సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(సీటీయూఏపీ) నిర్మాణానికి సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి మెంటాడ మండలం చినమేడపల్లి వద్ద ఈ నెల 25న శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో, సువిశాల భవనాల్లో ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాకారం కానుంది.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2014లో కేంద్రం మన రాష్ట్రానికి 13 కేంద్రీయ విద్యా సంస్థలను మంజూరు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(సీటీయూఏపీ)ను కేటాయించింది. 2019 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం.. దీనిని పట్టించుకోలేదు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామం వద్ద భూమి కేటాయించినా అది ఏ మాత్రం భవనాల నిర్మాణానికి అనుకూలంగా లేని పరిస్థితి.
పూర్తిగా కొండప్రాంతం. పరిసరాల్లో టీడీపీ నాయకుల స్థిరాస్తి వ్యాపారాన్ని పెంచుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడలేదు. తమ పదవీకాలం ముగిసేవరకూ చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేసింది. చివరకు సీటీయూఏపీ తరగతులను తప్పనిసరిగా ప్రారంభించాల్సి రావడంతో విజయనగరం పట్టణ శివారు కొండకరకాం వద్దనున్న ఏయూ పీజీ క్యాంపస్ పాత భవనంలోనే 2019 ఆగస్టు 5న తరగతులు ప్రారంభమయ్యాయి.
గిరిజనులకు చేరువగా..
ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ లక్ష్యం సార్థకమయ్యేలా గిరిజన ప్రాంతంలోనే దీన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంకల్పించింది. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, విశాఖ–హౌరా రైల్వేలైన్‌లోని విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్లకు అందుబాటులో ఉండేలా భూమి కేటాయించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా స మీపంలోనే ఉంటుంది.
మెంటాడ మండలం చినమేడపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 224.01 ఎకరాలు, దత్తిరాజేరు మండలం మర్రివలస రెవెన్యూ గ్రామ పరిధిలో 337.87 ఎకరాలు.. మొత్తం 561.88 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దాదాపు 480 మంది రైతులకు పరిహారం ఇవ్వాలని అధికారులు గుర్తించారు. ఇప్పటికే దాదాపు రూ. 30.58 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. సాంకేతిక కారణాల వల్ల ఆగిన మిగిలినవారికి 2 రోజుల్లో చెల్లింపు ప్రక్రియ పూర్తి చేస్తామని విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
సీటీయూఏపీకి కేటాయించిన భూమిని గతేడాది కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. వర్సిటీ భవనాల నిర్మాణమంతా కేంద్ర ప్రజా పనుల విభాగం చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోంది. ఇందుకోసం రూ.23.60 కోట్లను గతేడాది విడుదల చేసింది. విశాఖ–రాయ్‌పూర్ జాతీయ రహదారి నుంచి సీటీయూఏపీ ప్రాంగణం వరకూ రూ.16 కోట్లతో 100 అడుగుల వెడల్పున ఆరు లైన్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
తాగునీటి వసతి కల్పనకు రూ.7 కోట్లు, విద్యుత్ సౌకర్యానికి దాదాపు రూ.60 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. కాగా, విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడంలో సీటీయూఏపీ ముందుంది. వారికి ఆసక్తి ఉన్న రంగంలోనే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా 6గ్రాడ్యుయేట్(యూజీ), 8 పోస్టు గ్రాడ్యుయేట్(పీజీ) కోర్సుల్లో బోధన జరుగుతోంది.
అంతర్జాతీయ మార్కెటింగ్ నైపుణ్యాల కోర్సులను ప్రవేశపెడుతున్నా రు. ఇప్పటికే పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా నైపుణ్యాలను, మెలకువలను అందించేలా సాంకేతిక మాధ్యమాలనూ సీటీయూఏపీ రూపొందిస్తోంది. అందుకు సిలబస్‌ను కూర్పు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పర్యవేక్షణలో ప్రవేశపరీక్షలు నిర్వహించి.. ప్రతిభ ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment