మంగళవారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం.. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఇక్కడి హోం మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు దిశ చట్టం, శాసన మండలి రద్దు.. చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి.
► విభజన వల్ల జరిగిన నష్టంతోపాటు, కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక వనరుల లేమితో ఇక్కట్లు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్ని విధాలుగా సాయం చేయాలని సీఎం కోరారని తెలిసింది. హోం మంత్రితో సమావేశానికి ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్‌సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా వెళ్లారు.
► కాగా బుధవారం ఉదయం 10.30 గంటలకు మరోసారి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ సమావేశం కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందు ఉదయం 9 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశం కానున్నారు.
► పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన రూ.4 వేల కోట్ల మేర రీయింబర్స్ చేయాలని, పునరావాస సాయం త్వరితగతిన అందించాలని కోరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం అనంతరం బయటకు వస్తూ అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రధాని కార్యాలయ అధికారులతో ఎంపీల భేటీ
► ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె.మిశ్రా, ప్రధాన మంత్రి సలహాదారు భాస్కర్ కుల్బేతో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి.
► ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడంతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయానికి సంబంధించి అన్ని అంశాలను కూలంకషంగా వివరించారు.
► దిశ చట్టం చట్టరూపం దాల్చే ప్రక్రియ త్వరితగతిన చేపట్టాలని, శాసన మండలి రద్దు చట్ట రూపం దాల్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
► పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన రూ.4 వేల కోట్ల మేర నిధులను రీయింబర్స్ చేయాల్సి ఉందని, పునరావాస సాయానికి అయ్యే వ్యయం సుమారు రూ.33,010 కోట్ల మేర కూడా త్వరితగతిన చెల్లించాల్సి ఉందని వివరించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు వీలుగా ఎప్పటికప్పుడు ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరారు.
వెనకబడిన జిల్లాలకు సాయం పెంచాలి
► కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల రూపేణా, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి గత ఏడాది, ప్రస్తుత ఏడాది స్వల్ప మొత్తంలో నిధులు విడుదలయ్యాయని, పెండింగ్‌లో ఉన్న గ్రాంట్లు విడుదల చేయాలని కోరారు.
► వెనకబడిన జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ఆర్థిక సహాయం పొందుతున్న కలహండి, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో తలసరి సగటున రూ.4,000 ఇస్తే, ఏపీలో వెనకబడిన 7 జిల్లాల్లో కేవలం రూ.400 చొప్పున మాత్రమే ఇస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడిన జిల్లాలకు కూడా అదే తరహాలో పెంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
► విభజన జరిగిన తొలి ఏడాది 2014–15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉందని వివరించారు.
ప్రత్యేక హోదాను వర్తింపజేయాలి
► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదికలో చెప్పిందని, దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదాను రాష్ట్రానికి వర్తింపజేయాలని కోరారు.
► ఏపీ విభజన చట్టంలో పొందు పరిచిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి చేయూత ఇవ్వాలని కోరారు. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం– చెన్నై కారిడార్, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ కోసం తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
► పోలీసు వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయని, ఈ విషయంలో ఏపీ పోలీస్ విభాగం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోందని వివరించారు. అవసరమైన వ్యవస్థలు, సామర్థ్యాల పెంపునకు ప్రయత్నాలు జరిగినా నిధుల లేమి, సిబ్బంది కొరత వల్ల ఆశించిన లక్ష్యాలను చేరుకోలేదన్నారు. అవసరాలకు అనుగుణంగా పోలీసు విభాగం సమర్థతను పెంచేలా సహాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment