రాష్ట్రాలకు నాస్తి.. ప్రైవేటుకు జాస్తి | CM Jagan suggestion is receiving national support from experts on vaccines | Sakshi
Sakshi News home page

రాష్ట్రాలకు నాస్తి.. ప్రైవేటుకు జాస్తి

Published Sat, May 29 2021 4:28 AM | Last Updated on Sat, May 29 2021 6:25 AM

CM Jagan suggestion is receiving national support from experts on vaccines - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో అర్హులందరికీ సకాలంలో ఉచితంగా కోవిడ్‌ వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యానికి ‘ప్రైవేటు సరఫరా’ గండికొడుతోంది. ఉత్పత్తి అవుతున్నవ్యాక్సిన్లలో పావు వంతు గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు రంగానికి తరలిపోతున్నాయి. వ్యాక్సిన్ల కొరతతో రాష్ట్రాలు సతమతమవుతుంటే.. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు రోగుల నుంచి ఒక్కో డోసుకు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు దండుకుంటున్నాయి. ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ల సరఫరా నిలిపేయాలని ప్రధాని నరేంద్రమోదీకి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎం సూచనకు నిపుణుల నుంచి జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోంది. 

రోజుకు 27 లక్షల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తి
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌ కంపెనీ కలిపి రోజుకు 27 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. సీరం ఇన్‌స్టిటూŠయ్‌ట్‌ నెలకు 6.50 కోట్ల డోసుల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు, భారత్‌ బయోటెక్‌ నెలకు దాదాపు 2 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. దీని ప్రకారం.. మేలో దేశంలో 8.50 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. 

రాష్ట్రాలను విస్మరించి ప్రైవేటుకు తరలింపు
మేలో దేశంలో 8.50 కోట్ల డోసులు ఉత్పత్తి అయితే.. అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కలిపి 5 కోట్ల డోసులే వేయనున్నాయి. మిగిలిన 3.50 కోట్ల డోసులను ప్రైవేటు సెక్టార్‌కు తరలిస్తున్నట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు ముందుగానే ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని చెబుతుండటం గమనార్హం. ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు వేసే రాష్ట్రాల అవసరాలను విస్మరించి మరీ ప్రైవేటు రంగానికి ఇవ్వడం ఏమిటన్నది అంతు చిక్కడం లేదు. 

యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు
కరోనా విజృంభణతో ప్రైవేటు ఆస్పత్రులు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒక్కో డోసుకు రూ.2 వేల నుంచి ఏకంగా రూ.25 వేల వరకు వసూలు చేస్తుండటం విస్మయపరుస్తోంది. ఇంత అత్యధిక ధరకు దేశంలో బడా కార్పొరేట్‌ సంస్థలు, ఇతర ప్రైవేటు వ్యక్తులకు వ్యాక్సిన్లు వేస్తున్నాయి. ఇలా ఒక్కమేలోనే 3.50 కోట్ల డోసుల వ్యాక్సిన్లకు ఎన్ని వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డాయన్నది ఊహకే అంతు చిక్కడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే టీకా..
దేశంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టీకాలు వేసే ప్రక్రియ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే సాగాలని.. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్లు సరఫరా చేయొద్దని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఒక్కో డోసుకు ప్రైవేటు ఆస్పత్రులు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి భారీగా పెరిగే వరకు టీకాను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే వేయాలని.. అంతవరకు ప్రైవేటు రంగానికి సరఫరా నిలిపివేయాలని నిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు.

కేంద్రం నుంచి తగినంత సరఫరా లేక..
మేలో దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి, రాష్ట్రాలు వేస్తున్న వ్యాక్సిన్ల గణాంకాలను పరిశీలిస్తే.. వాస్తవ పరిస్థితి బోధపడుతుంది. కేంద్ర ప్రభుత్వ కోవిన్‌ పోర్టల్‌ ప్రకారం.. అన్ని రాష్ట్రాలు మే మొదటి మూడు వారాల్లో రోజుకు సగటున 16.2 లక్షల డోసుల చొప్పున వ్యాక్సిన్లు వేశాయి. వ్యాక్సిన్ల కొరతతో ముందు 45 ఏళ్లు దాటినవారికే వ్యాక్సిన్లు వేస్తున్నాయి. కేంద్రం నుంచి తగినంతగా వ్యాక్సిన్ల సరఫరా లేకపోవడంతో మే 22 నుంచి సగటున రోజుకు 13 లక్షల వ్యాక్సిన్లే వేస్తున్నారు. పోనీ రోజుకు సగటున 16.2 లక్షల డోసుల లెక్కన తీసుకున్నా.. మే 31 నాటికి దేశంలో గరిష్టంగా 5 కోట్ల డోసుల వ్యాక్సిన్లు మాత్రమే వేయగలరని తేలింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement