
సాక్షి, విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బ్రో మూవీ లావాదేవీలపై జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ రాత్రి(బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలను కలవనున్నారు. బ్రో సినిమాకు విదేశాల నుంచి నిధుల తరలింపుపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
అంతకుముందు పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. బ్రో సినిమా పెద్ద కుంభకోణమని.. అమెరికాలో బాబు ముఠా వసూలు చేసిన డబ్బుతో నిర్మాత ద్వారా పవన్‌కు ప్యాకేజీ ఇచ్చిన్నట్లు విమర్శించారు. తీసుకున్న రెమ్యునరేషన్‌కు పవన్ ఇన్‌కమ్ ట్యాక్స్‌కు లెక్కలు చెప్పారా అని నిలదీశారు. పవన్ శునకానందం వల్లే బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. ఇప్పటివరకు ఆ సినిమాకు రూ.55.26 కోట్లే వచ్చాయని తెలిపారు.
తనపై వివాదం చేసి.. కలెక్షన్లు పెంచుకోవాలని చూస్తున్నారని, దమ్ముంటే రాంగోపాల్ వర్మలా రాజకీయ వ్యంగ్య చిత్రం తీసుకోవాలని సవాల్ విసిరారు. మేడిపండు లాంటి పవన్ జీవితంపై త్వరలో సినిమా తీస్తామని తెలిపారు. మహిళా లోకం మెచ్చుకునేలా క్లైమాక్స్‌లో ఆయనకు గుణపాఠం చెబుతామన్నారు.ఈ సినిమాకు ‘నిత్య పెళ్ళికొడుకు.. పెళ్ళిళ్ళు–పెటాకులు, తాళి–ఎగతాళి పేర్లు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కథకు సరిపోయే మంచి పేరు పెట్టిన వారికి బహుమతి ఇస్తామని పేర్కొన్నారు.
చదవండి: సినిమాల కోసం రాజకీయాలను వాడుకుంటున్న పవన్.. పాపం జన సైనిక్స్!