సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా వేళ్లూనుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను కూకటి వేళ్లతో సహా తొలగించే విస్తృత కార్యాచరణకు సీఐడీ విభాగం ఉపక్రమించింది. రాష్ట్రంలోని మొత్తం 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు చేపట్టింది. నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్ల వ్యవహారాల్లో కీలక ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో చందాదారుల ఫిర్యాదులతో కార్యాచరణ చేపట్టింది. ఫేక్ డిపాజిట్‌దారుల పేరిట మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో భారీగా నల్లధనాన్ని చేతులు మారుస్తుండటంపై సీఐడీ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆధారాల ధ్వంసానికి పాల్పడటంపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేపట్టడంతో సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలు వెలుగు చూసిన తరువాత సీఐడీ విభాగం ఇప్పటివరకు రాష్ట్రంలోని ఏడు బ్రాంచి కార్యాలయాలు, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో మాత్రమే సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజలను విచారించింది.
సహాయ నిరాకరణతో..
చిట్‌ఫండ్ చట్టం 1982కి విరుద్ధంగా రామోజీరావు యథేచ్ఛగా పాల్పడిన ఆర్థిక అక్రమాలపై సీఐడీ ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించింది. నిధుల మళ్లింపు, అక్రమ డిపాజిట్లు, అక్రమ పెట్టుబడులపై ఆధారాలను ప్రదర్శిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయంలోని కీలక అధికారులను ప్రశ్నించింది. చట్ట ప్రకారం బ్రాంచి మేనేజర్లకు చెక్ పవర్ ఉండాలి. చందాదారులు చెల్లించిన సొమ్మును సంబంధిత బ్రాంచి కార్యాలయాలున్న నగరాలు / పట్టణాల్లోని జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా చందాదారుల సొమ్మును హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి తరలించి అక్రమ పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. ఈ నిధుల మళ్లింపులో చెరుకూరి శైలజా కిరణ్‌తోపాటు 11 మంది మార్గదర్శి ఉన్నతాధికారులు కీలక భూమిక పోషించారు.
వారిలో ఏడుగురు ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాంచిలకు సంబంధించి వ్యవహారాలు నిర్వర్తించారు. కీలక ఆధారాలను ఎలా ధ్వంసం చేయాలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బ్రాంచి మేనేజర్లకు వివరించారు. దీనిపై ఆ ఏడుగురు ఉన్నతాధికారులను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. అయితే రామోజీ ఆదేశాలతో వారు సీఐడీ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించలేదు. దీంతో ఈ కేసులో దూకుడు మరింత పెంచాలని నిర్ణయించిన సీఐడీ ఏకకాలంలో రాష్ట్రంలోని 37 బ్రాంచి కార్యాలయాల్లో శనివారం సోదాలు చేపట్టింది. ఉదయం ప్రారంభించిన సోదాలు అర్ధరాత్రి వరకూ కొనసాగుతున్నాయి. మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో వారం రోజులపాటు సోదాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫేక్ చందాదారులు.. జాడలేని కీలక రికార్డులు
ఏకకాలంలో బ్రాంచి కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సీఐడీ అధికారులు మార్గదర్శి అక్రమాలను గుర్తించి విస్తుపోయారు. చిట్‌ఫండ్ చట్టం ప్రకారం నిర్వహించాల్సిన రికార్డులు ఏవీ బ్రాంచి కార్యాలయాల్లో లేవు. చందాదారుల సొమ్మును జాతీయ బ్యాంకుల్లో జమ చేసినట్లు రికార్డులు సైతం లేకపోవడం గమనార్హం. నిధుల మళ్లింపునకు సంబంధించిన కనెక్టింగ్ రికార్డులు, లెడ్జర్ పుస్తకాలు లేకపోవడంతోపాటు బ్రాంచి కార్యాలయాల వార్షిక నివేదికల్లో వాటి ప్రస్తావనే లేదు. ఒక్కో బ్రాంచి కార్యాలయంలో నిర్వహిస్తున్న చిట్లు ఎన్ని? ఎంతమంది చందాదారులున్నారు? ప్రతి నెలా చందా మొత్తం ఎంత వస్తోంది? ఆ నిధులను ఏం చేస్తున్నారు? అనే రికార్డులేవీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సక్రమంగా నిర్వహించడం లేదని వెల్లడవుతోంది. పలువురు చందాదారులకు సంబంధించి సరైన చిరునామాలు కూడా లేవు. చందాదారుల ముసుగులో భారీ ఎత్తున నల్లధనాన్ని బ్రాంచి కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ నిధులను రామోజీరావు కుటుంబానికి చెందిన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్( కర్ణాటక)– బెంగళూరు, మార్గదర్శి చిట్‌ఫండ్స్(తమిళనాడు)– చెన్నైలలో పెట్టుబడిగా చూపించారు. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలోనే ఉంది. అంటే భారీ ఎత్తున నల్లధనాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టుబడి పెట్టినట్టు స్పష్టమవుతోంది.
ఫిర్యాదులపై కార్యాచరణ
మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు సీఐడీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. తాము ష్యూరిటీ సమర్పించినా చిట్టీ మొత్తాన్ని ఇవ్వడం లేదని, చిట్టీ మొత్తంలో కొంత భాగం డిపాజిట్లుగా ఉంచారని, తమను వేధిస్తూ ఆస్తులు అటాచ్ చేశారని... పలు ఫిర్యాదులు సీఐడీ దృష్టికి వచ్చాయి. వీటికి సంబంధించి బ్రాంచి కార్యాలయాల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు. అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు, ష్యూరిటీలు ఇచ్చినా చిట్టీ మొత్తాన్ని చెల్లించకుండా వేధిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. మరోవైపు ష్యూరిటీకి సంబంధించి మార్గదర్శి విధించిన షరతులు కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. వీటిపై కీలక రికార్డులను సీఐడీ అధికారులు జప్తు చేశారు.
విచారించి వాంగ్మూలాలు నమోదు
మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో వారం రోజుల పాటు క్షుణ్నంగా సోదాలు కొనసాగించాలని సీఐడీ భావిస్తోంది. ప్రతి బ్రాంచి కార్యాలయం పరిధిలోని చందాదారుల్లో కనీసం 25 శాతం మందిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. డిపాజిట్లు పెట్టిన చందాదారులపై దృష్టి సారించనున్నారు. వారు చేసిన డిపాజిట్లకు ఎక్కడ నుంచి నిధులు తెచ్చారు? సంబంధించిన పత్రాలున్నాయా? ఆదాయపన్ను రిటర్న్‌లలో వాటిని చూపిస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఫేక్ డిపాజిట్‌దారుల పేర్లతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో భారీ ఎత్తున డిపాజిట్లు చూపుతున్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని పక్కాగా నిర్ధారించేందుకు చందాదారులు, డిపాజిట్‌దారుల ఇళ్లకు వెళ్లి ఆరా తీయనున్నారు.
ఆధారాల ధ్వంసంపై ఫోరెన్సిక్ ఆడిట్
మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో సోదాలతోపాటు సీఐడీ అధికారులు సమాంతరంగా ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక అక్రమాలను కప్పిపుచ్చేందుకు ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు మరిన్ని అక్రమాలకు పాల్పడినట్లు ఇటీవల ఏడు బ్రాంచి కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో వెల్లడైన విషయం తెలిసిందే. నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంతోపాటు కంప్యూటర్లలో కీలక రికార్డులను డిలీట్ చేసినట్లు సీఐడీ విభాగం గుర్తించింది. బ్రాంచి మేనేజర్లతో మార్గదర్శి యాజమాన్యం ప్రత్యేకంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ ఆధారాల ధ్వంసానికి పాల్పడినట్లు వెల్లడైంది.
కేసు దర్యాప్తులో ఉండగా ఆధారాలను ధ్వంసం చేయడం తీవ్రమైన నేరం. సీఐడీ అధికారులు దీన్ని శాస్త్రీయంగా నిరూపించే ప్రక్రియను చేపట్టారు. నిపుణుల బృందాలను నియమించి మొత్తం రికార్డులను విశ్లేషిస్తున్నారు. వారం పది రోజుల క్రితం ఏడు బ్రాంచి కార్యాలయాల్లో డిలీట్ చేసిన రికార్డులను రిట్రీవ్ చేసి వెలికి తీశారు. ప్రస్తుతం మొత్తం 37 బ్రాంచి కార్యాలయాల్లోనూ ధ్వంసం చేసిన రికార్డులను వెలికి తీయడంతోపాటు రికార్డులను ధ్వంసం చేసినట్టు శాస్త్రీయంగా రికార్డు చేస్తున్నారు. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతోనే కీలక రికార్డులను ధ్వంసం చేసినట్లు బ్రాంచి కార్యాలయాల సిబ్బంది సీఐడీ ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఫోరెన్సిక్ ఆడిటింగ్ ద్వారా నిరూపించడం ద్వారా న్యాయస్థానంలో సమర్పించేందుకు కీలక సాక్ష్యా«దారాలను సేకరించే ప్రక్రియను సీఐడీ వేగవంతం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment