‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్’‌పై సీఎం జగన్‌ సమీక్ష | CM YS Jagan Review Meeting On Clean Andhra Pradesh Program | Sakshi
Sakshi News home page

‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్’‌పై సీఎం జగన్‌ సమీక్ష

Published Tue, Mar 23 2021 8:00 PM | Last Updated on Tue, Mar 23 2021 8:58 PM

CM YS Jagan Review Meeting On Clean Andhra Pradesh Program - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు చెత్త సేకరణకు చర్యలు చేపట్టాలన్నారు. క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌), జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టేలా చర్యలు ఉండాలి. ప్రతి వార్డుకు 2 చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 8వేల ఆటోమేటిక్ ట్రక్కులు కొనుగోలు చేయాలి.

అదే విధంగా, జులై 8న వాహనాల ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. చెత్తను సేకరించే ప్రతి ట్రక్కుకు జీపీఎస్, కెమెరాల ఏర్పాటు చేయాలి. ప్రతి వీధి చివర డస్ట్ బిన్‌ ఉండాలి. సేకరించిన తడి, పొడి చెత్తను ప్రాససింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేయాలి. అలాగే వ్యర్థజలాల శుద్ధికోసం ట్రీట్‌ మెంట్‌ప్లాంట్లను స్థాపించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై దృష్టిపెట్టాలి’’అని ఆదేశించారు. 

కాగా ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ,  పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌జైన్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, విశాఖ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌ పి రామకృష్ణా రెడ్డి, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

రూ. 33,406 కోట్ల అంచనా
జగనన్న కాలనీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల కోసం, మొత్తంగా రూ.30,691 కోట్లు ఖర్చు, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో కలిపి 33,406 కోట్లు ఖర్చు అవుతుందని సమావేశంలో ప్రాథమిక అంచనా వేశారు. ఈ క్రమంలో.. ‘‘జగనన్నకాలనీ పనుల్లో నాణ్యత చాలా ముఖ్యమైనది. ప్రతి పనిలోనూ క్వాలిటీ కనిపించాలి’’అని అధికారులకు స్పష్టం చేశారు.

విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
భోగాపురం ఎయిర్‌పోర్టు, బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్, పోలవరం నుంచి గోదావరి జలాలను పైపులైన్‌ ద్వారా విశాఖకు తరలింపు పనులను శరవేగంగా ప్రారంభించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ అంశంపై నాలుగు వారాల తర్వాత మరోసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇక మెట్రో ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి.. విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ ఇప్పుడున్న బీచ్‌రోడ్డు విస్తరణ, అలాగే భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్‌ రోడ్డు నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

ఈ క్రమంలో, భూసేకరణతో కలుపుకొని భీమిలి నుంచి భోగాపురం వరకూ రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.1,167 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇక, బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదిక చేపట్టాలని, దేశంలోనే అందమైన రోడ్డుగా తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దీనిని మొదట ప్రాధాన్యత పనిగా గుర్తించాలని, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపైనా కూడా దృష్టిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

విశాఖకు గోదావరి జలాలు
పోలవరం నుంచి గోదావరి జలాలను విశాఖ నగరానికి తరలింపుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రానున్న 30 ఏళ్లకాలానికి విశాఖ నగరానికి నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక రూపొందించాలని, 
పైపులైన్‌ ప్రాజెక్ట్‌ను కూడా ప్రాధాన్యతగా చేపట్టాలని ఆదేశించారు.

విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌పై సీఎం సమీక్ష

  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ నుంచి భోగాపురం వరకూ మెట్రో ప్రతిపాదన
  • మొత్తంగా 76.9 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం
  • 53 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు 
  • దీంతో పాటు 60.2 కి.మీ. మేర ట్రాం కారిడార్‌
  • మెట్రో, ట్రాం కలిపి 137.1 కి.మీ. కారిడార్‌
  • కేవలం మెట్రో నిర్మాణానికి దాదాపు రూ.14వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా
  • ట్రాం సర్వీసులకు మరో రూ.6వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా
  • ట్రాం, మెట్రోల ఏర్పాటుకు మొత్తంగా రూ.20వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement