
యడ్లపాడు(చిలకలూరిపేట): పుష్కరకాలంగా నిలిచిన గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్ నిర్మాణానికి మోక్షం లభించింది. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయి. టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ రోడ్డు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేక చొరవ చూపారు. పెద్దమనసుతో కోవిడ్ కష్టకాలంలోనూ రైతులకు నష్టపరిహారం కోసం నిధులు మంజూరు చేశారు. ఫలితంగా పనులు వేగవంతమయ్యాయి.
ఆది నుంచీ వివాదాలు
16వ నంబర్ జాతీయ రహదారి ఆరులైన్ల విస్తరణ పనులను 2009లో హైవే అథారిటీ సంస్థ ప్రారంభించింది. దీనిలో భాగంగా చిలకలూరిపేట వద్ద నెక్లెస్ ఆకారంలో బైపాస్ వేయాలని కొందరు ప్రతిపాదించారు. అయితే దీనివల్ల తాము నష్టపోతామని రైతులు వ్యతిరేకించారు. దీంతో ఈ వివాదం 2010లో కోర్టుకు చేరింది. ఫలితంగా విజయవాడ టోల్‌ప్లాజా నుంచి చిలకలూరిపేట మండలం తాతాపూడి వరకు 84.5 కిలోమీటర్ల మేర జరగాల్సిన రహదారిలో చిలకలూరిపేట పరిధిలోని 16 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి.
గత ప్రభుత్వ అలసత్వంతోనే జాప్యం
2016లో బైపాస్ నిర్మాణానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల నష్టపోయే రైతులకు పరిహారం అందించేందుకు 2018లోనే అవార్డు పాస్‌చేసినా రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన పరిహారం వాటా నిధులు మంజూరు కాలేదు. అప్పటి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉండి కూడా రైతులకు న్యాయం చేయలేకపోయారు.
ఎమ్మెల్యే రజినీ కృషితో కదలిక
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే విడదల రజిని హైవే అథారిటీ సంస్థతో సంప్రదింపులు జరిపారు. సమస్యను తెలుసుకుని సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్ క్లిష్ట సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.57 కోట్లను తక్షణం మంజూరు చేశారు. 2019లోనే రైతులకు నష్టపరిహారం అందించారు.
స్వరూపం ఇలా..
► చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట పట్టణం, మండలాలను కలుపుతూ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ బైపాస్‌ను నిర్మిస్తోంది.
► యడ్లపాడు మండలం తిమ్మాపురం చేపల చెరువు హైవే నుంచి చీలి చిలకలూరిపేట మండలంలోని రామచంద్రాపురం అడ్డరోడ్డు వరకు 16.384 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో రోడ్డు నిర్మాణం కానుంది.
► ఈ మార్గంలో మూడుచోట్ల ఫ్లైఓవర్లు, ఐదుచోట్ల వంతెనలు, ఆరుచోట్ల అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.
► ఈ ఏడాది సెప్టెంబర్ చివరన ప్రారంభమైన ఈ పనులు 2023 మార్చికి పూర్తికానున్నాయి.
సీఎం పెద్దమనసు చూపారు
గత ప్రభుత్వ అలసత్వం వల్ల రైతులకు నష్టపరిహారం నిధులు మంజూరు కాలేదు. ఫలితంగా బైపాస్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో నేను హైవే అథారిటీ ప్రతినిధులతో పలుమార్లు మాట్లాడి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. పరిస్థితిని అర్థం చేసుకుని సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రూ.57కోట్లు కేటాయించారు. వెంటనే రైతులకు పరిహారం అందింది. బైపాస్ పనులు మొదలయ్యాయి.
– విడదల రజిని, ఎమ్మెల్యే
పిల్లర్ల పనులు చేస్తున్నాం
బీఎస్‌ఈపీఎల్ కంపెనీ బైపాస్ నిర్మాణ పనులు చేపట్టింది. సర్వే పనులు పూర్తయ్యాయి. హద్దురాళ్ల ఏర్పాటు, జంగిల్ క్లియరెన్సు పనులూ గతంలోనే ముగిశాయి. ప్రస్తుతం రామచంద్రాపురం వద్ద ఫ్లైఓవర్, బొప్పూడి వద్ద అండర్‌పాస్, ఓగేరు, కుప్పగంజి వాగుల వద్ద వంతెనల నిర్మాణానికి పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. వరుస వర్షాల వల్ల కొంత ఆటంకం కలుగుతోంది. అయినా గడువులోపు పనులు పూర్తిచేస్తాం.
– అబ్దుల్ ఖాదర్, పీడీ బైపాస్ నిర్మాణ సంస్థ
Comments
Please login to add a commentAdd a comment