స్థానిక సంస్థల ఎన్నికల్లో దేవుని దయ వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. దేశం మొత్తం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వైపు చూస్తుంది. అందువల్ల ఇక్కడి నుంచి వచ్చే మెజార్టీ మన మెసేజ్‌గా ఉండాలి. కులం, మతం, రాజకీయాలు చూడకుండా.. అవినీతి, పక్షపాతం లేకుండా, కేవలం అర్హతే ప్రామాణికంగా పారదర్శకంగా పథకాలు అమలు చేసిన విషయాన్ని విస్తృతంగా ఓటర్ల దృష్టికి తీసుకెళ్లాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఫలితాలు ఉండాలని, ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి గడపకూ వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. మహిళా సాధికారత, మహిళలకు ఈ ప్రభుత్వంలో జరిగిన మేలును ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మంత్రి ఇంచార్జ్‌గా, ఒక ఎమ్మెల్యే అదనంగా ఉంటారని తెలిపారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై క్యాంపు కార్యాలయంలో పార్టీనేతలతో సమీక్షిస్తున్న సీఎం జగన్
అతి విశ్వాసంతో కాకుండా అందరూ సమన్వయంతో పని చేసి, గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రతి ఓటర్‌కు జరిగిన మంచిని గుర్తు చేసి.. మీ దీవెనలు, ఆశీస్సులు కావాలని అడగాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్, ఆదిమూలపు సురేష్, రీజనల్ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారధి, వరప్రసాద్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment