
సాక్షి, న్యూఢిల్లీ: సమగ్ర శిక్షా పథకం కింద 2022–23లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన, భవనాల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ.867 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి రూ.823 కోట్లు ఖర్చుచేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం నాడు–నేడు పేరుతో వినూత్న పథకాన్ని రూపొందించిందని చెప్పారు.
రూ.17,883.69 కోట్లతో ఏపీలో జాతీయ రహదారుల విస్తరణ
ఏపీలో రూ.17,883.69 కోట్ల అంచనా వ్యయంతో 22 జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ ప్రాజెక్టులు చేపట్టినట్లు జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు.
ఏపీ కేంద్రీయ వర్సిటీల్లో బోధన సిబ్బంది నియామకం లేదు
ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్ వర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ వర్సిటీల్లో 1.4.2017 నుంచి 31.12.2021 వరకు బోధన సిబ్బందిని ఒక్కరిని కూడా నియమించలేదని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు.
గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి 385 ఎకరాలు
గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్ర ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాధపురం గ్రామంలో 385 ఎకరాల భూమిని గుర్తించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు ప్రశ్నకు బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం భూమికి నిధులివ్వాలని సిఫార్సు చేసిందని చెప్పారు.
బీసీ రిజర్వేషన్లకు కేంద్రం అనుమతి అవసరంలేదు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఏ కులానికైనా బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి అవసరంలేదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతశాఖ సహాయమంత్రి ప్రతిమా భౌమిక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పించడంపై బీజేపీ ఎంపీ జి.వి.ఎల్.నరసింహారావు ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment