
రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్న నాయకుడు వైఎస్ జగన్.. చదువుకునే రోజుల్లోనూ ఎంతో చరుకుగా ఉండేవాడు. ఆ సమయం నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కనిపించాయి. అదే ఆయన చేత అరుదైన ఘనతను సాధించి పెట్టాయి.
తండ్రి కంటే తాత దగ్గరే జగన్‌కు చనువెక్కువ. అందుకే స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో కూడా సెలవులొస్తే చాలు పులివెందుల రావడం, తాత వాడే జీపులో ఊరంతా తిరగడం అలవాటుగా ఉండేది. హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసేది కాదు. పైగా పులివెందులలోనూ ఒక మిత్రబృందం ఉండేది. వాళ్లందరినీ గుమికూడ్చి క్రికెట్ ఆడడం కూడా ఒక అలవాటుగా మారిపోయింది.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఐసిఎస్‌ఐ సిలబస్ కావడంతో.. అక్కడే 12వ తరగతి వరకూ చదివే వెసులుబాటు ఉండేది. అక్కడ చదివినంత కాలం ఏ ఒక్క ఆటకూ పరిమితం కాకుండా క్రికెట్, బాస్కెట్ బాల్ లాంటి రకరకాల ఆటల మీద ఆసక్తికనబరిచేవాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే శ్రీబాగ్ ఇంటి దగ్గర కూడా స్నేహితుల బృందంతో కలిసి క్రికెట్ ఆడేవాడు. చదవులో సగటు విద్యార్థి కంటే కాస్త ఎక్కువ అనిపించుకున్నా, అందరితో బాగా కలిసి మెలసి ఉండటంలో మాత్రం చురుగ్గా ఉండేవాడని స్కూల్ టీచర్లు, సిబ్బంది చెబుతారు.
డాక్టర్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సూరీడు, రోజూ మారుతీ కారులో జగన్‌మోహన్‌రెడ్డిన డ్రాప్ చేసి పికప్ చేసుకునేవాడు. నిజానికి మధ్యాహ్నం మూడు గంటలకే క్లాసులు పూర్తయినా, సాయంత్రం దాకా స్కూల్లోనే మిత్రులతో ఉండిపోయేవాడు. అలా హాస్టల్లో ఉండే మిత్రులతో కలిసి ఎక్కువసేపు గడపటానికి జగన్ ఇష్టపడేవాడు. మళ్లీ ఇంటికి వెళ్లగానే చదువు మామూలే.
అలా అందరినీ కలుపుకుపోయే నాయకత్వ లక్షణాలుండటం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హౌజ్ కెప్టెన్ అయ్యేందుకు కారణమైంది. స్కూల్లో ఉన్న విద్యార్థులందరినీ నాలుగు హౌజ్‌లుగా విభజించడం అక్కడ ఆనవాయితీ. వాటికి రెడ్ హౌజ్, బ్లూ హౌజ్, గ్రీన్ హౌజ్, ఎల్లో హౌజ్ అని పేర్లు. ఏ పోటీలు జరిగినా.. ఆ నాలుగు హౌజ్‌ల మధ్యే జరుగుతాయి. అంటే క్రికెట్ అనగానే ఈ నాలుగు జట్ల మధ్య జరిగే పోటీలో విజేతను నిర్ణయిస్తారు. అదే విధంగా ఖో ఖో, బాస్కెట్ బాల్.. ఏదైనా అంతే. ఆటలతో పాటు వక్తృత్వం, వ్యాసరచన లాంటి పోటీలూ జరుగుతాయి. ఏటా జరిగే ఈ పోటీల్లో ఆల్ రౌండ్ చాంపియన్‌షిప్ సాధించడం ఒక ప్రతిష్టాత్మకమైన విషయం. 12వ తరగతిలో ఉన్నవాళ్లకి మాత్రమే హౌజ్ కెప్టెన్సీ దక్కుతుంది. అలా.. జగన్ 12వ తరగతిలో ఉన్నప్పుడు రెడ్ హౌజ్‌కు కెప్టెన్ అయ్యాడు. పైగా ఆ సంవత్సరం తన హౌస్‌కు ఆల్ రౌండ్ ఛాంపియన్‌షిప్ సాధించిన ఘనత కూడా దక్కించుకున్నాడు.
అంతకు ముందుగా పదేళ్లుగా రెడ్ హౌజ్‌కు దక్కని గౌరవం.. జగన్ ఉన్నప్పుడే దక్కిందని మిత్రులు చెప్తుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జగన్‌మోహన్‌రెడ్డి కంటే ముందు రెడ్ హౌస్ కెప్టెన్‌గా వ్యవహరించింది చెన్నారెడ్డి మనవడు ఆదిత్యరెడ్డి(శశిధర్ రెడ్డి కుమారుడు). హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆదిత్యరెడ్డి 12వ తరగతి చదువు, రెడ్ హౌస్ కెప్టెన్సీ ముగిసిన సంవత్సరమే చెన్నారెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోయారు. ఆ సంవత్సరం ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అవుతారనుకున్న రాజశేఖర్‌రెడ్డి కాలేకపోయారుగానీ, ఆదిత్యరెడ్డి స్థానంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రెడ్ హౌస్ కెప్టెన్ పదవి మాత్రం జగన్‌మోహన్‌రెడ్డిని వరించింది.
:::సీఎం జగన్ పుట్టినరోజు ప్రత్యేకం
సంగ్రహణ: యువకెరటం(ఎ.ఎస్.ఆర్.మూర్తి, బుర్రా విజయశేఖర్)
Comments
Please login to add a commentAdd a comment