కర్నూలు(అగ్రికల్చర్): మిర్చి పంట రైతులకు లాభాలను తెచ్చి పెడుతోంది. జిల్లాలో సాధారణ సాగు 50,395 ఎకరాలు ఉండగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా 1,26,215 ఎకరాల్లో సాగైంది. గోనెగండ్ల, ఆలూరు, హాలహర్వి, మంత్రాలయం, కోసిగి, హొళగుంద, దేవనకొండ, పెద్దకడుబూరు, ఆస్పరి, సి.బెళగల్, కల్లూరు, చిప్పగిరి తదితర మండలాల్లో సాగు ఎక్కువగా ఉంది.
ఇప్పటి వరకు రెండు కోతలు పూర్తి అయ్యాయి. మరో రెండు కోతలు వచ్చే అవకాశం ఉంది. ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల్లో నేలపై ఎర్ర తివాచీ పరిచినట్లు మిరప దిగుబడులు మిలమిల మెరుస్తున్నాయి.
రూ.75 వేల నుంచి 1.25 లక్షల వరకు పెట్టుబడి
మిర్చి సాగులోఎకరాకు రూ.75 వేల నుంచి 1.25 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. సగటున 25 క్వింటాళ్ల ప్రకారం దిగుబడులు వస్తున్నాయి. జిల్లాలో పండించిన మిర్చి 90 శాతం గుంటూరు మార్కెట్‌కు వెళ్తోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడికి ఎక్కువ తెలంగాణ రైతులు తెస్తున్నారు. కర్నూలు మార్కెట్‌కు నాణ్యత పరంగా మొదటి రకాలు రాకపోయినా ఈ ఏడాది క్వింటాకు గరిష్టంగా రూ.39 వేల వరకు ధర లభించింది. జిల్లాలో ఎక్కువగా బ్యాడిగ, సింజెంట, ఆర్మూర్, తేజ, సూపర్ డీలక్స్, దేవనూరు డీలక్స్ వంటి రకాలు సాగు చేస్తున్నారు. ఈ రకాలతో పండించిన మిర్చితో నాణ్యత ఎక్కువగా ఉంటుంది. దీంతో సగటున క్వింటాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ధర లభిస్తోంది. గతేడాది మిర్చి పంటను నల్ల తామర కొంత వరకు దెబ్బతీసింది. ఈ ఏడాది దీని ప్రభావం అంతగా లేదు.
‘డ్రిప్’ సదుపాయం
జిల్లాలో ఈ ఏడాది 10వేల ఎకరాలకు సూక్ష్మ సేద్యం సదుపాయం కల్పించారు. అత్యధికంగా మిర్చికే డ్రిప్ సదుపాయం కల్పించడం విశేషం. దీంతో దిగుబడులు నాణ్యతతో వచ్చాయి. నీటి సదుపాయంతో సాగు చేసిన పొలాల్లో రికార్డు స్థాయిలో 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కొందరు రైతులు మిర్చిని ఏసీ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు.
కలిసొచ్చిన సాగు
గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామ వాసి అయిన గిడ్డయ్య... 20 ఏళ్లుగా ఎండిమిర్చి సాగు చేస్తున్నాడు. గతేడాది ఎకరాకు 30 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. దానిని కొంత రూ.21వేల ప్రకారం, మరికొంత రూ.30వేల ప్రకారం విక్రయించాడు. ఈ ఏడాది మూడు ఎకరాల్లో సాగు చేశాడు. ఇప్పటికే రెండు సార్లు కోత కోశాడు. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టగా దిగుబడి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు వస్తోంది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్‌లో మిర్చి క్వింటా ధర రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ధర పలుకుతోంది. మిర్చి సాగు బాగా కలసి రావడంతో గిడ్డయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
కష్టానికి తగిన ఫలితం
శ్రీనివాసరెడ్డి. గోనెగండ్ల మండలం కలుమూల గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్‌రెడ్డి. ఈ ఏడాది 1.50 ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటి వరకు రెండు కోతలు కోశాడు. మొదటి కోతలో 8 క్వింటాళ్లు రాగా క్వింటా రూ.21వేల ప్రకారం విక్రయించాడు. రెండో కోతలో 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ. 20వేల ప్రకారం అమ్మాడు. ఇంకా రెండు కోతలకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌లో ధరలు ఉండడంతో కష్టానికి తగిన ఫలితం వచ్చిందని ఈ రైతు సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఈ సారి చీడపీడల సమస్యలు లేవు
జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు భారీగా పెరిగింది. అధిక దిగుబడులు, తెగుళ్లను తట్టుకునే రకాలు అనేకం మార్కెట్‌లోకి వచ్చాయి. గతేడాది మిర్చి పంటను నల్ల తామర దెబ్బతీసింది. ఈ సారి నల్ల తామర నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. గతేడాదితో పోలిస్తే ఈ సారి చీడపీడల సమస్యలు అంతగా లేవు. దీంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. మిర్చికి గిట్టుబాటు ధరలు లభిస్తుండటం రైతులకు ఊరటనిస్తోంది.
– రామాంజనేయులు, జిల్లా ఉద్యానాధికారి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment