‘అధికారం అనేది బాధ్యతల నుంచే వస్తుందన్న విషయాన్ని అనుక్షణం గుర్తుంచుకోవాలి –సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. నిర్దేశిత సమయంలోగా వినతులు, దరఖాస్తుల పరిష్కారం, అమలును పర్యవేక్షించేందుకు పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దరఖాస్తు ఎక్కడ ఆగినా సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేలా పీఎంయూ కాల్‌సెంటర్ పనిచేస్తుంది. దరఖాస్తు పెండింగులో ఉంటే ఉదయం డిజిటల్ మెసేజ్ చేస్తారు, మధ్యాహ్నం లోగా కూడా పరిష్కారం కాకుంటే నేరుగా సంబంధిత సిబ్బందికి పీఎంయూ కాల్ చేయనుంది. పీఎంయూలో 200 మంది సిబ్బంది పనిచేస్తారు. మొదటగా నాలుగు రకాల సేవలపై పర్యవేక్షణను అమల్లోకి తెచ్చారు. అక్టోబర్ నుంచి 543 రకాలకుపైగా సేవలపై పీఎంయూ దృష్టి సారించనుంది. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...
దరఖాస్తుల ఫాలో అప్ కోసం కాల్ సెంటర్
► బియ్యం కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి సచివాలయాల్లో అందే దరఖాస్తులను నిరంతరం ఫాలో అప్ చేసి పరిష్కరించే లక్ష్యంతో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు. సచివాలయ ఉద్యోగి నుంచి ఎమ్మార్వో, ఎంపీడీఓ, సెక్రటరీల స్థాయి వరకూ ఫాలోఅప్ జరుగుతుంది.
కారణం వెంటనే తెలియాలి...
► 10 రోజుల్లో బియ్యం కార్డు, 10 రోజుల్లో పెన్షన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా కచ్చితంగా రావాలి. నిర్ణీత సమ యంలోగా దరఖాస్తు పరిష్కారం కాకపోతే కారణం ఏమిటనేది ముఖ్యమంత్రికార్యాలయానికి తెలియాలి. వెంటనే సంబంధిత కలెక్టర్తో, జేసీతో మాట్లాడేలా ఉండాలి. ఆ స్థాయిలో ప్రజల వినతుల మీద దృష్టి ఉండాల్సిందే.
► కాల్ సెంటర్లో ఆటోమేటిక్ ప్రాసెస్ ఉండాలి, డేటా అనలిటికల్ టిక్స్ రావాలి.
► జవాబుదారీతనం ఉండాలి. అలసత్వం ఎక్కడ ఉన్నా తెలియాలి.
► కాల్‌సెంటరే కాకుండా దరఖాస్తుల పెండింగ్‌పై సెక్రటరీ, కలెక్టర్, జేసీ తదితర స్థాయి అధికారులకు అలర్ట్స్ వెళ్లేలా మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ కూడా ఉండాలి.
పథకాల వివరాలతో డిజిటల్ బోర్డులు
► సచివాలయాల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, మార్గదర్శకాలను బోర్డుల ద్వారా ప్రజలకు వెల్లడించాలి.
► అన్ని సచివాలయాల్లో టాయిలెట్ల సౌకర్యంకల్పించాలి. నూతన వార్డు సచివాలయాలు, అర్బన్ హెల్త్ క్లినిక్స్‌పై దృష్టి పెట్టాలి.
భూ రికార్డుల స్వచ్ఛీకరణకు షెడ్యూల్...
► భూ రికార్డుల ప్రక్షాళనకు ఒక షెడ్యూల్‌ను సిద్ధం చేయాలి. ఏ గ్రామానికి సంబంధించిన రికార్డులు అదే గ్రామంలో ఉంటే సమస్యలు తగ్గుతాయి.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సచివాలయాల్లో బయో మెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
► ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, గ్రామ, వార్డు సచివాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మారుమూల సచివాలయాలకు ఇంటర్నెట్
– మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాలకు కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఫంక్షనల్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులతో ఈ సచివాలయాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తారు. ఇంటర్నెట్ లేని 512 సచివాలయాలను ఈ విధానం ద్వారా అనుసంధానం చేస్తారు. మొదటగా 213 సచివాలయాలకు ఫంక్షనల్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును, మిగిలిన సచివాలయాలకు వచ్చే 2 నెలల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తారు.
సెప్టెంబర్లోగా ఖాళీల భర్తీ
► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను సెప్టెంబర్‌లోగా భర్తీ చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాల గురించి సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లకు ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండాలి.
► ఈ సందర్భంగా సామాజిక తనిఖీ మార్గదర్శకాలను సీఎం జగన్ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment