CM YS Jagan Comments On NTR Health University In AP Assembly Sessions - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ గొప్పతనాన్ని సంపూర్ణంగా నమ్ముతున్నాం

Published Thu, Sep 22 2022 4:01 AM | Last Updated on Thu, Sep 22 2022 8:28 AM

CM YS Jagan comments on NTR in AP Assembly Sessions - Sakshi

ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలున్నాయి. వీటిలో 8 కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపే, అంటే 1983 కంటే ముందే వచ్చాయి. మిగతా 3 మెడికల్‌ కాలేజీలు శ్రీకాకుళం, ఒంగోలు, కడపలో వైఎస్సార్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో మరో 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం. మొత్తం 28 మెడికల్‌ కాలేజీలలో 20 కాలేజీలు వైఎస్సార్‌ హయాంలోను, ఆయన తనయుడి హయాంలోను ఏర్పాటవుతున్నాయి. ఈ పరిస్థితిలో హెల్త్‌ వర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెట్టడం ఏ రీతిన చూసినా న్యాయమే కదా?
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఎన్టీఆర్‌ను గౌరవించే విషయంలో ఎక్కడా మనసులో మాకు కల్మషం లేదు. ఆయన గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి అని సంపూర్ణంగా నమ్ముతున్నాం. నేను పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఓ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతానని చెప్పాను. ఎవరూ అడగకపోయినా ఆ మాట నిలబెట్టుకునేలా విజయవాడ జిల్లాకు ఆయన పేరు పెట్టాం. ఇంకా ఎక్కడైనా ఆయన హయాంలో కానీ, టీడీపీ హయాంలో కానీ ఏమైనా కట్టి ఉంటే.. వాటికి ఆయన పేరు పెట్టాలని వాళ్ల నుంచి ప్రతిపాదన ఉంటే ఇవ్వమనండి. కచ్చితంగా చేస్తాం. కానీ క్రెడిట్‌ రావాల్సిన వ్యక్తికి, క్రెడిట్‌ ఇవ్వకపోవడం ధర్మం, న్యాయం కాదని అందరూ గుర్తించాలి.    
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ అంటే చంద్రబాబునాయుడి కంటే తనకే ఎక్కువ గౌరవమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఆయనంటే తనకు ఎటువంటి కోపమూ లేదన్నారు. గతంలో కూడా ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదన్నారు. టీడీపీ హయాంలో 1983 నుంచి 2019 వరకు ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ప్రభుత్వ రంగంలో కట్టలేదని చెప్పారు. వీళ్లు కట్టకపోయినా, అధికారం ఉందని చెప్పి బలవంతంగా వాళ్లకు కావాల్సిన పేరు వాళ్లు పెట్టుకుని ఆ పేరే కొనసాగించాలని అడగడం ధర్మమేనా? అని అందరూ ఆలోచించాలన్నారు.  

ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని పేదలకు దగ్గరగా, వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన మానవతావాద మహా శిఖరం వైఎస్సార్‌ అని, ఆయన పేరు హెల్త్‌ వర్సిటీకి పెట్టడం సమంజసమని చెప్పారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పుకు సంబంధించిన సవరణ బిల్లుపై అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘చంద్రబాబు వాళ్లతో గొడవ చేయించడం, వాళ్లు గొడవ చేసి సస్పెండై వెళ్లిపోవాలనే ఉద్దేశంతో రావడం చూశాం. ఈ చర్చలో వాళ్లు కూడా పాలుపంచుకుని ఉంటే బాగుండేది.  ప్రభుత్వం చేస్తున్న దానికి కారణాలు వాళ్లు కూడా తెలుసుకుంటే బాగుండేది.

నాకు ఎన్టీఆర్‌ మీద ప్రేమ తప్ప ఆయన్ను అగౌరవపరిచే  ఉద్దేశం ఎప్పుడూ లేదు. నందమూరి తారక రామారావు అనే పేరు మనం పలికితే చంద్రబాబునాయుడికి నచ్చదు. చంద్రబాబు.. ఎన్టీ రామారావు పేరు పలికితే పైనున్న ఎన్టీ రామారావుకు నచ్చదు. ఎన్టీఆర్‌ గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి అని చెప్పని వాళ్లు ఎవరూ ఉండరు. ముఖ్యమంత్రిగా దాదాపు 7 ఏళ్లు పరిపాలన చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే బహుశా ఇంకా చాలా కాలంపాటు బతికుండేవారు. ముఖ్యమంత్రిగా కచ్చితంగా రెండో దఫా పూర్తి చేసి ఉండేవారు. ఆయన బతికి ఉంటే, చంద్రబాబు ఎప్పటికీ సీఎం అయ్యి ఉండేవాడు కాదు’ అని చెప్పారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 


మానసిక క్షోభతోనే అకాల మరణం 
► 1995లో సొంత అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు, ఈనాడు రామోజీరావు పథక రచన, మరో జర్నలిస్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డబ్బుల సంచులు మోయడం వంటి వాటివల్ల మానసిక క్షోభకు గురైన ఎన్టీఆర్‌ అకాల మరణం చెందారు.
► 2019 ఎన్నికలకు వెళ్లేటప్పుడు చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణలు.. ఎన్టీ రామారావు పేరే లేకుండా చేయాలని మాట్లాడుకున్న మాటలు విన్నాం.. చూశాం. ఎన్టీఆర్‌ అంటే ఏమాత్రం గౌరవం లేకుండా వాడు, వీడు అని సంబోధించడం వారి మాటల్లో విన్నాం. చంద్రబాబుకు ఎన్టీఆర్‌ తన కూతురుని బహుమతిగా ఇస్తే, చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటును రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. 
► ఎన్టీఆర్‌ను మానసికంగా దెబ్బ తీసి, ఆయన ఆరోగ్యాన్ని పాడయ్యేలా చేసి, ఆయన మరణానికి కారణమైన వారు ఈరోజు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అంటూ నినాదాలు చేయడమంటే ఇంత కంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? 

వైద్య రంగంలో విప్లవం 
► ఈ రోజు వైద్య రంగంలో రాష్ట్రంలో ఎక్కడా, ఎప్పుడూ చూడని మార్పులు జరుగుతున్నాయి. విప్లవం చోటు చేసుకుంటోంది. నాన్న ఒక అడుగు ముందుకువేస్తే ఆయన కొడుకుగా జగన్‌ నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నాడు. మన ప్రభుత్వం రానంత వరకు ఆరోగ్య శ్రీలో 1059 ప్రొసీజర్స్‌ మాత్రమే ఉంటే.. ఇప్పటికే 2400కు పైగా ప్రొసీజర్స్‌ను పథకంలో చేర్చాం. వచ్చే అక్టోబర్‌ 5వ తేదీ (విజయదశమి) నుంచి ఏకంగా 3,118 ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీలోకి తీసుకు వస్తున్నాం. ఆరోగ్యశ్రీ రూపురేఖలు మారుస్తున్నాం.

► ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ఇస్తున్నాం. శిథిలమైన పరిస్థితులలో ఉన్న ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి. ఫోన్‌ కొడితే రాని 108, 104 పరిస్థితి నుంచి ఏకంగా 1088.. 108, 104 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇంకా 104 అంబులెన్స్‌లు అదనంగా రాబోతున్నాయి. 

► 10 వేలకు పైగా గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు రాబోతున్నాయి. ప్రై మరీ హెల్త్‌ సెంటర్‌లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల నుంచి, జిల్లా ఆసుపత్రులతో కలుపుకుని బోధనాసుపత్రుల వరకు అన్నీ రూపురేఖలు మారిపోతున్నాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రతినెలా బిల్లులు ఇస్తున్నాం. 

► ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో 40,500 పోస్టులలో నియామకాలు చేశాం. అక్టోబరు 15 కల్లా మరో 4 వేల మంది నియామకాలు పూర్తవుతాయి. ఇన్ని విప్లవాత్మక మార్పులు జరుగుతున్నప్పుడు.. ఇదే వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఇదే యూనివర్సిటీకి ప్రియతమ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడం సమంజసమని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఇది ఎవ్వరినీ అగౌరవ పరిచే కార్యక్రమం కానే కాదు. 

బాగా ఆలోచించే ఈ నిర్ణయం..
► వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు బిల్లుపై బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు మనం చేస్తున్నది కరెక్టేనా? అని నన్ను నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నా. ఇది కరెక్ట్‌  అనిపించిన తర్వాతే అడుగులు ముందుకు వేశాం.

► డాక్టర్‌ వైఎస్సార్‌ అందరికీ చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి పథకాలన్నింటి సృష్టికర్త ఆయనే. చదువు రీత్యా ఎంబీబీఎస్‌ డాక్టర్‌. ఆయన ప్రారంభంలో పులివెందుల నియోజకవర్గంలో ఆస్పత్రి పెట్టి డాక్టర్‌గా పని చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించ లేదు?
► చంద్రబాబు ఆనేకసార్లు తాను కేంద్రంలో చక్రం తిప్పేసినట్టు చెప్పుకుంటారు. తిప్పేసిన రోజులు మనందరికీ గుర్తుకు రావాలని ఆయనంతట ఆయనే జ్ఞాపకం చేసుకుని మనకు చెబుతుంటారు. ఎంతో మందిని రాష్ట్రపతులను చేశానని, ఎంతో మందిని ప్రధాన మంత్రులను చేశానని, మోదీ కూడా తనకన్నా జూనియర్‌ అని బాబు చాలా సార్లు చెప్పారు. 

► ఇన్ని గొప్ప పనులు చేశానని చెబుతున్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయాడో మాత్రం చెప్పనే చెప్పడు. అధికారంలో లేనప్పుడు మాత్రమే ఆయనకు ఎన్టీ ఆర్‌ గుర్తుకు వస్తారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి సహకరించిన ఈనాడు రామోజీరావు వంటి వారికి కేంద్రం నుంచి ఈయన అవార్డులు ఇప్పిస్తాడు. కానీ ఎన్టీఆర్‌కి మాత్రం భారతరత్న అవార్డు రాదు. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరో రకంగా ప్రవర్తించే రాజకీయ నాయకుల మధ్య రాజకీయాలు నలుగుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement