AP CM YS Jagan Review Meeting With Planning Department In Tadepalli - Sakshi
Sakshi News home page

వాలంటీర్లకు ప్రోత్సాహకాలు: సీఎం జగన్‌

Published Mon, Feb 22 2021 5:05 PM | Last Updated on Tue, Feb 23 2021 5:35 AM

CM YS Jagan Review Meeting On Planning Department In Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి : గ్రామ సచివాలయ వాలంటీర్‌లను ఉగాది రోజున సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని పేర్కొన్నారు. సేవారత్న, సేవామిత్ర.. పేరుతో ఇలా మంచి సేవలను అందించిన వాలంటీర్లను సత్కరించాలన్నారు. ప్రణాళిక శాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నిర్ధేశిత లక్ష్యాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయంలో కూడా డేటా క్రోడీకరణ ఒకరికి అప్పగించాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని, మండల స్థాయిలో ఉన్న ఉద్యోగి దీన్ని సూపర్‌ వైజ్‌ చేస్తారని తెలిపారు.

అదే విధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న డేటాను స్వీకరించాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఆర్బీకేల పరిధిలో చేస్తున్న ఇ-క్రాపింగ్‌ లాంటి డేటాను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. దీనివల్ల ఇ-క్రాపింగ్‌ జరుగుతుందా? లేదా? అన్నదానిపై దృష్టి పెట్టగలుగుతామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు.. ఇలా గ్రామాల్లోని ప్రభుత్వ వ్యవస్థల వద్ద ఇంటర్నెట్‌ సరిగ్గా పనిచేస్తుందా? లేదా? అన్న డేటా కూడా ఎప్పటికప్పుడు రావాలన్నారు. దీనివల్ల పాలన, పనితీరు సమర్థవంతంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. సుస్థిర సమగ్రాభివృద్ధికోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు.

అయితే ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ విభాగాలు సహా ప్రపంచ స్థాయి సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కోలాంటి సంస్థలతో కూడా కలిసి పనిచేయాలని సూచించారు. డేటాను కేవలం సేకరించడమే కాకుండా.. ఆ డేటా ద్వారా  తీసుకోవాల్సిన చర్యలమీద కూడా దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల్లో మనం ఎంతవరకూ లక్ష్యాన్ని చేరుకున్నాం, లోపాలేమిటో గుర్తించాలని తెలిపారు. వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సమావేశానికి ప్రణాళికా శాఖ ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ విజయ్‌కుమార్, కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మ, ఆర్టీజీఎస్‌ సీఈవో జే విద్యాసాగర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


చదవండి: మంత్రి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం జగన్‌
పంచాయతీ ఎన్నికలు; ‘అనంత’లో రికార్డ్‌ మెజారిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement