చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల నిర్మాణం | CM YS Jagan Reviews On Housing Scheme | Sakshi
Sakshi News home page

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల నిర్మాణం

Published Fri, Feb 19 2021 5:16 AM | Last Updated on Fri, Feb 19 2021 9:25 AM

CM YS Jagan Reviews On Housing Scheme - Sakshi

సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఉండేలా చూడాలి. రోడ్ల నిర్మాణం జనాభాకు అనుగుణంగా ఉండాలి. ఒకసారి అన్ని లేఅవుట్లను మళ్లీ పరిశీలించి అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిధుల కొరత లేకుండా చూసుకుంటూ, వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలి.     – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప, ఎట్టి పరిస్థితుల్లో  మురికి వాడలుగా మారకూడదని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్లు ఇస్తున్నామని, అవి సౌకర్యవంతంగా ఉండాలని చెప్పారు. కాలనీల సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతి లేఅవు ట్‌ను మళ్లీ పరిశీలించి అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఏయే సమయాల్లో ఏ మేరకు నిధులు విడుదల చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందువల్ల పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయని చెప్పారు.  

లబ్ధిదారులందరితో ఆప్షన్లు తీసుకోవాలి
తొలి విడతలో దాదాపు 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికే 83 శాతం మంది లబ్ధిదారులు ఎంపిక  చేసుకున్నందున, మిగతా వారి నుంచి కూడా వెంటనే ఆప్షన్లు స్వీకరించాలి.
3 ఆప్షన్లలో లబ్ధిదారులు ఏ ఆప్షన్‌ ఎంచుకున్నా, వారికి సబ్సిడీపై సిమెంట్, స్టీల్‌ అందించాలి. బయట మార్కెట్లో కన్నా తక్కువ ధరకే లభిస్తున్నందన ఆ అవకాశం అందరికీ వర్తింపచేయాలి.  సామగ్రి అందరికీ అందుబాటులో ఉంచాలి.
దీనివల్ల తామే ఇళ్లు కట్టుకుంటామంటూ ఆప్షన్‌ ఎంచుకున్న వారికి లబ్ధి చేకూరుతుంది. ఏ ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నా, వారికి తక్కువ ధరలకు సామగ్రి లభ్యం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దీనివల్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. 
కాలనీల్లో జనాభాకు తగినట్టుగా రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలి. కాలనీల డిజైనింగ్, మౌలిక సదుపాయాల విషయంలో ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి. 

మంచి మొక్కలు నాటాలి
వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్‌వాడీ కేంద్రం ఉండాలి. 1500 నుంచి 5 వేల ఇళ్లకు లైబ్రరీ అందుబాటులో ఉండాలి. పార్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి. 
కాలనీల్లో మొక్కలు నాటే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏవంటే అవి కాకుండా ఆహ్లాదం, ఆరోగ్యాన్ని అందించే మొక్కలను నాటాలి. మంచి వృక్ష జాతులను ఎంచుకోవాలి. ఇంటి ముందు నుంచి వీధి రోడ్లు, కాలనీ ప్రధాన రోడ్ల వరకు మొక్కలను నాటడానికి మార్కింగ్‌ వేసుకోవాలి.
అన్ని ఇళ్లను జియో ట్యాగింగ్‌ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో మంత్రులు బొత్స, చెరుకువాడ, చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ పాల్గొన్నారు. 

మధ్యతరగతి ప్రజల కాలనీల డిజైన్లు పరీశీలన
పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలన్న దానిపై సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీల డిజైన్లను ఆయన పరీశీలించారు. రోడ్ల నిర్మాణం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీల్లో పారిశుధ్యం, పరిశుభ్రత విషయంలో ఉత్తమ విధానాలను అనుసరించాలని సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement