వచ్చే వారం చంద్రబాబు సర్కారు మరో రూ.2 వేల కోట్ల అప్పు
ఇప్పటికే ఈ నెల రోజుల్లో రూ.7వేల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చే మంగళవారం మరో రూ.2,000 కోట్లు అప్పుచేస్తోంది. దీంతో ఈ నెలరోజుల్లో ఆయన చేసిన అప్పు రూ.9,000 కోట్లకు చేరనుంది. 16 ఏళ్ల కాల వ్యవధికి రూ.వెయ్యి కోట్లు, 19 ఏళ్ల కాల వ్యవధికి మరో రూ.వెయ్యి కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. మరోవైపు.. చంద్రబాబు మంగళవారం మంగళవారం వరుసపెట్టి అప్పులు చేస్తున్నప్పటికీ ఆయనకు భజన చేసే పచ్చమీడియా దీనిపై ఏమాత్రం వార్తలు ప్రచురించడంగానీ, ప్రసారం చేయడంగానీ చేయట్లేదు.
కానీ, గత సీఎం వైఎస్ జగన్ పరిమితుల్లోపే అప్పులు చేస్తే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీలు, ఎల్లో మీడియా కలిసి నానా యాగీ చేశాయి. పైగా, ప్రతీ మంగళవారం అప్పులు చేస్తున్నారని.. దీనివల్ల బ్రహ్మాండం బద్దలైపోతున్నట్లు గుండెలు బాదుకుంటూ తెగ దు్రష్పచారం చేశారు. అదే బాబు సర్కారు విచ్చలవిడిగా ఇప్పుడు అప్పులు చేస్తున్నా అవి తేలు కుట్టిన దొంగలా ఉండడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. గత నెల ఓ మంగళవారం రూ.2,000 కోట్లు అప్పుచేసిన చంద్రబాబు సర్కారు, ఈ నెల 2వ తేదీ మంగళవారం ఒక్కరోజే రూ.5,000 కోట్లు అప్పు చేసింది. ఇప్పడు వచ్చే మంగళవారం మరో రెండువేల కోట్లు తీసుకుంటోంది. వైఎస్ జగన్ సర్కారు అప్పు చేసినప్పుడల్లా పదే పదే పతాక శీర్షికల్లో ప్రచురించిన ఆ ఎల్లో మీడియా ఇప్పుడు అసలు పట్టించుకోకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment