మనసా వాచా కర్మణా ‘స్వచ్ఛ సంకల్పం’ చేయాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Mohan Reddy Review On Swatcha Sankalpam, Jal Jeevan Mission | Sakshi
Sakshi News home page

మనసా వాచా కర్మణా ‘స్వచ్ఛ సంకల్పం’ చేయాలి: సీఎం జగన్‌

Published Thu, Apr 29 2021 4:30 PM | Last Updated on Thu, Apr 29 2021 6:30 PM

CM YS Jagan Mohan Reddy Review On Swatcha Sankalpam, Jal Jeevan Mission - Sakshi

అమరావతి: ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యాచరణ (జగనన్న స్వచ్ఛ సంకల్పం)తో పాటు, వైఎస్సార్‌ జలకళ, గ్రామీణ తాగునీటి సరఫరా (జల్‌జీవన్‌ మిషన్-జేజేఎం), వీధుల్లో ఎల్‌ఈడీ లైటింగ్‌ (జగనన్న పల్లె వెలుగు), గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్‌ చాలా ముఖ్యం. క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌).. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ జయంతి రోజు జూలై 8న ప్రారంభం అవుతుంది’ అని సీఎం జగన్‌ తెలిపారు. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు కనిపించకూడదని స్పష్టం చేశారు. సీవేజ్‌ పంపింగ్‌ ఎలా ఉంది? ఆ నీటిని ఎలా డిస్పోస్‌ చేయడం ఎలా అనేది చూడాలని అధికారులకు సూచించారు. మురుగునీటిని ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులకు వాక్సినేషన్‌ మొదలు, యూనిఫామ్, గ్లౌజ్‌లు, మాస్క్‌లు, కోట్స్‌ అన్నీ అదనంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. 

‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అనే నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుచేయాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ-వాహనాల నిర్వహణ భారం కాకుండా చూసుకోవాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలపైనే ఎక్కువ వ్యయం చేయాలని తెలిపారు. ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’లో గ్రామాలు, పట్టణాల్లో పూర్తి పారిశుద్ధ్యం కోసం మున్సిపల్‌ విభాగం కూడా పంచాయతీరాజ్‌తో కలిసి పని చేయాలని సూచించారు. మనసా వాచా కర్మణా ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకోవాలని చెప్పారు. మే 1వ తేదీ నుంచి వంద రోజుల పాటు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యాచరణ చేపడుతున్నట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు.

వైఎస్సార్‌ జలకళ: ఈ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల బోర్లు వేయాలని నిర్ణయం. చిన్న, మధ్య తరహా రైతులకు 1.5 లక్షల పంప్‌సెట్లు ఇవ్వాలని, దీంతో 3 లక్షల రైతులు ప్రయోజనం పొందుతారని అంచనా. 5 లక్షల ఎకరాలను సాగునీరు అందుతుందని లెక్క. బోర్‌ వేయాలని ఏ రైతు దరఖాస్తు చేసినా, ఎప్పుడు ఆ బోర్‌ వేస్తామన్నది స్పష్టంగా చెప్పాలి. దీనికి ఎస్‌ఓపీ ఖరారు చేయండి. ఇచ్చిన తేదీన కచ్చితంగా బోరు వేయాలి. ఆ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ కాకూడదు. తేదీ ఇస్తున్నామంటే, కేవలం బోరు వేయడం మాత్రమే కాదు. నీరు పడిన తర్వాత కచ్చితంగా నెల రోజుల లోపు, విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి, పంప్‌సెట్‌ బిగించాలి. సొంతంగా బోర్లు వేసుకున్న రైతులు ఎవరైనా పంప్‌సెట్‌లు కోరితే వారికి కూడా ఇవ్వండి. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంధన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి. ప్రతి నియోజకవర్గంలో నెలకు కనీసం 20 బోర్లు వేయాలి.

గ్రామీణ తాగునీటి సరఫరా (జల్‌జీవన్‌ మిషన్‌- జేజేఎం): జగనన్న కాలనీల్లో కూడా ఈ కార్యక్రమం అమలు చేయాలి. నీటి వనరు, సరఫరా రెండూ ముఖ్యమే. జగనన్న కాలనీల్లో జల్‌జీవన్‌ మిషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో నీటి వినియోగంపై ముందే పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రతి గ్రామంలో ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఆ మేరకు ఏటా ఎప్పుడెప్పుడు, ఏయే ట్యాంకుల్‌ క్లీన్‌ చేయాలన్న దానిపై ఒక ప్రొటోకాల్‌ రూపొందించుకోండి. ఏటా వేసనికి ముందే అన్నీ పక్కాగా ప్లాన్‌ చేయాలి. 
ఏలూరు వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

వీధుల్లో ఎల్‌ఈడీ లైటింగ్‌ (జగనన్న పల్లె వెలుగు): వీధి దీపాలు ఎల్‌ఈడీ వాడకంతో యేటా దాదాపు రూ.160 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. దాదాపు 4 లక్షల దీపాలు కావాలి. ఆ మేరకు కార్యాచరణ సిద్దం చేయండి. 

గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు: ఏపీ రూరల్‌ రోడ్‌ కనెక్టివిటీ ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్‌పీ)- ఈఏపీ 30 ఏళ్లుగా 30 వేల కి.మీ. బీటీ రోడ్లు మాత్రమే ఉండగా, మనం అధికారంలోకి వచ్చాక 10 వేల కి.మీ రహదారుల నిర్మాణం జరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. 

ఈ సమావేశానికి పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజాశంకర్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ శ్రీలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.

చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె
చదవండి: ఇప్పటివరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement