రైతుల ఆదాయం రెట్టింపవ్వాలంటే ముందుగా వారు పంటపై చేస్తున్న వ్యయం తగ్గాలి. దాంతో పాటు వారికి లభిస్తున్న గిట్టుబాటు ధర పెరగాలి. అలా జరగాలంటే వీరికి జాతీయ స్థాయి మార్కెట్ అందుబాటులోకి రావాలి. రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా ఇది సాధ్యం కావాలి. ఆర్‌బీకేలను ఈ– మార్కెట్ సెంటర్లుగా ఉపయోగించాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతుల ఆదాయం రెట్టింపు కావడమే లక్ష్యంగా వీలైనంత వరకు లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ–మార్కెట్ ప్లాట్ ఫామ్స్‌ను వచ్చే ఖరీఫ్ నాటికి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. ప్రతి అంశం ఒకదానికొకటి కనెక్ట్ కావాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్‌బీకేల్లో మౌలిక సదుపాయాల కల్పనపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
► రైతు భరోసా కేంద్రాల పక్కన దాదాపు రూ.6 వేల కోట్లతో మల్టీపర్పస్ ఫెసిలిటీస్‌లో భాగంగా మొత్తం 13 రకాల సదుపాయాలు కల్పించాలి.
► గోదాములు, డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్, కలెక్షన్ సెంటర్స్, కోల్డ్ రూమ్‌లు – స్టోరేజీలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, అసేయింగ్ ఎక్విప్‌మెంట్, జనతా బజార్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, సెలెక్టెడ్ గ్రామాల్లో ఆక్వా ఇన్‌ఫ్రా, సెలెక్టెడ్ గ్రామాల్లో క్యాటిల్ షెడ్స్, ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లు, ఈ –మార్కెటింగ్ మల్టీపర్పస్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు ఆప్కాబ్ ద్వారా నాబార్డ్‌కు పంపించి చర్యలు తీసుకోవాలి.
► గోదాముల వద్దే జనతా బజార్లు ఏర్పాటు చేయడంపై అనుకూలతలు, ప్రతికూలతలపై అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేయాలి.
ఆర్‌బీకేల్లో మౌలిక సదుపాయాలు
► ఆర్‌బీకేలను బలోపేతం చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉండాలి. క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ సీడ్స్, క్వాలిటీ ఫెర్టిలైజర్స్ ఉండాలి. ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ వల్ల రైతులు తమ ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు.
► రైతు తన పంటను అమ్ముకోవాలంటే జనతా బజార్లు అందుబాటులోకి రావాలి. ఆర్‌బీకేలు అన్నీ ఫంక్షనింగ్‌లోకి రావాలి. పంటల ఈ–క్రాపింగ్ వల్ల వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం నమోదవుతుంది. దాని వల్ల పంటలకు బీమా ప్రీమియమ్ చెల్లింపుతో పాటు, వాటికి గిట్టుబాటు ధర కల్పన, పంట నష్టం జరిగితే పరిహారం చెల్లింపు వంటివి ఎంతో సులభం అవుతాయి.
► గోదాముల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలి? ఎప్పుడు పూర్తి చేయాలి? బడ్జెట్ నిధులు వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి. ఆ ప్రణాళికలో జనతా బజార్లను, ఆక్వా రంగాన్ని కూడా కలపాలి.
► జనతా బజార్లు, షెడ్యూలింగ్, సెకండరీ ప్రాసెసింగ్‌కు సంబంధించి వెంటనే తగిన ప్రణాళిక సిద్ధం చేయాలి. ఆ తర్వాత పంటలకు కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)పై కసరత్తు చేయాలి.
పీఏసీఎస్‌లను బలోపేతం చేయాలి
► ప్రాథమిక వ్యవసాయ పరపతి సం«ఘాల (పీఏసీఎస్)ను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. పీఏసీఎస్‌ల ముందున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టాలి.
► దీనిపై ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిశీలించి, ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి.
మహిళా సాధికారతకు పెద్దపీట
► ఆసరా, చేయూత పథకాలు మెజార్టీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాం. కేవలం పాల ధర పెంచినంత మాత్రాన రైతులకు పూర్తి ప్రయోజనం కలగదు.
► జనతా బజార్లలో మత్స్య సంపద విక్రయ కేంద్రాలను కూడా అందుబాటులోకి తెస్తారు. ఇదంతా ఎందుకంటే సాధ్యమైనన్ని అనుబంధ కార్యకలాపాలను రైతులకు, మహిళలకు అందుబాటులోకి తేవటానికే. వారి ఆదాయం పెంచడానికే. అమూల్, ఇతర సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటం కూడా ఇందులో భాగమే. ఉపాధి అవకాశాలు కోరుతూ ఇప్పటికే మహిళల నుంచి లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
గతంలో రికార్డులు తారుమారు
► 2016లో గత ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ (ఆన్‌లైన్ రికార్డులు) పేరుతో ప్రక్షాళన అంటూ రికార్డులను తారు మారు చేసిందని, ఇష్టానుసారం పేర్లు మార్చేశారని సమావేశంలో అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈ అంశాన్ని రానున్న స్పందన సమీక్ష అజెండాలో చేర్చి, కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
► సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, అగ్రికల్చర్ కమిషనర్ అరుణŠ కుమార్, నాబార్డు సీజీఎం ఎస్‌కే జన్నావర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
30 ఏళ్ల దాకా ఉచిత విద్యుత్‌కు ఢోకా ఉండదు
► పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఓ 30 ఏళ్ల పాటు శాశ్వతంగా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌కు ప్రణాళికలు వేసింది. దీంతో పాటు యూనిట్ రూ.2.50కే లభ్యమయ్యేలా తగు ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యలన్నీ రైతుకు నాణ్యమైన విద్యుత్ అందేలా చూస్తాయి. చివరికి పంటకయ్యే ఖర్చు తగ్గటానికి ఇవి కూడా ఉపకరిస్తాయి.
► విజన్‌తో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ తీసుకొస్తున్నాం. ఇందువల్ల రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు.
► క్వాలిటీ పవర్ ఇవ్వాలంటే మీటర్లు ఉండాలి. అప్పుడే ఫీడర్లపై భారం ఎంతో కూడా తెలుస్తుంది. ప్రభుత్వమే నేరుగా రైతులకు ప్రత్యేక అకౌంట్లలో డబ్బు జమ చేస్తుంది. అందువల్ల ఎక్కడా రైతులకు విద్యుత్ బిల్లుల సమస్య ఉండదు.
► నాడు శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులను కొన్ని వేల కోట్ల రూపాయలతోనే కట్టారు. అదే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.55 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. ఇదే ప్రాజెక్టు మరో 10 సంవత్సరాలు ఆలస్యం అయితే ఖర్చు రెండింతలు పెరుగుతుంది. అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment