శిరీష తాత, అమ్మమ్మలను సత్కరించిన చందు సాంబశివరావు
తెనాలి: తెలుగువారి చరిత్రలో తొలిసారి అంతరిక్షయానం చేసి రికార్డు సృష్టించిన గుంటూరు జిల్లా తెనాలి అమ్మాయి బండ్ల శిరీష విజయాన్ని ఆమె బంధువులు పండుగలా చేసుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయాణంలో వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ సహా ఆరుగురు పాల్గొన్న విషయం తెలిసిందే. న్యూ మెక్సికో నుంచి ఆదివారం రాత్రి 8 గంటలకు ఆరంభమైన అంతరిక్షయాత్ర 90 నిమిషాల తర్వాత విజయవంతంగా తిరిగి అక్కడకే చేరుకుంది.
తెనాలికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ బండ్ల పుల్లయ్య మునిమనుమరాలైన శిరీష తాతయ్య రాపర్ల వెంకటనరసయ్య, అమ్మమ్మ రమాదేవి ఇక్కడి బోసురోడ్డులోని అపార్టుమెంట్‌లో నివసిస్తున్నారు. వీరితో పాటు బంధువులు రామకృష్ణబాబు కలిసి వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ చానళ్లలో చూశారు. చిన్ననాటి కలను నెరవేర్చుకుని రోదసీలోకి వెళ్లిన తమ మనుమరాలు శిరీష క్షేమంగా తిరిగి వచ్చినందుకు వెంకటనరసయ్య, రమాదేవి ఆనందం వ్యక్తం చేశారు. తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు, మాజీ అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు ఇక్కడికి వచ్చి శిరీష తాతయ్య, అమ్మమ్మలను సత్కరించి, స్వీట్లు తినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment