సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లో పోరాటం చేసి సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినప్పటికీ.. ఆ ఇళ్లు మంజూరు చేయవద్దని ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు టీడీపీ నేతలు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కృషితో సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు 47 వేలకుపైగా ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని కేంద్ర మంజూరు, పర్యవేక్షణ కమిటీ (సెంట్రల్ సాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ) సోమవారం సమావేశమై సీఆర్‌డీఏ పరిధిలో 47 వేలకుపైగా పేదల గృహాలను మంజురు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ వెల్లడించారు.
న్యాయస్థానాల్లో కేసులున్నాయని, సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు ఇళ్లు మంజూరు చేయవద్దని ఓ పార్టీ ఎంపీలు కొందరు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖకు లేఖలు రాశారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశ అజెండాలో ఈ ఇళ్ల మంజూరు ఉంటుందా ఉండదా? అనే అనుమానాలు కూడా కలిగాయన్నారు. కొంతమంది ఎంపీలు చేసిన వాదనల్లో వాస్తవం లేదని, ఎటువంటి కోర్టు కేసులు లేవని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా కృషిచేసిందని చెప్పారు. దీంతో సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో సీఆర్‌డీఏ పరిధిలోని 47 వేలకుపైగా పేదల ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు.
ఇంకా మూడువేల ఇళ్లకు కేంద్రం నుంచి మంజూరు రావాలని, వాటికి కూడా త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సీఆర్‌డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణాలను జూలై 8వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు. తొలినుంచి సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని టీడీపీ నేతలు న్యాయస్థానాల్లో కేసులు వేసి అడ్డుపడుతూ వచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ పేదల కోసం చట్టసవరణ కూడా చేసి, న్యాయస్థానాల్లో పోరాటం చేసి న్యాయస్థానాల అనుమతితోనే సీఆర్‌డీఏ పరిధిలోని పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేసింది.
గత నెల 26న 50,793 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్
న్యాయస్థానాల్లో పోరాటం అనంతరం గత నెల 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఆర్‌డీఏ పరిధిలోని 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఇదే అమరావతి ఇకమీదట ఒక సామాజిక అమరావతి అవుతుందని, ఇకపై మనందరి అమరావతి అవుతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1,400 ఎకరాల్లో 25 లే అవుట్లు వేసి ఈ పట్టాలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: చర్యలు తీసుకుంటే వేధింపులేనా రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment