పట్టు గూళ్లు సాగు చేసే రైతుల ఇబ్బందులను తీర్చడంతో పాటు కూలీల ఖర్చును గణనీయంగా తగ్గించే సమగ్ర యంత్రాన్ని రైతు శాస్త్రవేత్త గురుమూర్తి శెట్టి (ఏడూరు బాబు) ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరు వాస్తవ్యుడైన ఆయన కుటుంబం రెండు తరాలుగా పట్టు గూళ్ల సాగులో నిమగ్నమై ఉంది. పదో తరగతి వరకు చదివిన గురుమూర్తి ఊహ తెలిసిన నాటి నుంచి పట్టు గూళ్ల సేకరణ ప్రక్రియలో చాకిరీని గమనిస్తున్నారు. వెదురు చంద్రికలు లేదా రోటరీ మోటేజ్ లేదా ప్లాస్టిక్ నేత్రికల్లో పెరిగిన పట్టు గూళ్లను విడిపించి అమ్మకానికి సిద్ధం చేయటం ఖర్చుతో, శ్రమతో కూడిన పని.
35 మంది కూలీలు రోజంతా శ్రమిస్తే 600 కిలోల పట్టు గూళ్లను మార్కెట్‌కు సిద్ధం చేస్తారు. ఈ పనిలో చాకిరీని తగ్గించగలిగితేనే రైతు నికరాదాయం పెరుగుతుందని ఆలోచనతో కృషి చేసిన గురుమూర్తి అందుకు ఉపయోగపడే ఓ యంత్రాన్ని మూడేళ్ల క్రితం రూపొందించారు. ఆచరణలో ఎదురైన కొన్ని సమస్యలను సైతం పరిష్కరించి సమగ్రమైన కకూన్ హార్వెస్టర్‌కు ఇటీవల రూపొందించారు.
ఈ యంత్రం ఉంటే కేవలం 11 మంది కూలీలతో 600 కిలోల గూళ్లను ప్లాస్టిక్ నేత్రికల నుంచి సులువుగా విడిపించవచ్చని గురుమూర్తి తెలిపారు. పెద్దలు, పిల్లలు, ఆడ, మగ ఎవరైనా దీనిపై సులువుగా పనిచేయవచ్చు. విద్యుత్తు మోటారు లేదా మోటారు సైకిల్ ద్వారా దీన్ని నడపవచ్చు. ఇవేవీ లేకపోతే మనుషులే దీని చక్రం తిప్పుతూ గూళ్లను చంద్రికల నుంచి వేరు చేయవచ్చు. ఆకు గూళ్లు లేదా బెడ్ గూళ్లను శుభ్రం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుండటం విశేషం. పట్టు గూళ్లపైన ఉండే నూగు లేదా ప్లాస్ లేదా జుంజరను తీసివేసి గూళ్లను నున్నగా చేసే శక్తి కూడా ఈ యంత్రానికి ఉంది.
ఈ యంత్రం బరువు తక్కువ. ఆటోలో పెట్టి ఎక్కడికైనా తరలించవచ్చు. ఈ యంత్రం ధర రూ. 40 వేలు. దీనికి వాడిన నట్లు, బోల్టులు, బెల్టు.. అన్నీ గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండేవే. మరమ్మతు వచ్చినా రైతులే చేసుకోవచ్చని గురుమూర్తి వివరించారు. ఈ యంత్రాన్ని ఉత్పత్తి చేసి సెరికల్చర్ రైతులకు అందించడానికి గురుమూర్తి ‘గురూస్ ఎంటర్‌ప్రైజెస్’ స్టార్టప్ కంపెనీని నెలకొల్పారు. ‘రఫ్తార్’ పథకం కింద రూ.1.80 లక్షలను అందించి ప్రభుత్వం ప్రోత్సహించింది. తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారులు డా. సి. రమణ, డా. బాలహుస్సేన్‌రెడ్డి ఈ యంత్రం పనితీరును చూసి ముగ్ధులయ్యారు. సొంత తెలివితో యంత్రాన్ని ఆవిష్కరించిన గురుమూర్తి శెట్టి(98491 26223)కి జేజేలు!
ఎలుకలకు అడుగున్నర దూరం!
వరి సాగులో నారు మడి నుంచి పంట దిగుబడి వరకు ఎలుకల సమస్య రైతులను సతమతం చేస్తుంటుంది. 5–10% ధాన్యం దిగుబడి నష్టం జరుగుతూ ఉంటుంది. విష గుళికలు చల్లటం, గమ్ స్టిక్లర్ల ఎరలు పెట్టడం, బుట్టలు పెట్టి (ఎలుకకు రూ. 20–30 చెల్లించి) పట్టుకోవటం.. ఎన్ని ఉపాయాలు చేసినా ఎలుకలు తప్పించుకుంటూ నారును, పాల కంకులను కొరికేస్తూనే ఉంటాయి. అయితే, కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, నాలుగేళ్లుగా సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మాదివాడ సురేంద్ర అనుభవాలు వేరుగా ఉన్నాయి. ఆయన ఎలుకలకు విభిన్నంగా చెక్ పెడుతున్నారు.
45 సెం.మీ. దూరంలో..
శ్రీవరి పద్ధతిలో సాధారణంగా వరి మొక్కల్ని 25–30 సెం. మీ. దూరంలో నాటేస్తూ ఉంటారు. సురేంద్ర మాత్రం కుల్లాకర్, నారాయణ కామిని, మైసూర్ మల్లిగ వంటి దేశీ వరి వంగడాల నారును ఎటు చూసినా 45 సెం.మీ. (అడుగున్నర) దూరంలో నాటేస్తున్నారు. మొక్కలు ఇంత దూరంలో ఉండటం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి ఎక్కువ దుబ్బులు కట్టడం వల్ల, ఎలుకలు కంకులను కొరికేయకుండా ఉండటం వల్ల దిగుబడి ఏమీ తగ్గటం లేదు.
ఎలుకల సమస్యకు ఇది అద్భుత పరిష్కారంగా కనిపించిందని ఆయన తెలిపారు. ఇంత దూరంగా నాట్లేయటం వల్ల ఎలుకల సమస్య 90% తీరిపోయిందన్నారు. ఎలుకలు, బహుశా ప్రాణభయంతో కావచ్చు, వత్తుగా ఉండే పంట పొలాలనే ఎంచుకుంటాయి. ఎడం ఎడంగా దుబ్బులు ఉన్నప్పుడు ఏ కాకులో, ఏ గుడ్లగూబో తన్నుకుపోతాయన్న భయం వీటికి కలుగుతూ ఉండొచ్చు. అందుకే నా పొలంలోకి రావట్లేదు. వత్తుగా ఉన్న పొరుగు పొలాల్లో ఎలుకలు ఎడతెగని సమస్యగా ఉన్నాయన్నారు.
రేడియో ప్రసారాలతో నారుమడికి రక్షణ!
వరి నారుమడిలో కూడా ఎలుకల సమస్య తీవ్రంగా ఉంటుంది. విత్తనాలు తినేస్తాయి. మొలకలనూ కొరికేస్తూ ఉంటాయి. పొలం అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి కూడా నారుమళ్లకు ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకని కొందరు రైతులు కలిసి ఒకే చోట నార్లు పోసుకుంటూ ఉంటారు. అయినా, ఎలుకల సమస్య ఉండనే ఉంటుంది. సురేంద్ర ఇంటర్‌నెట్‌లో వెతికితే.. అలజడిగా ఉంటే, వెలుతురుగా ఉంటే ఎలుకలను అరికట్టవచ్చని అర్థమై.. ఆ దిశగా ప్రయత్నించి విజయం సాధించారు. ఏ భాషలోనైనా సరే నిరంతరం ప్రసారాలుండే స్టేషన్‌ను ఆన్ చేసిన రేడియోను 2 సెంట్ల నారుమడిలో రాత్రి 8.30కి పెట్టేవారు.
పొద్దున్నే తీసేసే వారు. ఈ పని చేయటం ప్రారంభిచిన తర్వాత నారుమడికి ఎలుకల సమస్య లేకుండా పోయింది. విస్తారమైన వరి/మినుము పొలంలో అయితే ఎక్కువ చోట్ల రేడియోలు పెట్టాలి లేదా ఒక రేడియో నుంచి దూరం దూరంగా పొలం అంతటా సౌండ్ బాక్స్‌లైనా పెట్టుకోవాలి. పొలాల్లో తాటి చెట్లు ఉంటే.. దానిపై గుడ్లగూబలు, కాకులు ఉండి.. ఎలుక పిల్లలను ఏరుకు తింటూ ఉంటాయి. తాటి చెట్లు కొట్టేయటం కూడా ఎలుకల సమస్య పెరగడానికి ఓ కారణమని సురేంద్ర (88862 31122) అంటున్నారు. సెన్సార్‌తో పని చేసే సోలార్ లైట్ల ద్వారా కూడా ఎలుకలను అరికట్టవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment