డిసెంబర్‌ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లు | CM YS Jagan Says That Help Desks In Aarogyasri Hospitals By December 10th | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లు

Published Thu, Nov 19 2020 4:12 AM | Last Updated on Thu, Nov 19 2020 8:58 AM

CM YS Jagan Says That Help Desks In Aarogyasri Hospitals By December 10th - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే నెల 10వ తేదీ నాటికి ఆరోగ్య శ్రీ ఆస్పత్రులన్నింటిలో హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్‌ డెస్క్‌లు, సీసీ కెమెరాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్య మిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్‌వోపీ ఖరారు చేయాలని సూచించారు. ఆరోగ్య ఆసరా ఎలా అమలవుతోందన్నది జేసీలు చూడాలన్నారు. అస్పత్రులలో 9,800 పోస్టులు మంజూరు చేశామని, వాటిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 7,700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 5,797 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. మిగిలిన పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగనన్న తోడు పథకం నవంబర్‌ 25న ప్రారంభం అవుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 6.29 లక్షల దరఖాస్తులకు బ్యాంకులు టైఅప్‌ అయ్యాయని చెప్పారు. మిగిలిన దరఖాస్తులను కూడా వెంటనే బ్యాంకులకు పంపాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

 ఇవి సకాలంలో పూర్తి కావాలి
► గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ), వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు (వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లు), స్కూళ్లకు ప్రహరీల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి కావాలి. బీఎంసీయూల నిర్మాణ పనులు వచ్చే నెల 15వ తేదీ నాటికి 
మొదలు కావాలి.
► ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్ల విలువైన పనులు చేయాలి. సకాలంలో అవి పూర్తి చేస్తే, అదనంగా మరో రూ.5 కోట్ల విలువైన పనులు వస్తాయి. 
► నాడు–నేడు కింద తొలి దశలో 15,715 స్కూళ్లలో పనులు చేపట్టగా, 78 శాతం పూర్తయ్యాయి. డిసెంబర్‌ 31 టార్గెట్‌గా పనులు పూర్తి చేసేలా జేసీలు బాధ్యత తీసుకోవాలి. 
 
విత్తనాలకు లోటు లేకుండా చూడాలి 
► కనీస నాణ్యతా ప్రమాణాలు (ఎఫ్‌ఏక్యూ) లేని వేరుశనగ పంటకు సైతం గ్రేడెడ్‌ ఎమ్మెస్పీ రూ.4,500 ప్రకటించామనే విషయాన్ని బాగా ప్రచారం చేయాలి. 
► రబీ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లోటు లేకుండా చూడాలి. సీఎం–యాప్, ఈ–క్రాప్‌ డేటా నమోదుపై జేసీలు, కలెక్టర్లు దృష్టి పెట్టాలి. 
► తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కాలువల్లో గుర్రపు డెక్కను తొలిగించి నీరు సాఫీగా పారేలా చర్యలు చేపట్టాలి. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ పనుల దృష్ట్యా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డిసెంబర్‌ 31లోగా రబీకి సంబంధించి వరినాట్లు, ఇతర పనులు పూర్తయ్యేలా చూడాలి.  
► జాతీయ ఉపాధి హామీ పనులు బాగా జరుగుతున్నాయి. దాదాపు రూ.150 కోట్ల విలువైన పనులు ఒక్కో వారంలో జరుగుతున్నాయి. అయితే కేవలం రూ.150 కోట్లు మాత్రమే బకాయి ఉండగా, ‘ఈనాడు’ పూర్తిగా తప్పుడు వార్తలు రాస్తోంది. గ్రామాల్లో పనులకు ఎవ్వరూ రాకుండా కుటిల ప్రయత్నం ఇది. బిల్లులు ఇవ్వడం లేదని తప్పుడు వార్తలు రాస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement