Chandrababu: మలుపు తిప్పిన ముఠా! పవన్‌ కల్యాణ్‌కూ వాటా | Chandrababu And Yellow Gang Land Scam In Amaravati | Sakshi
Sakshi News home page

Chandrababu: మలుపు తిప్పిన ముఠా! బాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌కూ వాటా

Published Tue, May 16 2023 3:57 AM | Last Updated on Tue, May 16 2023 2:38 PM

Chandrababu And Yellow Gang Land Scam In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి ముసుగులో నారా చంద్రబాబునాయుడు సాగించిన భూదందాలో ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అంశం ఓ అవినీతి అధ్యాయమేనని వెల్లడైంది. అలైన్‌మెంట్‌ ప్రతి మెలికలోనూ పచ్చ గ్యాంగ్‌ అవినీతి గుట్టు రట్టవుతోంది. టీడీపీ హయాంలో సీఆర్‌డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు, వైస్‌ చైర్మన్‌ పొంగూరు నారాయణ అవినీతి బాగోతాలు విస్తుపోయే రీతిలో ఉన్నాయి.

చంద్రబాబు సన్నిహితుడైన లింగమనేని రమేష్‌ భూముల మార్కెట్‌ విలువ రూ.177.50 కోట్ల నుంచి వెంటనే రూ.877.50 కోట్లకు... రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం ఎల్లో గ్యాంగ్‌ బరి తెగింపు వ్యవహారాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌కు కూడా పిడికెడు వాటా ఇవ్వడం కొసమెరుపు. అవినీతికి బాటలు వేసిన ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ వెనుక సాగిన గూడుపుఠాణీ దశలవారీగా ఇదిగో ఇలా సాగింది..!

అలైన్‌మెంట్‌ –1
సీఆర్‌డీఏ తొలుత రూపొందించింది
అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ నిర్ణయించేందుకు టెండర్ల ద్వారా కన్సల్టెన్సీతో నిమిత్తం లేకుండా పని ముగించాలని చంద్రబాబు, నారాయణ నిర్ణయించారు. దీంతో సీఆర్‌డీఏ అధికారులు 94 కి.మీ. పొడవుతో అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను రూపొందించారు. దీన్ని చూసి చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఎందుకంటే దాని ప్రకారం ఇన్నర్‌రింగ్‌ రోడ్డు పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్తుంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెంచుకునేందుకు ఆ అలైన్‌మెంట్‌ను మార్చాలని ఆదేశించారు. 

అలైన్‌మెంట్‌ – 2
చంద్రబాబు ఆదేశాలతో రూపొందించారు
గత సర్కారు పెద్దల ఆదేశాలతో సీఆర్‌డీఏ అధికారులు ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలున్న తాడికొండ, కంతేరు, కాజా ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటూ ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. దక్షిణానికి జరిపారు. హెరిటేజ్‌ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి  కంతేరు, కాజాలో ఉన్న  భూములను ఆనుకుని మరీ ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. మేర అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. 

అలైన్‌మెంట్‌–3
కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించింది

సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్‌ కన్సల్టెన్సీ ద్వారా రూపొందించిన అమరావతి మాస్టర్‌ప్లాన్‌లోనే ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ డిజైన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే చేర్చింది. అంటే అప్పటికే ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ ఎలా ఉండాలన్నది నిర్ధారణ అయిపోయింది. అనంతరం ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు ఎస్టీయూపీ అనే ఓ కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే అది ఉండాలని నిర్దేశించారు. అప్పటికే సీఆర్‌డీఏ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తెరపైకి తెచ్చి ఆమోదించారు. తాడికొండ, కంతేరు, కాజాలో  హెరిటేజ్‌ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకునే అలైన్‌మెంట్‌ను ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ఖరారు చేసింది. 

అలైన్‌మెంట్‌ను ఆనుకుని భూములు
ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పడం ద్వారా హెరిటేజ్‌ ఫుడ్స్,  లింగమనేని రమేశ్‌ కుటుంబానికి చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలున్నాయి. మొదట రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రకారం ఆ భూములకు 3 కి.మీ. దూరంగా ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించాలి. అలైన్‌మెంట్‌ మార్పుతో ఆ భూములను ఆనుకుని ఉండేలా ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారు చేశారు. ఆ ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఆనుకునే హెరిటేజ్‌ ఫుడ్స్‌కు చెందిన 9 ఎకరాలు ఒకచోట, ఒప్పందం చేసుకున్న నాలుగు ఎకరాలు మరో చోట ఉండటం గమనార్హం. 

అమాంతం పెరిగిన విలువ
ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్‌ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్‌ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్‌ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్‌ విలువే నాలుగున్నర రెట్లకుపైగా పెరిగింది. మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్‌ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది.

అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్‌ ధరను బట్టి హెరిటేజ్‌ ఫుడ్స్‌ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. 

అక్కడే పవన్‌ కల్యాణ్‌కు 2.40 ఎకరాలు
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అవినీతి పాపంలో చంద్రబాబు పిడికెడు వాటా ఇచ్చారు. కాజాకు సమీపంలో ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే పవన్‌కల్యాణ్‌కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్‌ పూలింగ్‌ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్‌ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. 

కృష్ణా ఇవతలా అవినీతి మెలికలే
అమరావతి పరిధిలో ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ద్వారా చంద్రబాబు, లింగమనేని కుటుంబాల భూముల విలువ అమాంతం పెంచుకోగా కృష్ణానదికి ఇవతల విజయవాడ శివారులో నారాయణ తమ ఆస్తుల విలువ భారీగా పెంచుకున్నారు. సీఆర్‌డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రకారం ఇన్నర్‌రింగ్‌ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంది. అందుకోసం కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తారు.

గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప నుంచి ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కొనసాగుతుంది. అయితే అలా నిర్మిస్తే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. ఈ అలైన్‌మెంట్‌పై నారాయణ నాడు సీఆర్‌డీఏ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఆర్‌డీఏ సమావేశంలో అధికారులను పరుష పదజాలంతో దూషిస్తూ అలైన్‌మెంట్‌ను మార్చాలని ఆదేశించారు. దాంతో ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు.

ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడ నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్‌రింగ్‌ రోడ్డును నిర్మిస్తారు. నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఉండేలా ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. తన విద్యా సంస్థల భూముల విలువ అమాంతం పెరిగేలా నారాయణ చక్రం తిప్పారు. 

అటూ ఇటూ భారీగా కొనుగోలు
ఇన్నర్‌రింగ్‌ రోడ్డును ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్‌ తన సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. అవన్నీ ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్‌ రోడ్డుకు అటూ ఇటూ ఉండటం గమనార్హం. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement