Tollywood Celebrities Press Meet After Meeting With AP CM YS Jagan - Sakshi
Sakshi News home page

Tollywood Celebrities Press Meet: ఇప్పుడు చాలా సంతోషం

Published Fri, Feb 11 2022 3:36 AM | Last Updated on Fri, Feb 11 2022 9:27 AM

Movie celebrities Chiranjeevi Mahesh Babu Prabhas Rajamouli meeting with CM - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న చిరంజీవి. చిత్రంలో మంత్రి పేర్ని నాని, సినీ ప్రముఖులు

సాక్షి, అమరావతి : సినిమా టికెట్‌ ధరలు, ఇతర సమస్యలపై సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేశారు. సీఎం ప్రతిపాదనలు ఉభయ తారకంగా.. ఇటు ప్రేక్షకులు, అటు సినీ రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సమావేశంలో సీఎంతో, అనంతరం మీడియాతో వారు మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. 

సంతృప్తిగా ఉంది : చిరంజీవి
పరిశ్రమలో అందరితో మాట్లాడి మీ ముందుకు వచ్చాం. మీ ప్రతిపాదనలు చూశాక మాకు చాలా సంతృప్తిగా ఉంది. కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు మంచి, చెడ్డలు తెలుసుకోవడానికి, మా అభిప్రాయం సేకరించడానికి తొలుత ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత కలిసికట్టుగా అందరం వచ్చి అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను, మీ నిర్ణయాలను ఎప్పుడూ గౌరవిస్తాం. మీరు పేదల మనిషి. ఉభయులకీ సామరస్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవడం బాగుంది. మా అందరికీ చాలా వెసులుబాటు కల్పించారు. మీరు తీసుకున్న నిర్ణయాలు పట్ల ఎగ్జిబిటర్ల రంగం చాలా సంతోషంగా ఉంది. అందరం ఇదే అభిప్రాయంతో ఉన్నాం. టికెట్‌ రేట్లుగాని, ఇతరత్రా విషయాల్లో చాలా ఎక్సర్‌సైజ్‌ చేశారు. పెట్టే అమ్మను అన్నీ అడుగుతారు. ఇచ్చే వారినే కోరుతారు. అందుకే మేం కొన్ని కోరికలు కోరుతున్నాం.

సినిమా థియేటర్‌కు ప్రేక్షకులను రప్పించడానికి కొన్ని ప్రత్యేకతలు సినిమాలోకి తీసుకురావాల్సి వస్తోంది. విజువల్‌ ఇంపాక్ట్‌ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. అవి ఉంటేనే కానీ జనాలు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనే మూడ్‌లో లేరు. మా సినిమాలు విడుదలైన వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఓటీటీ రూపంలో వస్తోంది. అలాగే పైరసీ ఎప్పటి నుంచో మాకున్న పెద్ద గొడ్డలిపెట్టు. ఇవన్నీ అధిగమించి మేం సినిమాలు తీయాలంటే.. మేం ఖర్చు అధికంగా పెట్టాల్సి వస్తోంది. తెలుగుతనాన్ని, తెలుగు సినిమాను కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగే దిశగా మీ చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి. తల్లి స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్నల్ని అడుగుతున్నాం. తర్వాత ఐదో షో మన నారాయణ మూర్తి గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అది ఉంటే మనకు కొంత వెసులుబాటు ఉంటుంది. అది మీ ముందు పెడితే మీరు ఒప్పుకున్నారు.

సీఎంకు ధన్యవాదాలు
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, మా ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ పరిశ్రమ కళకళలాడాలంటే చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అందరూ బాగుండాలి. అప్పుడే పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది నటులు, కార్మికులకు చేతినిండా పనిదొరుకుతుంది. ఈ ఉద్దేశంతో ఐదో షోకు మేము అనుమతి కోరితే.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆమోదం తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప కీర్తి లభిస్తోంది. అందుకు కారణమైన భారీ బడ్జెట్‌ సినిమాలకు వెసులుబాటు కల్పించే అంశంపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

అందాల నగరమైన విశాఖపట్నంను సినీ పరిశ్రమకు హబ్‌గా మార్చుతామని.. మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి బాటలు వేస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ సమంగా అభివృద్ధి చెందడానికి మా వంతు సహకారం అందిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌కు చెప్పాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంలో ముందు నుంచి ఎంతో చొరవ తీసుకున్న సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు. సీఎం తీసుకున్న నిర్ణయాలపై ఈనెల మూడో వారంలోగా ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేస్తుందని భావిస్తున్నాం. ఇకపై ఎలాంటి సమస్యలు వచ్చినా చర్చలతో సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటాం.

సినీ పరిశ్రమకు సంపూర్ణ సహకారం
సినిమాటోగ్రఫీ, సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని 
రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ సహకారం అందజేస్తారు.  సినీ పరిశ్రమకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పరిశ్రమ సమస్యలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకొచ్చి, పరిష్కారానికి కృషి చేసిన మెగాస్టార్‌ చిరంజీవికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సీఎం ప్రత్యేకంగా కమిటీ వేశారు. సినీ ప్రముఖులు ప్రతి సమస్యపైనా సీఎంతో విపులంగా చర్చించారు. పరిశ్రమకు సంబంధించిన వారు, సంబంధం లేని వారు సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నా.. చిరంజీవి వాటిని భరిస్తూ సినీ పరిశ్రమ శ్రేయస్సు కోసం సీఎం జగన్‌తో చర్చలు జరిపారు.

పరిశ్రమకు ఉపశమనం కల్పించారు. చిన్న సినిమాలకు సంబంధించి నటుడు ఆర్‌.నారాయణమూర్తి ఆవేదనను సీఎం వైఎస్‌ జగన్‌ అర్థం చేసుకున్నారు. పండగ, సెలవు రోజుల్లో చిన్న సినిమాలకు అవకాశం కల్పించాలని, అవి బతికేలా చర్యలు తీసుకోవాలని సినీ పరిశ్రమ పెద్దలను సీఎం కోరారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి ఏ సహకారం కావాలన్నా అందజేస్తామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సినిమాలు చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ప్రతిపాదనకు సినీ ప్రముఖులు సానుకూలంగా స్పందించారు. తమకు హైదరాబాద్‌ ఎంతో ఆంధ్రప్రదేశ్‌ కూడా అంతేనని, ఇక్కడా భారీ ఎత్తున సినిమాలు చిత్రీకరిస్తామని వారు సీఎంకు హామీ ఇచ్చారు.  

సమస్యల పరిష్కారానికి దారి చూపిన సీఎం
కోవిడ్‌ కారణంగా సినిమా పరిశ్రమకు పెద్ద ఇబ్బంది వచ్చింది. గత రెండేళ్ల నుంచి తీవ్ర సంక్షోభంలో ఉంది. మా కెరీర్‌లో ఈ రెండేళ్లు చాలా ఇబ్బందికరం. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్‌.. ఈ తరహా చర్చల వల్ల తొలగిపోతాయి. ఈ రెండేళ్లలో ఎప్పుడు షూటింగ్‌ ఆగిపోతుందో.. ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో తెలియని పరిస్థితి ఉండింది. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. సినీ పరిశ్రమ సందిగ్ధంలో పడిపోయిన తరుణంలో చిరంజీవి ముందడుగు వేసి.. సీఎం జగన్‌తో చర్చించి, సమస్యల పరిష్కారానికి దారి చూపించారు. ఈ రోజు సినీ పరిశ్రమకు సీఎం జగన్‌ గొప్ప ఉపశమనం కల్పించినందుకు కృతజ్ఞతలు. వారం పది రోజుల్లోనే శుభ వార్త వింటాం. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన చిరంజీవికి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు.    
– మహేష్‌బాబు, సినీనటుడు

ఇండస్ట్రీకి మంచి చేస్తే అందరికీ లాభం
గతంలో సినిమాలు 50 రోజులు, 100 రోజులు ఆడేవి. ఇప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ మూడు రోజుల్లో ఏ స్టార్‌ సినిమా అయినా హిట్‌ లేదా ప్లాప్‌. ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు, నటులు మాత్రమే కాదు వేల మంది టెక్నీషియన్లు ఉన్నారు. ఇండస్ట్రీకి మంచి చేస్తే ఆ టెక్నీషియన్స్‌ గుండెల్లో మీరు ఉండిపోతారు. అందరికీ మేలు జరుగుతుంది.    
– అలీ, సినీనటుడు 

సంతోషంగా ఉంది
ఇప్పటి వరకు సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఒక అగాధం ఉందనే భ్రమ ఉండేది. ఈ రోజుతో అది తొలగిపోయింది. మాతో మీరు (సీఎం) నేరుగా మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించి సినిమా థియేటర్‌ యజమాని నుంచి ఎగ్జిబిటర్, నిర్మాత వరకు ఉన్న సమస్యలపై సీఎం జగన్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. సమస్యల పరిష్కారానికి మా ప్రతిపాదనలన్నీ విని.. సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన చిరంజీవికి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. సినిమా పెద్ద అంటే చిరంజీవికి నచ్చదు. కానీ ఆయన చేసే పనుల వల్ల ఆయనకు పెద్దరికం వచ్చింది. సీఎం వైఎస్‌ జగన్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యంతో చిరంజీవి చర్చలు జరిపి.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.    
– రాజమౌళి, దర్శకుడు

మీరు చేయాలనుకుంటే చేస్తారు
చిన్న సినిమాలు బతకాలి. ఇంతకు ముందు నేను చిన్న సినిమాలకు రాసేవాడిని. ప్రేయసిరావే, గాయం, స్నేహితులు.. ఇలాంటి వాటికి రాశాను. శివయ్య నేనే రాశాను. పెద్ద హిట్‌ అయింది. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు. వీటి వల్ల చిన్న సినిమా చచ్చిపోయింది. సీఎం చేయాలనుకుంటే.. ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తారు. చిన్న సినిమాలకు మీరు తోడుగా నిలవండి. కేరళలో కూడా చిన్న సినిమాలు బాగా నడుస్తున్నాయి. సినిమా పరిశ్రమలో 30 వేల మంది టెక్నీషియన్లు ఉన్నారు.   
 – పోసాని కృష్ణమురళి, సినీ నటుడు

సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు
సీఎం వైఎస్‌ జగన్‌ మాకు సమయం ఇచ్చారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు. చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. అందుకు కృతజ్ఞతలు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న చిరంజీవికి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు.    
– ప్రభాస్, సినీనటుడు 

చిన్న సినిమా బతకాలి
సగటు సినిమా బతకాలి. పండుగ వచ్చినా, సెలవులు వచ్చినా.. పెద్ద సినిమాలకే అవకాశాలు వస్తున్నాయి. చిన్న సినిమా కూడా బతకాలి. హిట్‌ అయితేనే సినిమాలు చూస్తారు. చిన్న సినిమాలకు నూన్‌ షో ఉండాలని కోరుతున్నాం. భారీ సినిమా ఎలాంటి ఫలితాలు అనుభవిస్తుందో.. సగటు సినిమా అలాంటి ఫలితాలు అనుభవించాలి. పండగలు, సెలవుల సమయాల్లో పెద్ద సినిమాలదే హవా. ఆ సమయంలో చిన్న, సగటు సినిమాలు ప్రదర్శించడానికి థియేటర్లు దొరకడం లేదు. థియేటర్లను అడుక్కోవాల్సిన పరిస్థితి. సగటు సినిమా మనుగడ ప్రశ్నార్థకమైన సమయంలో.. సినిమాను నిలబెట్టేలా మహానుభావుడు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమ విరాజిల్లుతుంది. సినీ పరిశ్రమలో ఉత్తమ పనితీరు కనబరిచిన కళాకారులకు ఏటా నంది అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి. పరిశ్రమ సమస్యలు పరిష్కరించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. సీఎంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని.. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చిరంజీవికి కృతజ్ఞతలు. పరిశ్రమ సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు.     
– ఆర్‌.నారాయణ మూర్తి, సినీనటుడు, దర్శకుడు, నిర్మాత 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement