కలెక్టర్ శ్రీకేష్ నుంచి పురస్కారం అందుకుంటున్న హిమప్రియ
శ్రీకాకుళం (పాత బస్టాండ్)/దొండపర్తి (విశాఖ దక్షిణ)/న్యూఢిల్లీ/: ఉత్తరాంధ్రకు చెందిన ముగ్గురు చిన్నారులు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’లను అందుకున్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సోమవారం వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 29 మంది రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలతో మాట్లాడిన ప్రధాని మోదీ, అనంతరం బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీకాకుళం మండలం పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియ పురస్కారాన్ని అందుకుంది. హిమప్రియకు రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. 2018లో జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల దాడిలో ధైర్యసాహసాలు చూపినందుకు హిమప్రియను ఈ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ.. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సిక్కోలు బాలికకు పురస్కారం దక్కడం గర్వకారణమన్నారు. పురస్కార గ్రహీత హిమప్రియ మాట్లాడుతూ సైనిక కుటుంబంలో జన్మించినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. తన తండ్రే తనకు ఆదర్శమని తెలిపింది.
నాడు ఏం జరిగిందంటే..
హిమప్రియ తండ్రి సత్యనారాయణ ఆర్మీ ఉద్యోగి. ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం జమ్మూ కశ్మీర్‌లోని ఆర్మీ క్వార్టర్స్‌లో నివాసం ఉండేది. 2018 ఫిబ్రవరి 10వ తేదీన జమ్మూకశ్మీర్‌లోని ఆర్మీ క్వార్టర్స్‌పై వేకువజామున ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఆ సమయంలో హిమప్రియ తల్లితో పాటు ఇంట్లోనే ఉంది. తండ్రి 60 కిలోమీటర్ల దూరంలో విధి నిర్వహణలో ఉన్నారు. నాలుగైదు గంటలపాటు ఉగ్రవాదులు తూటాలు కురిపిస్తూ ఉండగా.. హిమప్రియ సాహసం చేసి ఉగ్రవాదులతో పోరాడింది. దాడిలో ఆమెతోపాటు ఆమె తల్లికి కూడా గాయమైనా.. వెరవకుండా ఉగ్రమూకలకు ఎదురెళ్లి క్వార్టర్స్‌లోని మరికొంత మందిని కాపాడింది.
అమేయ, వీర్‌కాశ్యప్‌లకు పురస్కారాల ప్రదానం
విశాఖకు చెందిన శాస్త్రీయ నృత్యకారిణి అమేయ, నేవల్ స్కూల్ విద్యార్థి వీర్‌కాశ్యప్ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్–2021’ అందుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున సోమవారం వీటిని అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అమేయను ప్రధాని మోదీ ప్రశంసించారు. వీరంతా ఢిల్లీలోని రాజ్‌పథ్‌పై జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment