పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌.. 100 రోజుల ప్రచారం | CM Jagan High level review Meeting On Clean Andhra Pradesh Program | Sakshi
Sakshi News home page

పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌.. 100 రోజుల ప్రచారం

Published Wed, Mar 24 2021 3:18 AM | Last Updated on Wed, Mar 24 2021 9:30 AM

CM Jagan High level review Meeting On Clean Andhra Pradesh Program - Sakshi

పరిసరాలను, వీధులను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా 100 రోజుల ప్రచారం నిర్వహించాలి. చెత్త, మురికి నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. అవి పేరుకుపోతే కలిగే ఇబ్బందులు, వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు, పొడి చెత్త నుంచి విద్యుత్‌ తయారీపై దృష్టి సారించాలి. వీటి కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలి.  

విశాఖలో బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. దేశంలో అందమైన రోడ్డుగా నిలిచిపోవాలి. దీన్ని తొలి ప్రాధాన్యత పనిగా గుర్తించాలి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలి.  మెట్రో, ట్రాం నిర్మాణ శైలిలో మంచి డిజైన్లు రూపొందించాలి. వీటి నిర్మాణం నగరానికి ఆభరణంలా.. అందం తీసుకొచ్చేలా ఉండాలి.    
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా నగరాలు, పట్టణాల్లో చెత్త సేకరణకు ప్రతి వార్డుకు రెండు చొప్పున 8 వేల ఆటోమేటిక్‌ ట్రక్కులు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ వాహనాలను జూలై 8వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రతపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు చెత్త సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలని స్పష్టం చేశారు. క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌), జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విశాఖలో ప్రాధాన్యత ప్రాజెక్టులపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెత్తను సేకరించే ప్రతి ట్రక్కుకు జీపీఎస్, కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వీధి చివర డస్ట్‌ బిన్‌ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. సేకరించిన తడి, పొడి చెత్తను ప్రాసెసింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేయాలని, వ్యర్థ జలాల శుద్ధి కోసం ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశుధ్యం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు, చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి. 

వంద రోజుల అవగాహన
► ఎప్పటికప్పుడు చెత్తను తరలించేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాలని, ప్రధానంగా ప్రజలకు అవగాహన కల్పించాలనే విషయమై సమావేశంలో చర్చ జరిగింది. ఇందుకోసం 100 రోజుల పాటు ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. 
► పరిసరాల పరిశుభ్రత వల్ల వ్యాధులు దరి చేరవని, ఒక పద్దతి ప్రకారం చెత్తను తరలించేందుకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఆయా నగరాలు, పట్టణాల్లో సేకరించిన చెత్తను క్లస్టర్ల వారీగా పోగు చేసి ప్రాసెసింగ్‌ చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
► ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని, ఇందులో భాగంగా స్వల్ప మొత్తంలో సేవా చార్జీలు వసూలు చేస్తే బావుంటుందనే విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. నగర పంచాయతీలు, గ్రేడ్‌–2, గ్రేడ్‌–3 మునిసిపాలిటీల్లో రోజుకు ఒక్క రూపాయి చొప్పున.. గ్రేడ్‌–1, స్పెషల్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీల్లో రోజుకు రూ.2 రూపాయల చొప్పున, కార్పొరేషన్లలో రోజుకు రూ.3 చొప్పున ఒక్కో ఇంటి నుంచి వసూలు చేసే విషయం చర్చించారు. పేదలకైతే (బీపీఎల్‌) ఏ ప్రాంతంలో అయినా కేవలం రోజుకు ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. 
సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ట్రక్కుల కొనుగోలుకు ఏప్రిల్‌ మొదటి వారంలో టెండర్లు
► ఇంటింటికీ వెళ్లి తడిచెత్త, పొడిచెత్త విడి విడిగా సేకరించాలి. సేకరించిన చెత్తను వంద శాతం ట్రీట్మెంట్‌ చేయడమే లక్ష్యం. 8,000 ఆటోమేటిక్‌ ట్రక్కులు కొనుగోలు చేసేందుకు ఏప్రిల్‌ మొదటి వారంలో టెండర్లు పిలుస్తారు. 
► రోజుకు 30 టన్నుల కన్నా ఎక్కువ తడిచెత్త ఉంటే బయోమెథనేషన్‌ (బయోగ్యాస్‌ తరహా) ప్రక్రియ అమలు చేస్తారు. రాష్ట్రంలో ఆరు అర్బన్‌ ప్రాంతాల్లో ఐదు బయోమెథనేషన్‌ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. 68 అర్బన్‌ ప్రాంతాల్లో బయోమెథనేషన్, వర్మీ కంపోస్ట్‌ తయారీ యూనిట్ల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఇవికాక కొత్తగా మరో 10 బయోమెథనేషన్‌ ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 
► 30 టన్నుల లోపు తడిచెత్త ఉంటే వర్మి కంపోస్టుగా మార్చే ప్రక్రియ. తడిచెత్త నుంచి వర్మి కంపోస్టు తయారీ చేసే యూనిట్లు 18 నిర్మాణంలో ఉన్నాయి. కొత్తగా మరో 50 యూనిట్ల నిర్మాణానికి ప్రతిపాదనల సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్‌ ఆఖరు నాటికి వీటిని ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. 

పొడిచెత్త నుంచి విద్యుత్‌ తయారీపై దృష్టి
► పొడిచెత్త నుంచి విద్యుత్‌ తయారు చేసే కేంద్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సిద్ధంగా ఉన్న 74 పొడిచెత్త రికవరీ కేంద్రాలను ఉపయోగించుకుంటారు.
► గుంటూరు జిల్లాలో 9 మునిసిపాలిటీలు, వీటికి అనుకుని ఉన్న 22 ప్రాంతాల్లో పొడిచెత్తను సేకరించి, దాని నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే యూనిట్‌ నిర్మాణం గుంటూరులో పురోగతిలో ఉంది. 
► విశాఖపట్నంలో 4 మున్సిపాలిటీలు, వీటికి ఆనుకుని ఉన్న 8 ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాల నుంచి పొడిచెత్త సేకరించి, విద్యుత్‌ ఉత్పత్తి చేసే కేంద్రం ఇక్కడ (విశాఖలో) నిర్మాణంలో ఉంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ తరహా ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. 
► పురపాలక శాఖ కొన్ని వ్యర్థాలను సిమెంటు పరిశ్రమలకు ముడి పదార్థంగా అందించనుంది. 34 మునిసిపాలిటీలలో వ్యర్థాలను సిమెంటు కంపెనీలకు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా 20 మునిసిపాలిటీల నుంచి వ్యర్థాల సరఫరా ప్రక్రియ అనుసంధానం పూర్తయింది. 
► లక్ష లోపు జనాభా ఉన్న మునిసిపాలిటీలలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జగనన్న కాలనీలు సహా 93 చోట్ల మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.
 
జగనన్న కాలనీల్లో ప్రతి పనిలో నాణ్యత
► వైఎస్సార్‌ జగనన్న కాలనీ పనుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. మౌలిక సదుపాయాలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సీఎం చెప్పారు. ప్రతి పనిలో కూడా నాణ్యత స్పష్టంగా కనిపించాలన్నారు.
► రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైన్లు, తాగునీటి సరఫరా, కరెంటు, కాలనీలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాల కోసం మొత్తంగా రూ.30,691 కోట్లు ఖర్చు అవుతుందని, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో కలిపి మొత్తం రూ.33,406 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. 

విశాఖలో వేగంగా ప్రాధాన్యత ప్రాజెక్టు పనులు 
► భోగాపురం ఎయిర్‌పోర్టు, బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్, పోలవరం నుంచి గోదావరి జలాలను పైపులైన్‌ ద్వారా విశాఖకు తరలించడం.. ఈ మూడు పనులను శరవేగంగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. నాలుగు వారాల తర్వాత మరోసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. 
► వీటి తర్వాత మెట్రో ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలని, విశాఖపట్నం నుంచి భీమిలి వరకు ఇప్పుడున్న బీచ్‌ రోడ్డు విస్తరణ.. భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. 
► రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తి చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. భూ సేకరణతో కలుపుకుని భీమిలి నుంచి భోగాపురం వరకు రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.1,167 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్టు అధికారులు వెల్లడించారు.

విశాఖకు గోదావరి జలాలు
► పోలవరం నుంచి గోదావరి జలాలను విశాఖ నగరానికి తరలింపునకు సంబంధించి పైపులైన్‌ ప్రాజెక్ట్‌ను కూడా ప్రాధాన్యతగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. 
► రానున్న 30 ఏళ్ల కాలానికి విశాఖ నగరానికి నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. 

ట్రాం, మెట్రోల ఏర్పాటుకు రూ.20 వేల కోట్లు
► విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గేట్‌ నుంచి భోగాపురం వరకు మెట్రో ప్రతిపాదనలకు సంబంధించి మొత్తంగా 76.9 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం చేశారు. 53 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదించారు. దీంతో పాటు 60.2 కి.మీ. మేర ట్రాం కారిడార్‌ ప్రతిపాదించారు.
► మెట్రో, ట్రాం కలిపి 137.1 కి.మీ కారిడార్‌ ఉండనుంది. కేవలం మెట్రో నిర్మాణానికి దాదాపు రూ.14 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేయగా ట్రాం సర్వీసులకు మరో రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా.
► ట్రాం, మెట్రోల ఏర్పాటుకు మొత్తంగా రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 
► ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement