సాక్షి, అమరావతి: మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. 87 లక్షల మంది మహిళలకు రూ.27వేల కోట్ల రుణాలున్నాయని, నాలుగు విడతల్లో ‘వైఎస్సార్ ఆసరా’ ద్వారా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. తొలివిడతలో రూ.6,792.20 కోట్లు జమ చేస్తున్నామన్నారు. (చదవండి: ‘వైఎస్సార్ ఆసరా’కు సీఎం జగన్ శ్రీకారం)
‘‘పీఅండ్‌జీ, హెచ్‌యూఎల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల ద్వారా మహిళలకు చేయూతనిస్తాం. పసిపిల్లల నుంచి అవ్వల వరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. తల్లి, బిడ్డలకు పౌష్టికాహారం అందించేలా వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, ఆరేళ్ల పిల్లల నుంచి ఇంటర్ విద్యార్థుల చదువుల కోసం అమ్మఒడి అమలు చేస్తున్నాం. అమ్మఒడి ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన రూ.1800 కోట్ల బకాయిలను చెల్లించాం. హాస్టల్ ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల కోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లు ఖర్చు చేశాం. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు చేయూత అందించాం. ఏడాదికి రూ.18,750ల చొప్పున అందిస్తున్నామని’’ సీఎం పేర్కొన్నారు.
30 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని, త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు రూ.2,250 పింఛన్ ఇస్తున్నామని సీఎం తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చామని, మద్యాన్ని నియంత్రించేందుకు 43వేల బెల్ట్‌షాపులు తొలగించామని పేర్కొన్నారు. 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేశాం. 33శాతం మద్యం షాపులు తగ్గించామని వెల్లడించారు. ఏపీలోని ప్రతి ఇంటిలో ఉండేలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సీఎం జగన్ తెలిపారు.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment