ప్రతి అడుగులోనూ.. రైతన్నకు అండ | CM Jagan Released YSR Uchitha Pantala Bheema Funds | Sakshi
Sakshi News home page

ప్రతి అడుగులోనూ.. రైతన్నకు అండ

Published Wed, May 26 2021 3:03 AM | Last Updated on Wed, May 26 2021 5:13 PM

CM Jagan Released YSR Uchitha Pantala Bheema Funds - Sakshi

రైతుల ఖాతాల్లో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా నగదును జమ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మి, అడుగులు వేశాం.     ఇవాళ రాష్ట్రంలో దాదాపు 62 శాతం మంది వ్యయసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. తద్వారా మనకు ఆహార భద్రత, ఉపాధి కలుగుతోంది. ఈ ఏడాది కూడా చక్కగా వర్షాలు కురిసి, రైతన్నలకు మంచి పంటలు పండాలని మీ బిడ్డగా కోరుకుంటున్నా.  
 
ఈ నెలలో రైతుల కోసం మొన్న రైతు భరోసా కింద రూ.3,900 కోట్లకు పైగా ఇస్తే, ఇవాళ 15.15 లక్షల మంది రైతులకు మేలు జరిగేలా మరో రూ.1,820 కోట్లు ఇస్తున్నాం. ఆ విధంగా దాదాపు రూ.5,800 కోట్ల సహాయం చేశాం. ఇలా రైతులకు మేలు చేసే అవకాశం దేవుడు నాకిచ్చినందుకు కృతజ్ఞతలు. 
- సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి: రైతు బాగుంటేనే రైతు కూలీతో పాటు రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్ముతున్న ప్రభుత్వం ఇదని, రైతుల కష్టాలు బాగా తెలిసిన మీ బిడ్డ ఇక్కడ సీఎంగా ఉన్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అందుకే రైతులు నష్టపోకూడదని ప్రతి అడుగులో వారికి అండగా ఉంటూ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందరికీ న్యాయం జరిగేలా అన్ని విషయాల్లో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. రైతన్నల మీద ప్రభుత్వానికి ఉన్న  బాధ్యత, మమకారం, ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. గత 23 నెలల్లోనే రైతుల కోసం ఏకంగా రూ. 83 వేల కోట్లు ఖర్చు చేశామని, ఈ నెలలోనే రైతులకు రూ.5,784 కోట్లు ఇచ్చామని తెలిపారు. రైతుల కోసం ఏకంగా రూ.14 వేల కోట్ల వ్యయంతో మల్టీపర్పస్‌ స్పెషాలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి 2020 ఖరీఫ్‌కు సంబంధించి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారం కింద 15.15 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1,820.23 కోట్లను కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేశారు.

ఈ సందర్భంగా ఆయన జిల్లా కేంద్రాల్లోని రైతులు, అధికారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. 2020 ఖరీఫ్‌లో భారీ వర్షాలు, తుపాన్లు, చీడ పురుగుల వంటి కారణాలతో దాదాపు 15.15 లక్షల రైతులు నష్టపోతే, వారికి మంచి చేస్తూ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారంగా రూ.1,820.23 కోట్లను ఎక్కడా వివక్ష చూపకుండా, పూర్తి పారదర్శకంగా, లంచాలకు తావు లేకుండా, ఏ ఒక్కరికి నష్టం కలగకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. బీమా కింద గత ప్రభుత్వం రైతులకు 2018–19 ఇన్సూరెన్స్‌ ఇవ్వకపోతే ఆ బకాయిలు రూ.715 కోట్లు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించామన్నారు. 2019–20కి సంబంధించి ఉచిత పంటల బీమా పరిహారం కింద మరో రూ.1,252 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఆ విధంగా రెండూ కలిపి రైతులకు దాదాపు రూ.1,968 కోట్లకు పైగా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారం చెల్లించామని వివరించారు. ఇవాళ్టి చెల్లింపులతో కలిపి మొత్తం రూ.3,788 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
జిల్లా కేంద్రాల్లోని రైతులు, అధికారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్‌ 
 
రైతులకు దగ్గరయ్యాం.. 
► గతంలో ఏ విధమైన పరిస్థితి ఉందో అందరికీ తెలుసు. తుపానులు, చీడ పురుగుల వల్ల పంట నష్టం జరిగితే.. పరిహారం ఎప్పుడు, ఎంత మందికి, ఎంత ఇస్తారో తెలిసేది కాదు. కాబట్టి రైతులకు బీమా మీద నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 2020 ఖరీఫ్‌లో పంట నష్టం జరిగితే, ఆ తర్వాత ఏడాదిలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే ఆ పరిహారం ఇస్తున్నాం. 
► గతంతో పోలిస్తే పంట నష్టం జరిగితే ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా వెంటనే అదే సీజన్‌లో ఇచ్చామని గర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. ఖరీఫ్‌ కానీ, రబీ కానివ్వండి. ఏ సీజన్‌ పంట నష్టాన్ని ఆ సీజన్‌లోనే ఇచ్చే కొత్త విధానంతో రైతులకు మరింత దగ్గరయ్యాం. 2020 ఖరీఫ్‌లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్‌ ముగిసేలోపే రూ.930 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చాం. 
 
మొత్తం ప్రీమియం కడుతున్నాం  
► పంటకు అయినా, మనిషికి అయినా బీమా చేయాలంటే, ఏటా కొంత ప్రీమియం కట్టాలి. రైతులు ఒక భాగం, రెండో భాగం రాష్ట్ర ప్రభుత్వం, మరో భాగం కేంద్రం కట్టేది. అయితే ఎవరు ప్రీమియం కట్టకపోయినా రైతులకు నష్టం జరిగేది. 
► కాబట్టి రైతులకు తగిన ప్రయోజనం కలగడం లేదని భావించి, రైతులకు ఒక్క పైసా భారం లేకుండా మొత్తం ప్రీమియం మనందరి ప్రభుత్వమే కడుతోంది. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంలో చేర్చింది. లబ్ధిదారులు, ఈ క్రాప్, తదితర అన్ని విషయాల్లో అత్యంత పారదర్శకతతో ముందుకు వెళ్తున్నాం. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, మమకారం, బాధ్యతకు బీమా పథకమే నిదర్శనం.  
 
23 నెలలు.. రూ.83 వేల కోట్లు  
► ఈ 23 నెలల కాలంలో రైతుల కోసం చేసిన ఖర్చు రూ.83 వేల కోట్లు అని సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. 52 లక్షల మందికి పైగా రైతులకు ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా కింద ఇస్తున్నాం. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా, అంత కంటే ఎక్కువగా 5 ఏళ్లు, మొత్తం రూ.67,500 ఇస్తున్నాం. ఆయా పథకాలు, కార్యక్రమాల కోసం ఇలా ఖర్చు చేశారం.. 

 ఆర్బీకేలు –సేవలు  
► రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం.. వాటి దగ్గరే 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశాం. విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలబడుతున్నాం.  
► ప్రభుత్వం ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నేరుగా రైతులకు సరఫరా చేస్తున్నాం. ఈ– క్రాపింగ్‌ జరుగుతోంది. రైతులకు సంబంధించి అన్ని పథకాలకు ఆర్బీకేలు వేదికగా పని చేస్తున్నాయి.   
► పంటలకే కాకుండా పశువులు, కోళ్లు, మత్స్య రంగానికి అవసరమైన ఫీడ్, మందులు కూడా ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నాము. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీల ఏర్పాటు చేశాం. వాటిని ఆర్బీకేలకు అనుసంధానం చేస్తూ, రైతులకు క్రాప్‌ ప్లానింగ్‌ ఇస్తున్నాం’  
 
పాడి రైతులకు అండ  
► పాడి రైతులకు కూడా మెరుగైన ఆదాయం వచ్చేలా దేశంలోని అతి పెద్ద సహకార రంగంలోని సంస్థ అమూల్‌ను తీసుకువచ్చాం. పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే 3 జిల్లాల్లో పాల సేకరణ మొదలైంది. పాలు పోసే ప్రతి రైతు, ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా ఇవ్వగలుగుతున్నాం. 
 
మల్టీపర్పస్‌ స్పెషాలిటీ సెంటర్లు  
► రూ.14 వేల కోట్ల వ్యయంతో మల్టీపర్పస్‌ స్పెషాలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా ప్రతి ఆర్బీకే పరిధిలో కోల్డ్‌ స్టోరేజీలు, గిడ్డంగులు, గ్రేడింగ్‌ సదుపాయాలు, డ్రైయింగ్‌ ఫ్లోర్లు (పంట ఆరబోత కోసం), ప్రైమరీ ప్రాసెసింగ్, పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరీక్షించే (అస్సేయింగ్‌) ఎక్విప్‌మెంట్, కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే దిశలో ఈ ఏడాది అడుగులు వేస్తున్నాం. 
 
వైఎస్సార్‌ జలకళ 
వైఎస్సార్‌ జలకళ పథకం ఇటీవల మొదలు పెట్టాం. 4 ఏళ్లలో రూ.4,932 కోట్ల వ్యయంతో దాదాపు 2 లక్షల బోర్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సన్న, చిన్న కారు రైతులకు మోటార్లు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను. 
 
ఆ కుటుంబాలను ఆదుకుంటున్నాం  
► ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచి, కచ్చితంగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన దాదాపు 434 మంది రైతుల కుటుంబాలకు కూడా మనందరి ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. 
► దురదృష్టవశాత్తు ఇప్పుడు కూడా ఎక్కడైనా రైతులు చనిపోతే, వారి కుటుంబాలను ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నాం. అందు కోసం ప్రతి జిల్లాలో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశాము. 
► ఈ సమీక్షలో పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 
 
1 నుంచి 100 వరకు మీరే  
నవరత్నాలలో భాగంగా వ్యవసాయానికి తొలి ప్రాధాన్యం ఇచ్చి, చెప్పిన ప్రతి మాటను మీరు (సీఎం) అమలు చేస్తున్నారు. ఆ విధంగా రైతులకు మేలు చేసిన వారిలో 1 నుంచి 100 వరకు మీరే (సీఎం) ఉంటారు. ఈ ఒక్క నెలలోనే దాదాపు రూ.5,820 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఏనాడూ కేవలం ఏడాది వ్యవధిలో పంట నష్టపరిహారం ఈ స్థాయిలో అందలేదు. ఇవాళ 30 పంటలకు బీమా సదుపాయం కల్పించారు. అది రైతుల పట్ల మీకున్న ప్రేమ నిదర్శనం. దేశంలో ఈ తరహాలో ఎక్కడా రైతులకు బీమా అందడం లేదు.   
– కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి 

పెద్ద కొడుకుగా సాయం చేస్తున్నారు 
మేం 8 ఎకరాల్లో సొంతంగా సాగు చేస్తున్నాం. మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాం. గతేడాది వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయాం. ఇందుకుగానూ ఉచిత పంటల బీమా కింద రూ.82 వేలు జమ చేశారు. ప్రీమియం మీరే చెల్లించి బీమా ఇస్తున్నారు. రైతులంటే మీకెంత ప్రేమో అర్థమవుతోంది. మీరు ప్రతి ఇంటికి పెద్దకొడుకుగా ఉంటూ సాయం చేస్తున్నారు.
– సత్యవతి, గనిఆత్కూరు, కృష్ణా జిల్లా    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement