AP: అందరి చూపు మనవైపే.. దేశంతోనే పోటీ పడుతున్నాం.. | CM Jagan Comments At YSR Uchitha Pantala Bheema Programe | Sakshi
Sakshi News home page

AP: అందరి చూపు మనవైపే.. దేశంతోనే పోటీ పడుతున్నాం..

Published Wed, Jun 15 2022 2:15 AM | Last Updated on Wed, Jun 15 2022 7:47 AM

CM Jagan Comments At YSR Uchitha Pantala Bheema Programe - Sakshi

రైతులకు పంటల బీమా చెక్కు అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్, చిత్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు

మొన్నామధ్య చంద్రబాబు అనంతపురం వచ్చారు.. గోదావరి జిల్లాలకూ వెళ్లారు.. ఆత్మహత్య చేసుకున్న నిజమైన రైతు (పట్టాదారు పాసుపుస్తకం ఉన్న) ఎవరికైనా పరిహారం అందకపోతే చూపించండని సవాల్‌ విసిరితే స్పందన లేదు. మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత ఆవేదన వ్యక్తం చేస్తామో.. అంతగా ఆ రైతు కుటుంబాలకు తోడుగా నిలబడ్డాం. గత ప్రభుత్వంలో 458 మంది రైతులు చనిపోతే ఇదే బాబు పరిహారం ఇవ్వకపోతే.. మన ప్రభుత్వం వచ్చాక ఇచ్చాం. జిల్లాలకు వెళ్లాలి.. పల్లెలకు వెళ్లాలని ఈ దత్తపుత్రుడు అప్పుడు ఎందుకు ముందుకు రాలేదు?       

కోనసీమలో క్రాప్‌ హాలిడే అంటూ చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారు. మీరు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను మేము తీర్చినందుకా? కేంద్రం నుంచి సకాలంలో డబ్బు రాకపోయినా ధాన్యం డబ్బులు ఇవ్వడం కోసం కిందా మీద ప్రయాస పడుతున్నందుకా? రైతుల కోసం ఇన్ని పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకా? చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఏం సమాధానం చెబుతారు? ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో మీ బిడ్డ ఎవ్వరినైనా ఎదుర్కోగలడు. గతంలో పాలన, ఇప్పుడు మీ బిడ్డ పాలన ఎలా ఉందో ఒక్కసారి మార్పులు గమనించాలని కోరుతున్నా.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రైతులకు మేలు చేయడంలో మనం పోటీ పడుతున్నది ప్రతిపక్షాలతో కాదు.. దేశంతోనే పోటీ పడుతున్నాం. చాలా రాష్ట్రాల ప్రతినిధులు మన రాష్ట్రంలో వ్యవసాయ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో చూసి వెళ్తున్నారు. తమ ప్రాంతంలో కూడా ఇలాంటివి ఎలా అమలు చేయాలని అడుగుతున్నారు. దేశం యావత్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోంది’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తున్న ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు.

మంగళవారం ఆయన శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లిలో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 2021 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రాష్ట్రంలోని 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  గతంలోలాగా పరిహారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి నేడు లేదన్నారు.

ఒక్క పైసా ఖర్చు లేకుండా ఈ–క్రాప్‌లో పేరు నమోదు చేసుకుంటే చాలు.. రైతు ఖాతాలోనే నేరుగా సొమ్ము వచ్చి పడేలా చేస్తున్నామని చెప్పారు. దీన్ని బట్టి గతంలో పాలన ఎలా సాగింది.. ఇప్పుడు మీ బిడ్డ పాలన ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని కోరారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఆ సీజన్‌ మళ్లీ మొదలయ్యేలోగా పరిహారం ఇస్తున్న ప్రభుత్వం ఇదేనని చెప్పారు. ప్రభుత్వం ఓవైపు నవరత్నాలు పథకాల ద్వారా తోడుగా ఉంటూనే.. మరోవైపు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వ్యవసాయానికి అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
చెన్నేకొత్తపల్లిలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

మూడేళ్లలోనే రూ.6,685 కోట్లు ఇచ్చాం
► 2014 – 2019లో తెలుగుదేశం పాలన సాగింది. ఆ ఐదేళ్లలో పంటల బీమా కింద ఆ ప్రభుత్వం 30.85 లక్షల మంది రైతులకు కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే పరిహారం ఇచ్చింది. అదే మనం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లిస్తూ ఈ మూడేళ్లలోనే 44.28 లక్షల మందికి రూ.6,685 కోట్లు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నా. 
► 2012 – 2013 సంవత్సరానికి సంబంధించి రూ.120 కోట్లకు పైగా పంటల బీమా బకాయిలు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో రూ.590 కోట్లు రైతులకు ఎగ్గొట్టారు. గత ప్రభుత్వాలు పెట్టిన రూ.715.84 కోట్ల బకాయిలను మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఇచ్చామని చెబుతున్నా. 

ఇన్ని మార్పులు ఎక్కడైనా జరిగాయా?
► వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం కింద 53 లక్షల రైతు కుటుంబాలకు మంచి చేస్తూ ఈ మూడేళ్లలోనే రూ.23,875 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. జూన్‌ అంటేనే వ్యవసాయ పండుగ నెల. దీంతో రైతుకు తోడుగా నిలబడేందుకు రైతు భరోసా కింద రూ.7,500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశాం. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రైతుల కోసం మీ బిడ్డ రూ.1.28 లక్షల కోట్లు ఖర్చు చేశాడు. 
► గతంలో పాలకులకు అనుకూలమైన వారికే పరిహార ఫలాలు అందేవి. ఇప్పుడలా కాకుండా, వివక్షకు తావు లేకుండా అందరికీ ఇస్తున్నాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో రూ.1,613 కోట్లు, వడ్డీ లేని రుణాల కింద రూ.1,283 కోట్లు చెల్లించాం. గతంలో చంద్రబాబు ఐదేళ్లలో సున్నా వడ్డీ కింద కేవలం రూ.780 కోట్లు మాత్రమే ఇచ్చారు. అదే మనం మూడేళ్లలోనే రూ.1,283 కోట్లు ఇచ్చాం. 
► ఈ మూడేళ్లలో 10,778 రైతు భరోసా కేంద్రాలు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆ కేంద్రాల్లో 24,480 మంది మన పిల్లలు సేవలందిస్తున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకేలు రైతుల చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాయి. కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ద్వారా యంత్ర సామగ్రిని రాయితీతో ఇస్తున్నాం.

ఉచిత విద్యుత్, ధాన్యం బకాయిలూ చెల్లించాం 
► రైతులకు ఈ మూడేళ్లలో ఉచిత విద్యుత్‌ కింద పగటిపూట తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ ఇచ్చేందుకు రూ.25,800 కోట్లు ఖర్చు చేశాం. ఫీడర్లు మెరుగు పడాలని మరో రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని మోసం చేసింది. ఆ బకాయిలు రూ.8,750 కోట్లు ఉంటే  వాటిని కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. 
► ధాన్యం డబ్బు చెల్లింపుల్లో గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయిలు పెడితే ఆ డబ్బూ మనమే చెల్లించాం. విత్తనాల కొనుగోలుకు కూడా అప్పటి ప్రభుత్వం రూ.430 కోట్లు బకాయి పెడితే మనమే ఇచ్చాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశాం. ప్రతి ఏడాది వచ్చిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం. 
► గతంలో దురదృష్టవశాత్తు రైతు ఆత్మహత్య చేసుకుంటే అవి ఆత్మహత్యలు కావని ప్రభుత్వాలు చెప్పేవి. ఈరోజు ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని పక్కాగా ఆదుకుంటున్నాం. కౌలు రైతుకు సీసీఆర్‌సీ కార్డు ఉంటే వెంటనే రూ.7 లక్షల పరిహారం ఇస్తున్నాం. 
► పాడి రైతులకు మంచి చేయడానికి అమూల్‌ను తీసుకొచ్చాం. ఈ కాంపిటీషన్‌ తట్టుకోవడానికి హెరిటేజ్‌ కంపెనీ కూడా లీటరుకు రూ.5 నుంచి రూ.10 పెంచాల్సి వచ్చింది. అప్పుడు నాయకుల జేబుల్లోకి డబ్బు వెళ్లేది. ఇవాళ మీ బిడ్డ బటన్‌ నొక్కి మీ ఖాతాల్లోకి వేస్తున్నారు.

బాబు.. దత్తపుత్రుడు.. ఆ మూడు
► మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే ముందు బాబు, తర్వాత ఆయన దత్తపుత్రుడు.. వీళ్లిద్దరికీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 అందరూ ఏకమవుతారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్ధానికి రంగులు పూస్తారు.
► చంద్రబాబు లేదా దత్తపుత్రుడు వస్తే అడగండి.. గతంలో మేనిఫెస్టోను చూసి ఓట్లేశాం.. ఆ మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదని నిలదీయండి. రుణమాఫీ అంటూ మోసం చేసి.. ఉచిత విద్యుత్, ధాన్యం, విత్తన బకాయిలు, పంటల బీమా కూడా చెల్లించకుండా బకాయిలు ఎగ్గొటిన చంద్రబాబు వీళ్ల దృష్టిలో మంచోడట. 
► కోవిడ్‌ వల్ల రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఆ రెండేళ్లూ పరీక్షలు లేకుండా పాస్‌ చేశాం. ఇప్పుడు పరీక్షలు పెడితే 67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గుజరాత్‌లో 65 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. ఇలాంటి సమయంలో వారికి ఆత్మస్థైర్యం ఇవ్వాల్సిందిపోయి వారిని రెచ్చగొట్టడానికి యత్నిస్తున్నారు. 
► మన పిల్లలకు ఇవ్వాల్సింది నాణ్యమైన చదువులు. ప్రపంచంతో పోటీ పడేటప్పుడు వారి చదువుల్లో క్వాలిటీ ఉండాలి. విద్యా రంగంలో తీసుకు వస్తున్న మార్పులను తట్టుకోలేక దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. 
► మాట ఇచ్చి తప్పితే ఏమనుకుంటారోనన్న బాధ లేని వారు రాజకీయాలకు అర్హులా.. అని అడుగుతున్నా. ఏం చేస్తే చంద్రబాబుకు మంచి జరుగుతుందో.. అది చేయడానికి ఉరుకులు పరుగులు తీసే మరో వ్యక్తి దత్తపుత్రుడు. ప్రజలను మోసం చేసే వీళ్లిద్దరూ తోడుదొంగలు. రాజకీయాల్లో ఉండేందుకు వీళ్లు అర్హులేనా అనేది మీరు చెప్పాలి.
► మూడేళ్ల పాలనలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్నీ అమలు చేశాం. ఆ మేనిఫెస్టోను చూసి మీరే టిక్‌ పెట్టండి. ఇద్దరికీ తేడా మీరే గమనించండి.

అంబేడ్కర్‌ పేరు పెడితే మంత్రి ఇంటిని తగలబెడతారా?
► కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ మహానుభావుడి పేరు పెట్టాం. దీంతో ఒక దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇంటిని కాల్చేశారు. అంబేడ్కర్‌ పేరు పెడితే జీర్ణించుకోలేక పోయారు. ఇదా మీరు చూపించే సామాజిక న్యాయం? ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా?
► మీ బిడ్డ మంత్రి వర్గంలో 70 శాతం బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెబుతున్నాం. ఉద్యోగుల విషయంలోనూ ఇదే ధోరణి. ఉద్యోగులకు ప్రతి విషయంలోనూ మంచి చేస్తున్నాం. అయినా వారిని రెచ్చగొట్టే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. 
► ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్‌ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గుమ్మనూరు జయరాం, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఒక్క ఏడాదే రూ.2,977 కోట్లు 
పంటల బీమా కోసం రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒక్క ఏడాదే రూ.2,977 కోట్ల బీమా ఇవ్వడం చరిత్రాత్మకం. విత్తనం నుంచి విక్రయం దాకా అన్నింటికీ జగన్‌ సర్కార్‌ అండగా ఉంటోంది. సీఎం జగన్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మొత్తంగా ఈ మూడేళ్లలో రైతన్నలకు ఈ ప్రభుత్వం రూ.1,27,823 కోట్లు అందించింది. ఇన్ని చేస్తున్నా, ప్రతిపక్షం పసలేని ఆరోపణలు చేస్తోంది. వారికి ఇప్పటికైనా దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాం.    
– కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి 

మూడేళ్లలో రూ.2.70 లక్షలు
ఇవాళ ఉగాది వచ్చినంత సంతోషంగా ఉంది. బీమా సొమ్ము ఇచ్చినందుకు రైతులందరి తరఫున సీఎంకు ధన్యవాదాలు. నాకు రూ.9 వేల ఇన్సూరెన్స్‌ అందింది. మొన్న రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద రూ.7,500 ఇచ్చారు. గతేడాది నవంబర్, డిసెంబర్‌లో అధిక వర్షాలు కురిసి నష్టం రాగా, రూ.24 వేల ఇన్‌పుట్‌ సబ్సిడీ వచ్చింది. వివిధ పథకాల ద్వారా ఈ మూడేళ్లలో నా కుటుంబానికి రూ.2,70,000 లబ్ధి కలిగింది.
– ఫక్కీరప్ప, రైతు, శ్రీసత్యసాయి జిల్లా   

చంద్రబాబు రావణుడి లాంటివాడు
చంద్రబాబు హయాంలో ఒక్క సంక్షేమ పథకాన్నీ తీసుకు రాలేదు. పైగా ఏకంగా రూ.3 లక్షల కోట్లు మాయం చేశారు. రావణుడి లాంటివాడు. అదే జగనన్న ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నిర్దేశించిన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించింది. జగనన్న నాయకత్వంలో పని చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. ప్రస్తుతం ఒక్క రాప్తాడు నియోజకవర్గానికే రూ.116 కోట్ల పంటల బీమా అందించడం పట్ల సీఎం జగన్‌కు ధన్యవాదాలు.    
– తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement