AP: రాజకీయాల్లో నవశకం | CM YS Jagan Create New Era In AP Politics | Sakshi
Sakshi News home page

AP: రాజకీయాల్లో నవశకం

Published Fri, Dec 31 2021 5:35 PM | Last Updated on Fri, Dec 31 2021 6:03 PM

CM YS Jagan Create New Era In AP Politics - Sakshi

సాక్షి, అమరావతి  ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో నవ శకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారు. చట్టప్రకారం వచ్చే పదవులే తప్ప, ప్రాధాన్యత లేకుండా అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని, మహిళలను అందలమెక్కించి, ప్రాధాన్యత కలిగిన పదవులను కట్టబెట్టారు. సామాజిక న్యాయమంటే ఇదీ అని చేతల్లో చూపించారు. ఆ వర్గాలను చైతన్యవంతం చేస్తున్నారు. వారి అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు. రాజకీయాల్లో నవ చరిత్ర లిఖిస్తున్నారు. 

రెండున్నరేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 60 శాతం అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారిని బరిలోకి దించారు వైఎస్‌ జగన్‌. చట్ట సభల్లో వారికే అగ్రస్థానమని చాటి చెప్పారు. 2021లోనూ చట్ట సభలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతానికి పైగా ఈ వర్గాలకే ఇచ్చారు. నామినేటెడ్‌ పనుల్లోనూ 50 శాతం ఆ వర్గాలకు ఇచ్చారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసన మండలి చైర్మన్‌ పీఠంపై ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్‌ రాజును కూర్చోబెట్టారు. అంతేకాదు.. మండలి వైస్‌ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంను ఎంపిక చేశారు. శాసనమండలి చరిత్రలో మైనార్టీ మహిళ వైస్‌ చైర్మన్‌ కావడం ఇదే ప్రథమం. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు బాటలు వేసిన సీఎం వైఎస్‌ జగన్‌. ఇది రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారడానికి దోహదం చేస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మండల, జిల్లా పరిషత్‌లలో కోటాకు మించి 
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన పదవులకంటే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చారు. ఈ ఏడాది 648 మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహిస్తే.. అందులో 635 మండల పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంది. ఇందులో బీసీల వర్గాలకు చెందిన వారికి 239 ఎంపీపీ(మండల పరిషత్‌ అధ్యక్షులు) పదవులు ఇచ్చారు. అంటే.. 38 శాతం బీసీలకు ఇచ్చినట్లు. 29 శాతం ఎంపీపీ పదవులను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు  67 శాతం ఎంపీపీ పదవులు ఇచ్చారు. ఎన్నికలు జరిగిన 13 జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవులను వైఎస్సార్‌సీపీ గెల్చుకోగా, 69 శాతం జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కట్టబెట్టారు. 

సార్వత్రిక ఎన్నికల నుంచే సామాజిక న్యాయం 
సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున 60 శాతం టికెట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే సీఎం వైఎస్‌ జగన్‌ కేటాయించారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించాక.. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 60 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. నలుగురు ఉప ముఖ్యమంత్రులను ఆ వర్గాల నుంచే నియమించారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరితను నియమించారు. ఎస్సీ వర్గానికి చెందిన మహిళలను హోంశాఖ మంత్రిగా నియమించడం చరిత్రలో ఇదే తొలిసారి. రాజ్యసభలో రాష్ట్రం తరఫున ఖాళీ అయిన నాలుగు స్థానాల్లో.. రెండింటిని బీసీ వర్గాల నుంచే భర్తీ చేశారు.  

శాశ్వత ఉద్యోగాలలోనూ.. 
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల శాశ్వత ఉద్యోగులను నియమించారు. ఇందులో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే వచ్చాయి. రెండున్నరేళ్లలో మరో 2.70 లక్షల వలంటీర్‌ ఉద్యోగాలు, మిగిలినవి కలుపుకుని మొత్తం 6.03 లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. వీరిలోనూ 75 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే.

మున్సిపల్, కార్పొరేషన్‌ పదవుల్లోనూ.. 
రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 13 కార్పొరేషన్లనూ వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. మేయర్‌ పదవుల్లో ఏడింటిని సీఎం వైఎస్‌ జగన్‌ బీసీలకే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 92 శాతం మేయర్‌ పదవులను ఇచ్చారు. ఎన్నికలు జరిగిన 87 మున్సిపాల్టీలలో 84 వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. ఇందులో 73 శాతం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. 

చట్టం చేసి మరీ పదవులు, పనులు.. 
నామినేటెడ్‌ పదవుల్లో, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు ఇచ్చేలా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చట్టమే చేశారు. ఆ చట్టం ప్రకారం నామినేటెడ్‌ పదవులు, పనులను వారికి పంపిణీ చేశారు.  
రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్లలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. 
 ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 58 శాతం ఇచ్చారు.  ఈ కార్పొరేషన్లలోని 484 నామినేటెడ్‌ డైరెక్టర్ల పదవుల్లో 58 శాతం ఈ వర్గాలకే ఇచ్చారు. 
ఇవి కాక బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మరో 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు మరో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి.. వాటి చైర్మన్‌ పదవులను ఆ వర్గాలకే కేటాయించారు. వీటిలోని 684 డైరెక్టర్‌ పోస్టులను వారికే ఇచ్చారు. 

శాసన మండలిలోనూ.. 
శాసన మండలిలో ఖాళీ అయిన 14 స్థానాల్లో (మూడు ఎమ్మెల్యే కోటా.. 11 స్థానిక సంస్థల కోటా) ఏడింటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించి, గెలిపించారు. మండలిలో 58 మంది సభ్యులు ఉంటే.. అందులో వైఎస్సార్‌సీపీ సభ్యులు 32 మంది ఉన్నారు. ఇందులో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement