
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పోలవరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పోలవరం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్ వే, స్పిల్ చానల్ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం నిర్మాణ పనులపై అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్ వే లో 2, 17, 443 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు పూర్తి చేయగా.. స్పిల్ వే పిల్లర్లు పై 160 గడ్డర్లు ఏర్పాటుతో 52మీటర్లు ఎత్తుకు నిర్మించారు. గేట్ల ఏర్పాటు లో కీలకమైన 48 ట్రూనియన్ భీంలకు గాను 30 ట్రూనియన్ భీంల నిర్మాణం పూర్తి చేశారు. కరోనా కాలంలోను లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనితో పాటు స్పిల్ ఛానల్ లో 1,10,033 క్యూబిక్ మీటర్లు.. అలాగే 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేశారు. 902 కొండ తవ్వకం, గ్యాప్ 3, గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు వేగంగా సాగుతున్నాయి.
కాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తయ్యేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి నిధులు రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 2017 లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తున్న సీఎం జగన్ కేంద్రాన్ని ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 2,234 కోట్ల నిధులు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment