సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధు గుంటూరు/ తాడికొండ: సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం (నేడు) ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలను అందజేయనున్నారు.
ఈ ప్రాంతంలో 1,402.58 ఎకరాల్లో ఆర్–5 జోన్ ఏర్పాటుచేసి 50,793 ప్లాట్లను సిద్ధంచేశారు. వీటితో పాటు సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందజేస్తారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వివిధ శాఖ అధికారులు, యానిమేటర్లు, డ్వాక్రా మహిళలు ఆహ్వానం అందించారు. వారి ఇళ్లకు వెళ్లి బొట్టుపెట్టి మరీ కార్యక్రమానికి రావాలని పిలిచారు.
రూ.2 వేల కోట్లతో కాలనీల నిర్మాణం
ఇక సీఆర్డీఏ పరిధిలో సిద్ధంచేసిన 25 లేఅవుట్లలో గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మంది, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రతి ప్లాట్‌కు హద్దులు నిర్ణయిస్తూ 80 వేల హద్దు రాళ్లు ఏర్పాటుచేశారు. అంతర్గత రవాణా కోసం 95.16 కి.మీ పరిధిలో గ్రావెల్ రోడ్లు వేశారు.
లేఅవుట్లు, సభ ఏర్పాట్ల పరిశీలన
మరోవైపు.. లేఅవుట్లు, సభ ఏర్పాట్లను మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, విడదల రజిని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, ప్రణాళికా బోర్డు వీసీ మల్లాది విష్ణు, పురపాలిక శాఖ ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మీ, సీఆర్డీయే కమిషనర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి, గృహ నిర్మాణ సంస్థ ఎండీ శ్రీలక్ష్మీ, జేసీ జీ. రాజకుమారి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు పరిశీలించారు.
టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ
నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ నేడు పంపిణీ చేయనున్నారు.
♦ రాష్ట్రవ్యాప్తంగా 1,43,000 మంది నిరుపేద లబ్ధిదారులకు 300 చ.అడుగుల టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో కేవలం రూ.1కే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. తద్వారా వారికి రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
♦ ఇదే ఇంటికి గత టీడీపీ ప్రభుత్వం అసలు, వడ్డీతో కలిపి రూ.7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితిని కల్పించింది. ఆ భారం లేకుండా కేవలం రూ.1కే ఇప్పుడు ఇవ్వడం గమనార్హం.
♦ దీంతోపాటు ఇతర టిడ్కో లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతం రాయితీ కూడా ఇచ్చింది.
♦ ఇక 365 చ.అ. లబ్ధిదారులు ఒకొక్కరికి రూ.25 వేల చొప్పున 44,304 మందికి, 430 చ.అ. లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున 74,312 మందికి మేలు చేసింది.
♦ తద్వారా వారు చెల్లించాల్సిన రూ.482 కోట్ల భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం భరించింది.
♦ టిడ్కో ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి రూ.60 వేల లబ్ధిచేకూరింది.
♦ అలాగే, 2.62 లక్షల మంది టిడ్కో లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ.14,514 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల కోసం మరో రూ.1,200 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.3,000 కోట్లు మొత్తం రూ.18,714 కోట్ల లబ్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చింది.
♦ కానీ, గత టీడీపీ ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్లలో మంచినీటి సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత జగన్ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను అందిస్తోంది.
♦ ఇక ఈ ఇళ్ల పట్టాలు పంపిణీలో ఏమైనా ఇబ్బందులుంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించవచ్చు.
సీఎం పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉ.9.50 గంటలకుతాడేపల్లి నుంచి బయల్దేరి వెంకటాయపాలెం చేరుకుంటారు. లేఅవుట్స్‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీని తిలకిస్తారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తారు. జిల్లా కలెక్టర్, లబ్ధిదారులు, ఇతర వక్తలు మాట్లాడిన తర్వాత సీఎం జగన్ బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పేదలకు పట్టాలు పంపిణీ చేస్తారు. తిరిగి మ.12.30కు ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment