గురుమూర్తి తయారు చేసిన పట్టు గూళ్లను విడిపించే యంత్రం
పలమనేరు: నెలపాటు సాగు చేసిన పట్టు గూళ్లను నేత్రికల నుంచి విడిపించడానికి ‘పట్టు’ రైతులు పడే పాట్లు చూసి చలించిపోయాడు.. ఆ రైతు. సమయానికి కూలీలు దొరక్కపోవడం.. దీంతో సకాలంలో మార్కెట్‌కు తీసుకువెళ్లకపోవడం వల్ల ఎదురయ్యే కష్టాలను స్వయంగా తాను అనుభవించాడు. దీంతో ఈ కష్టాలకు చెక్ పెట్టాలని భావించిన పట్టు రైతు తానే పట్టు గూళ్లను విడిపించే యంత్రాన్ని తయారు చేశాడు. రూ.40 వేలతోనే యంత్రాన్ని రూపొందించి శాస్త్రవేత్తల మన్ననలందుకున్నాడు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ప్రోగ్రామ్ కింద అందించే రూ.3 లక్షల ప్రోత్సాహకానికి కూడా ఎంపికయ్యాడు. ఇలా అందరికీ ఆదర్శంగా నిలిచిన రైతే.. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరుకు చెందిన గురుమూర్తి. ఈయన తయారు చేసిన యంత్రంతో పట్టు రైతుల కష్టాలు తీరాయి.
తగ్గిన కూలీల ఖర్చు..
పట్టు పురుగులు నేత్రికల్లో గూళ్లు కట్టాక వాటిని రైతులు జాగ్రత్తగా విడిపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 500 మట్టి (సీడ్) పురుగులను మేపితే సుమారు 400 కిలోల గూళ్లు ఉత్పత్తి అవుతాయి. వెయ్యికిపైగా నేత్రికల్లోని గూళ్లను విడిపించేందుకు రోజుకు 30 మంది కూలీల అవసరముంటుంది. ఒక్కో కూలీకి రోజుకు రూ.300 చొప్పున రూ.9 వేలు ఖర్చు అవుతుంది. అయితే కొన్నిసార్లు సమయానికి కూలీలు దొరకరు. దీంతో గూళ్లను నేత్రికల నుంచి విడిపించడానికి మూడు, నాలుగు రోజులు సమయం పడుతోంది. దీంతో పట్టు గూళ్లను సకాలంలో మార్కెట్‌కు తీసుకెళ్లకపోవడంతో మంచి ధర లభించక పట్టు రైతులు నష్టపోతున్నారు. దీంతో ఈ కష్టాలకు చెక్ పెట్టాలని భావించిన గురుమూర్తి ఈ యంత్రాన్ని తయారుచేశాడు.
విద్యుత్ లేకున్నా పనిచేసేలా..
హాఫ్ హెచ్‌పీ మోటారు సాయంతో నడిచే ఈ యంత్రంలోకి పట్టుగూళ్ల నేత్రికలను ఓ వైపు నుంచి ఒకరు పెడుతుంటే మరోవైపున మరొకరు దాన్ని లాగుతుండాలి. నేత్రికల్లోని గూళ్లు అక్కడే పడి యంత్రానికి ఏర్పాటు చేసిన జల్లెడ ద్వారా ముందుకెళ్లి సంచిలో పడతాయి. దీంతోపాటు పట్టు పురుగులు గూడును అల్లేటప్పుడు కొన్ని మల్బరీ ఆకుల్లోనే గూడును కడతాయి. ఇలాంటి ఆకుగూళ్లను సైతం జాగ్రత్తగా విడదీసేలా గురుమూర్తి ఈ యంత్రాన్ని రూపొందించాడు. ఈ యంత్రాన్ని ఓ చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లవచ్చు.
అంతేకాకుండా విద్యుత్ లేనప్పుడు సైతం చేతితో తిప్పేలా హ్యాండిల్ ఉంది. బైక్‌ను స్టార్ట్ చేసి దానికి బెల్ట్ వేసి కూడా వాడుకోవచ్చు. ఇటీవల ఈ యంత్రాన్ని పరిశీలించిన ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంజనీర్ రమణ, సీనియర్ శాస్త్రవేత్త డా.బాలహుస్సేన్.. రైతు గురుమూర్తిని అభినందించారు. ఈ యంత్రం పట్టు రైతులకు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ప్రోగ్రామ్ కింద గురుమూర్తికి రూ.3 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఇందులో ఇప్పటికే రూ.1.8 లక్షలు ఆయన చేతికందాయి.
పేటెంట్‌కు దరఖాస్తు చేశా
నేను ముప్పై ఏళ్లుగా పట్టు పురుగులు పెంచుతున్నా. కూలీల సమస్యను అధిగమించేందుకు ఈ యంత్రాన్ని తయారుచేశా. దీనికి పేటెంట్ కోసం దరఖాస్తు చేశా. పేటెంట్ వచ్చాక యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తా.
– గురుమూర్తి, పట్టురైతు
Comments
Please login to add a commentAdd a comment