AP CM YS Jagan Comments On Tollywood Celebrities Meeting And Ticket Prices - Sakshi
Sakshi News home page

YS Jagan On Ticket Prices: సినిమా ఏదైనా ఒకే ధర 

Published Fri, Feb 11 2022 3:24 AM | Last Updated on Fri, Feb 11 2022 9:24 AM

CM YS Jagan comments with cine celebrities about tickets price - Sakshi

సమావేశంలో సినీ ప్రముఖులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: చిన్న, పెద్ద సినిమాలకు న్యాయం జరిగేలా మంచి పాలసీ తీసుకొచ్చేందుకు కొద్ది రోజులుగా కసరత్తు జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటుతో టికెట్లను ఆన్‌లైన్‌ పద్ధతిలో విక్రయించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో షూటింగ్‌లను ప్రోత్సహించేందుకు కొంత శాతం సినిమాను ఇక్కడే నిర్మించాలని కోరారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్‌ నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, మహి రాఘవ తదితర ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సినిమా చూసే ప్రేక్షకులకు భారం కాకుండా, ఆ రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించేలా మార్పు చేశామని తెలిపారు. అన్ని సినిమాలకు అదే రేటుకు ఐదో షోకు అనుమతిస్తున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

► మంచి పాలసీ తీసుకు రావడం ద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని కొద్ది కాలంగా కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే అందరి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటూ, దీనిపై కమిటీని నియమించాం. 
► ఆ కమిటీ తరచూ సమావేశమవుతూ వాళ్ల కొచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ను నాతో పంచుకుంది. ఇంకా విస్తృతంగా తెలుసుకునేందుకు మిమ్నల్ని కూడా రమ్మని చెప్పాం. సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని, ఇండస్ట్రీ నిలబడ్డానికి ఒక మంచి వ్యవస్థను క్రియేట్‌ చేసుకునేందుకు తపన, తాపత్రయంతోనే అడుగులు పడ్డాయి. 
► మీరన్నట్టుగా ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేనంత వరకు కొద్ది మందికి ఎక్కువ వసూలు చేయడం, కొద్ది మందికి తక్కువ వసూలు చేయడం అనేది ఉంటుంది. 
► నేను, చిరంజీవి అన్న ఇద్దరం కలిసి కూర్చుని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించాం. అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. హీరో, హీరోయిన్, దర్శకుడు పారితోషికం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణ వ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు ఉన్నాయి. ఈ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు. అటువంటి వాటిని ప్రత్యేకంగా చూడాలి. అలా ప్రత్యేకంగా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారు. 

భారీ బడ్జెట్‌ సినిమాలకు వారం పాటు ప్రత్యేక ధర
► హీరో, హీరోయిన్, డైరెక్టర్‌ రెమ్యునరేషన్‌ కాకుండా కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయ్యే భారీ బడ్జెట్‌ సినిమాలను ప్రత్యేకంగా ట్రీట్‌ చేయాలి. అటువంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్‌ చేయాలని చెప్పాం. 
► ఏపీలో సినిమా షూటింగ్‌లను ప్రమోట్‌ చేయడం కోసం.. ఇక్కడ కొంత శాతం షూటింగ్‌ జరిపి ఉండాలన్న నిబంధనను తీసుకురాగలిగితే మంచి ఫలితం ఉంటుంది. దానిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని.. దర్శకులు, నిర్మాతలతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కనీసం 20% అని చెప్పారు. 
► రేట్లకు సంబంధించినంత వరకు అందరికీ ఒకటే రేట్లు. ఆన్‌లైన్‌ పద్ధతిలో టికెట్ల విక్రయం ప్రభుత్వానికి, సినిమా ప్రొడ్యూసర్లకు కూడా మంచిదనే కోణంలో చూశాం.
► ఓటీటీలతో పోటీ పడాల్సిన పరిస్థితిలో సమతుల్యత కూడా ఉండాలని చర్చించాం. ఏడాదికి వెయ్యి రూపాయలతో అమెజాన్‌ మెంబర్‌ షిప్‌ ఇస్తోంది. నెలకు సగటున రూ.80 పడుతుంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. చిరంజీవి గారితో సుదీర్ఘంగా ఇదే విషయంపై చర్చించాం. అలాగే కనీస ఆదాయాలు రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. దాన్ని కూడా సమతుల్యం చేసుకుని సినిమాలు తీసే పరిస్థితి ఎలా అనే ఆలోచనతో రీజనబుల్‌ రేట్ల దిశగా వెళ్లాం. సినిమా చూసే ప్రేక్షకులకు భారం కాకుండా, ఆ రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించేలా ఉండేలా మాడిఫై చేశాం. 
► మీరు ఐదో షోను కూడా తీసుకురావాలని అడిగారు. సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం.. ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్‌హిట్‌ అవుతుంది. ఆ పాయింట్‌ అర్థం చేసుకున్నాం. అదే సమయంలో అది అందరికీ వర్తిస్తుంది. చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయి. వారిక్కూడా మంచి ఆదాయాలు వస్తాయి. ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది. మల్టీప్లెక్స్‌లను కూడా మంచి ధరలతో ట్రీట్‌ చేస్తాం. మీరు చెప్పిన అన్ని విషయాలను మనసులో పెట్టుకున్నా. 

విశాఖపట్నం బిగ్‌ సిటీ అవుతుంది..
► తెలంగాణతో పోలిస్తే ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేస్తోంది. తెలంగాణ 35 నుంచి 40% కంట్రిబ్యూట్‌ చేస్తుంటే.. ఆంధ్రా 60% వరకు కంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, థియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయపరంగా కూడా ఎక్కువ.
► వాతావరణం బాగుంటుంది. అందరికీ స్థలాలు ఇస్తాం. స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపించే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తాం. జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్‌ చేద్దాం.  
► చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదు. మనం ఓన్‌ చేసుకోవాలి, మనందరం అక్కడికి వెళ్లాలి. ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో మహా నగరాలతో పోటీ పడుతుంది. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలి. అందరూ దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి.  

చిన్న సినిమాను రక్షించుకుందాం
► రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలి. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలి. దీనికోసం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. సినిమా క్లిక్‌ కావాలంటే పండుగ రోజు రిలీజ్‌ చేస్తే హిట్‌ అవుతుందని అందరికీ తెలుసు. 
► ఇక్కడే చిన్న సినిమాను రక్షించుకోవడానికి కూడా కొంత సమతుల్యత అవసరం. పరిశ్రమ నుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలి. ఆ పండుగ రోజు మాకు అవకాశాలు లేవని చిన్న సినిమా వాళ్లు అనుకోకుండా కాస్త సమతుల్యత పాటించాలని విజ్ఞప్తి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement