YSR Rythu Bharosa: AP CM YS Jagan Says If Farmer Is Good Then The State Will Be Good - Sakshi
Sakshi News home page

మనది పేదల ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం: సీఎం జగన్‌

Published Tue, Feb 28 2023 12:38 PM | Last Updated on Tue, Feb 28 2023 2:47 PM

CM YS Jagan Says Farmer Is Good Then The State Will Be Good - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమచేశారు. 

ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ్ల రైతులకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. 50 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వరుసగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేస్తున్నాం. తుఫాన్‌ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఏటా రూ.13,500 భరోసా అందిస్తున్నాము. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 50.92 లక్షల మందికి రూ.5,853.74 కోట్లు లబ్ధిచేకూరింది. మూడో విడత కింద 51.12 లక్షల మందికి రూ. 1.090.76 కోట్లు జమ చేస్తున్నాం. 

నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54వేల చొప్పున సాయం అందించాం. ఈ నాలుగేళ్ల కాలంలో రైతు భరోసా కింద రూ.27,062 కోట్లు సాయం అందజేశాము. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నాము. మాండూస్‌ తుఫాన్‌ వల్ల పంట నష్టపోయిన 91,237 మంది రైతులకు రూ. 76,99 కోట్లు అందిస్తున్నాం. వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుంటారు. రైతుల బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఎక్కడా కరువు అనే మాటే లేదు. 

2014-19 మధ్య గత ప్రభుత్వంలో ఓ అన్యాయస్థుడు సీఎంగా ఉన్నాడు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే ఉంది. కరువుకు కేరాఫ్‌ అ‍డ్రస్‌ చంద్రబాబు. మాజీ సీఎం హయంలో ఏటా కరువు మండలాల ప్రకటనే ఉండేది. నాలుగేళ్లుగా ప్రతి చెరువు, రిజర్వాయర్‌ నిండాయి. రాష్ట్రంలో నాలుగేళ్లుగా భూగర్భ జలాలు పెరిగాయి. నాలుగేళ్లుగా ఆహార ధాన్యాల దిగుబడి సగటున 166 లక్షల టన్నులకు పెరిగింది. నాలుగేళ్లుగా రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగింది. ధాన్యం సేకరణ కోసం ఇప్పటి వరకు రూ. 55వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం. రైతు భరోసా ద్వారా రూ.27వేల కోట్లు అందజేశాం.

పట్టా ఉన్న రైతులకే కాకుండా అసైన్డ్‌ భూముల రైతులు, కౌలు రైతులలకూ రైతు భరోసా అందించాము. ఆర్బీకేల ద్వారా రైతన్నలకు విత్తనం నుంచి ఎరువుల వరకు తోడుగా నిలిచాం. మన ఆర్బీకేలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. టీడీపీ పాలనలో ఐదేళ్లలో 30.85 లక్షల మంది రైతులకు రూ. 3,411 కోట్లు మాత్ర​మే అందించారు. మన ప్రభుత్వంలో గడిచిన నాలుగేళ్లుగా రైతులకు రూ.6,685 కోట్ల సాయం అందించాం. రైతన్నకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం తీర్చుతున్నాం. సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు రూ,1,834 కోట్లు చెల్లించాం​. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబుకు మన ప్రభుత్వం మీద కడుపు మండుతోంది. కడుపు మంటకు, అసూయకు అసలే మందు లేదు. చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ. మనది పేదల ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం’ అని అన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement