ప్రాజెక్టులకు ప్రాధాన్యం | CM Jagan Comments In Concreting Context For Three Reservoirs | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు ప్రాధాన్యం

Published Thu, Dec 10 2020 2:56 AM | Last Updated on Thu, Dec 10 2020 9:36 AM

CM Jagan Comments In Concreting Context For Three Reservoirs - Sakshi

గతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. రూ.803.96 కోట్ల వ్యయంతో అప్పర్‌ పెన్నార్‌ ఎత్తిపోతల పనులు చేపట్టే విధంగా గత ప్రభుత్వ హయాంలో 2018 జనవరి 24వ తేదీన జీఓ జారీ చేసినా పనులు మాత్రం జరగలేదు. మన ప్రభుత్వం అదే సొమ్ముతోనే అదనంగా రెండు రిజర్వాయర్లను నిర్మించి, అదనంగా మరో 3.3 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతోంది. సాగునీటి ప్రాజెక్టుల్లో ఏరకంగా లంచాలు కట్టడి చేస్తున్నామో చెప్పడానికి ఇదే నిదర్శనం.

హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) పథకంలో భాగంగా 3 జలాశయాల నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. దీంతో రాయలసీమలో దాదాపు 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది లక్ష్యం. హంద్రీ–నీవాలో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 5.40 టిఎంసీల సామర్థ్యంతో ఎగువ పెన్నా జలాశయానికి సంబంధించిన ప్రధాన కాలువ, ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి జలాశయాలు నిర్మిస్తాం. తద్వారా 75 వేల ఎకరాలకు సాగునీటితో పాటు, పలు ప్రాంతాలకు తాగునీరు అందుతుంది.

సాక్షి, అమరావతి: సాగునీటి వసతి కల్పన ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగు పడి, పేదరిక నిర్మూలనకు దోహద పడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రైతులు, రైతు కూలీల జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే కాకుండా.. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అందుకే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టులో భాగంగా మూడు జలాశయాల నిర్మాణానికి అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి వద్ద వర్చువల్‌ విధానంలో బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ హంద్రీ–నీవాలో అంతర్భాగంగా మూడు జలాశయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అప్పర్‌ పెన్నార్‌ ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం ఎన్నికలప్పుడు నామ్‌ కే వాస్తేగా చేపట్టామంటే.. చేపట్టామన్నట్లు చేసి, ఆ తర్వాత వదిలేసిందని చెప్పారు. ఇప్పుడు ఆ పథకం పనులు మొదలు పెట్టడమే కాకుండా.. వాటి సామర్థ్యం పెంచి అదనంగా మరో రెండు రిజర్వాయర్ల పనులు కూడా చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ఎన్నికలప్పుడు ఇదే రాప్తాడు నియోజకవర్గం మీదుగా నేను పోతున్నప్పుడు ఆ రోజు ప్రజలందరూ చూపిన ఆ ప్రేమ, అభిమానం నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు అడుగు ముందుకు వేస్తున్నాను.   
వర్చువల్‌ విధానంలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రి అనిల్‌  

75 వేల ఎకరాలు సస్యశ్యామలం  
► అప్పర్‌ పెన్నార్‌ ఎత్తిపోతల ద్వారా జీడిపల్లి జలాశయం నుంచి 90 రోజుల్లో 7.216 టీఎంసీలను తరలించి.. అప్పర్‌ పెన్నార్‌తోపాటు కొత్తగా నిర్మించే సోమరవాండ్లపల్లి, ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ జలాశయాలను నింపుతాం. బెలుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, రామగిరి మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించి, సస్యశ్యామలం చేస్తాం.  
► ఈ ప్రాజెక్ట్‌ కోసం 5,171 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ప్రాజెక్ట్‌ పనుల్లో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకు 53.45 కి.మీ. ప్రధాన కాలువ, అందులో భాగంగా 4 ఎత్తిపోతల పథకాలు, 110 కాంక్రీట్‌ కట్టడాలను నిర్మిస్తాం. 
► కొత్తపల్లి, ఆత్మకూరు, బాల వెంకటాపురం, మద్దలచెరువు వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాలను చేపడతాం. ప్రస్తుతం 1.81 టీఎంసీల సామర్థ్యం ఉన్న అప్పర్‌ పెన్నార్‌ జలాశయానికి అదనంగా ముట్టాల జలాశయాన్ని 2.024 టీఎంసీలు, తోపుదుర్తి జలాశయాన్ని 0.992 టీఎంసీలు, దేవరకొండ జలాశయాన్ని 0.89 టీఎంసీలు, సోమరవాండ్లపల్లి జలాశయాన్ని 1.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నాం. 
► అప్పర్‌ పెన్నార్‌ జలాశయం ద్వారా 10 వేల ఎకరాలు, ముట్టాల జలాశయం ద్వారా 18,700 ఎకరాలు, తోపుదుర్తి జలాశయం ద్వారా 18 వేల ఎకరాలు, దేవరకొండ జలాశయం ద్వారా 19,500 ఎకరాలు, సోమరవాండ్లపల్లి జలాశయం ద్వారా 8,800 ఎకరాలకు నీరు అందుతుంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రతిపాదన మేరకు ఈ ప్రాజెక్టుకు డాక్టర్‌ వైఎస్సార్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుగా పేరు పెడుతూ జలవనరుల శాఖ ఉత్తర్వులిచ్చింది. 

అనంతపురం పరిస్థితుల్లో మార్పు  
దేవుడి దయతో కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో పరిస్థితులు మారుతున్నాయి. జలాశయాలన్నీ నీటితో నిండాయి. మీ అందరి చల్లని దీవెనలతో మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలూ అమలు చేస్తున్నాం. ఆసరా, చేయూత, అమ్మఒడి, రైతు భరోసా, విలేజ్‌ క్లినిక్కులు, రైతు భరోసా కేంద్రాలు.. ఇలా చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ప్రజాభ్యుదయమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తాడేపల్లి నుంచి మంత్రి అనిల్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వెంకటంపల్లి పైలాన్‌ వద్ద కార్యక్రమంలో మంత్రులు బొత్స, అప్పలరాజు, శంకర నారాయణ, ఎంపీ మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీలు ఇక్బాల్, గోపాల్‌రెడ్డి, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement