సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా, సమర్థవంతంగా పని చేసేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది పనితీరుపై కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఫిర్యాదులతో పాటు సమస్యలను తెలియజేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాలన్నింటి వద్ద 1902 నంబరును కచ్చితంగా డిస్‌ప్లే చేయాలని చెప్పారు. ఇది సచివాలయాల సిబ్బంది పనితీరుపై ఫీడ్ బ్యాక్ కోసం కూడా ఉపయోగపడుతుందన్నారు. గ్రామ స్థాయి వ్యవసాయ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో అగ్రికల్చర్ కమిటీలు ఉన్నందున వాటితో సమన్వయం చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ సమీక్షలో సీఎం జగన్, అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సిబ్బందికి శాఖాపరమైన పరీక్షలు
– గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందితో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పూర్తయ్యాక శాఖా పరమైన పరీక్ష నిర్వహించాలి. ఇందులో క్వాలిపై అయితేనే వారికి ప్రొబేషనరీ పీరియడ్ పూర్తవుతుంది. ఇందు కోసం ప్రతి 3 నెలలకొకమారు పరీక్ష నిర్వహించేలా చూడాలి.
– గ్రామ సచివాలయంలోనే సబ్ రిజిస్ట్రార్ విధులు కూడా నిర్వహించాల్సి ఉన్నందున అందుకు తగిన విధంగా సన్నాహాలు చేయాలి. దీనివల్ల ఆ గ్రామ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలందుతాయి.
– దేశ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు ప్రశంసలు వస్తున్నాయని, కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ఈ వ్యవస్థ గురించి ఆరా తీశాయని.. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు భాధ్యతల గురించి అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 3.95 లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు.
– ఈ సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, జల వనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment