మన సత్తా చాటారు: సీఎం వైఎస్‌ జగన్‌ | CM Jagan Review Meeting With Medical Health Department | Sakshi
Sakshi News home page

మన సత్తా చాటారు: సీఎం వైఎస్‌ జగన్‌

Published Tue, Jun 22 2021 4:08 AM | Last Updated on Tue, Jun 22 2021 11:06 AM

CM Jagan Review Meeting With Medical Health Department - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో గత రికార్డును అధిగమిస్తూ రాష్ట్రంలో ఒకేరోజు పెద్ద ఎత్తున టీకాలు ఇచ్చిన అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. అధిక సంఖ్యలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే అంతేస్థాయిలో టీకాలు ఇవ్వగలిగే సామర్థ్యం మనకు ఉందని, ఇంతకంటే మెరుగ్గా చేయగలమని స్పష్టం చేశారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, సచివాలయాల సిబ్బంది, మండలానికి రెండు పీహెచ్‌సీలు, డాక్టర్లు.. ఇలా గట్టి యంత్రాంగం మనకు ఉందన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే మరోసారి మెగా డ్రైవ్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి సూచించారు. కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడుపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఒక్కరోజులో 20 – 25 లక్షల మందికి వాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం, యంత్రాంగం మనకు ఉందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

సమర్థంగా ఎమర్జెన్సీ ప్లాన్స్‌..
ఆస్పత్రుల్లో అనుకోని ప్రమాదాలు సంభవించిన సమయాల్లో రోగులను సురక్షితంగా తరలించేందుకు ఎమర్జెన్సీ ప్లాన్స్‌ సమర్థంగా ఉండాలని, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అనుసరించే ప్రోటోకాల్స్‌పై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధ్యయనం చేసిన అధికారులు దీనికి సంబంధించిన వివరాలను సమర్పించారు. బిల్డింగ్, సర్వీసులు, నాన్‌ బిల్డింగ్‌ సర్వీసులపై అధ్యయనం నిర్వహించారు. సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ ఏ.బాబు, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు తదితరులు హాజరయ్యారు.


సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు 

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ఇలా...
– ఏపీలో ఇప్పటిదాకా 1,37,42,417 డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి
– 82,77,225 మందికి మొదటి డోసు, 27,32,596 మందికి రెండు డోసుల టీకాలు. మొత్తంగా వ్యాక్సిన్లు 
ఇచ్చిన వారి సంఖ్య 1,10,09,821
– ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లుల్లో 10,29,266 మందికి వ్యాక్సినేషన్‌
– విదేశాలకు వెళ్లనున్న 11,158 మందికి మొదటి డోసు
– జూన్‌ 20న నిర్వహించిన మెగా డ్రైవ్‌లో మొత్తం 13,72,481 మందికి టీకాలు.

రికవరీ రేటు 95.93 %
– తూర్పు గోదావరి మినహా అన్ని జిల్లాల్లో తగ్గిన పాజిటివిటీ రేటు. పాజిటివిటీ రేటు 5.65 శాతం
– 63,068కు తగ్గిన యాక్టివ్‌ కేసులు
– 95.93 శాతానికి చేరిన రికవరీ రేటు
– తాజాగా అందుబాటులో 2,655 ఐసీయూ బెడ్లు, 13,824 ఆక్సిజన్‌ పడకలు.
– మే 17న అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ బెడ్లు కేవలం 433.
– 91.48 శాతం పడకల్లో ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స
– 104 కాల్‌ సెంటర్‌కు కోవిడ్‌ ఉధృతి సమయంలో గరిష్టంగా వచ్చిన కాల్స్‌ 19,715 కాగా ప్రస్తుతం వచ్చిన కాల్స్‌ 1,506
– కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో భర్తీ అయిన బెడ్లు 7,056

బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల్లో 1,232 మంది డిశ్చార్జి
– బ్లాక్‌ ఫంగస్‌ యాక్టివ్‌ కేసులు 2,772
– 922 మందికి సర్జరీలు, 1,232 మంది డిశ్చార్జి
 – 212 మంది మృతి
– మిగిలిన వారికి ఆస్పత్రిలో చికిత్స

మరోసారి నిరూపించాం..
‘‘మన దగ్గర పటిష్ట యంత్రాంగం ఉన్నందువల్లే రాష్ట్రంలో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్‌ సాధ్యమైంది. టీకాలు అందుబాటులో ఉంటే శరవేగంగా ఇచ్చే సమర్ధత ఉందని అధికార యంత్రాంగం మరోసారి నిరూపించింది’’  – ముఖ్యమంత్రి జగన్‌

 ఆస్పత్రుల నిర్వహణపై ఎస్‌వోపీలు
ఆస్పత్రుల ఆవరణలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి పటిష్టమైన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ)లను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనం పోటీపడుతున్నది ప్రభుత్వ ఆస్పత్రులతో కాదని, కార్పొరేట్‌ ఆస్పత్రులతో పోటీ పడేలా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదన్నారు. 

ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి..
పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్‌ ఆంక్షలను సడలిస్తుండటం, రాకపోకలు పెరుగుతున్న సమయంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

శరవేగంగా కొత్త మెడికల్‌ కాలేజీలు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే వైద్య కళాశాలల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని సీఎం ఆదేశించారు. పనుల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement