కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు, శాసనసభ్యులతో మాట్లాడుతున్న సీఎం
సాక్షి, అమరావతి: ప్రజా ప్రాధాన్యం కలిగిన అంశాలన్నింటిపైనా ప్రతిపక్షం ముందుకు వచ్చినçప్పుడు చర్చకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. వైఎస్సార్ సీపీకి 150 మందికి పైగా ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికి ప్రతిపక్షంతో పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, శాసన మండలి శీతాకాల సమావేశాలు 30వతేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శుక్రవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్‌లు, విప్‌లతో సమావేశమయ్యారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం కూడా మంత్రులతో కొద్ది సేపు ఈ అంశాలపై సీఎం చర్చించారు. ఉభయ సభల్లో అధికారపక్షం అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు.
ఉభయ సభల సమావేశాలు జరిగినన్ని రోజులూ సంబంధిత శాఖల మంత్రులు, ఆయా అంశాలపై ఆసక్తి గల ఎమ్మెల్యేలు ముందుగా సమావేశమై వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కోరారు. 20 అంశాలపై ప్రధానంగా చర్చకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయించినట్లు తెలిసింది. పోలవరంతో సహా పలు సాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్ల స్థలాలను అడ్డుకుంటూ ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు, టిడ్కో గృహాలు, అవినీతి నిర్మూలన, పాలనలో పారదర్శకత, నూతన ఇసుక విధానం, ఉచిత విద్యుత్తు, మద్య నియంత్రణ, ప్రభుత్వ సంస్కరణలు, కరోనా నియంత్రణ చర్యలు, మహిళా సాధికారత, సున్నా వడ్డీకి రుణాలు తదితర అంశాలపై చర్చకు అధికారపక్షం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
15 బిల్లులు.. 5 రోజులు!
ప్రభుత్వం తరఫున 15 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇందులో పంచాయతీరాజ్, పారిశ్రామిక విధానంలో మార్పులతో సహా అనేక బిల్లులున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరగవచ్చనే అభిప్రాయం సమావేశంలో చూచాయగా వ్యక్తం అయినట్లు తెలిసింది. అధికారికంగా ఎన్ని రోజులు సమావేశాలు జరుగుతాయనేది తొలి రోజున జరిగే బీఏసీ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నెల 28, 29వ తేదీల్లో కూడా సమావేశం కావాలని చీఫ్‌విప్, విప్‌లను సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు వ్యూహాన్ని రూపొందించి ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొనే బాధ్యతను మంత్రులు బుగ్గన, బొత్స , పెద్దిరెడ్డిలకు అప్పగించారు. సమావేశంలో ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రామలింగేశ్వరరావు, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు పింఛన్లు
ప్రభుత్వం ఇస్తున్న సామాజిక భద్రతా పింఛన్లకు మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌లను కూడా అర్హులుగా నిర్థారిస్తూ తక్షణం ఆదేశాలు జారీ చేయాలని సీఎం జగన్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment