెబుతున్న లేఖను ఢిల్లీలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, అక్కడి నుంచి నివేదిక అందాల్సి ఉందన్నారు. ఈ కేసులో నిందితులు దర్యాప్తునకు పలు రకాలుగా ఆటంకాలు కలిగిస్తున్నారని తెలిపారు.
సీబీఐ డ్రైవర్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ, ఈ పిటిషన్లపై వేసవి సెలవులు ముగిసిన వెంటనే జూన్ 13న విచారణ జరుపుతామన్నారు. దీనికి శివశంకర్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ స్పందిస్తూ, పిటిషనర్ ఆరు నెలలుగా జైలులో ఉన్నారని తెలిపారు. పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
విచారణను వాయిదా వేయకుండా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఉత్తర్వులు తమకు అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా ఇబ్బంది లేదన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛే కాదని, సీబీఐ ఆందోళనను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరో మూడు వారాలు వేచి చూద్దామని, ఈ లోపు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు రావొచ్చునన్నారు.
దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం
Published Fri, May 20 2022 5:19 AM | Last Updated on Fri, May 20 2022 3:01 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment